కొండకోనల్లో పద్మాలు
వివిధ రంగాల్లో తమదైన రీతిలో సేవలు అందిస్తూ ఇంతకాలం తగినంత గుర్తింపునకు నోచుకోని పలువురిని తాజాగా పద్మశ్రీ పురస్కారాలు వరించాయి.
దిల్లీ: వివిధ రంగాల్లో తమదైన రీతిలో సేవలు అందిస్తూ ఇంతకాలం తగినంత గుర్తింపునకు నోచుకోని పలువురిని తాజాగా పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. వారి వివరాలు ఇవీ..
రతన్ చంద్రకర్ (66) (అండమాన్-నికోబార్)
అంతరించిపోయే దశలో ఉన్న జారవ గిరిజన తెగవారిని తట్టు/పొంగు వ్యాధి నుంచి రక్షించారు. ఆయన కృషితో ఆ తెగవారి సంఖ్య 76 నుంచి 270కి పెరిగింది. వారి సంస్కృతి-సంప్రదాయాలకు పుస్తకరూపమిచ్చారు.
హీరాబాయ్ లోబి (62) (గుజరాత్)
గుజరాత్‌లోని సిద్ది గిరిజన తెగ అభ్యున్నతికి జీవితాన్ని వెచ్చించారు. బాల్వాడీలను నెలకొల్పి ఆ తెగలోని పిల్లలకు విద్యనందించారు. స్వయంకృషితో ఎదిగి, ‘మహిళా వికాస్ మండల్’ ద్వారా మహిళల ఆర్థిక అభ్యున్నతికి పాటుపడ్డారు.
మునీశ్వర్ చందర్ దావర్ (76) (మధ్యప్రదేశ్)
విశ్రాంత సైనిక వైద్యుడు. మధ్యప్రదేశ్‌లో రూ.2 ఫీజుతో అనేక ఏళ్లుగా పేదలకు చికిత్స అందిస్తూ పేరొందారు. ఇప్పటికీ రూ.20తో వైద్యం అందిస్తున్నారు.
రామ్‌కుయ్‌వాంగ్‌బే నెవ్మే (75) (అస్సాం)
సామాజిక కార్యకర్త. హెరక తెగ సంస్కృతిని పరిరక్షించడానికి జీవితాన్ని ధారపోశారు. 10 ప్రాథమిక పాఠశాలల్ని నెలకొల్పి, వారిలో చైతన్యం కోసం అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
వి.పి.అప్పు కుట్టన్ పొడువాల్ (99) (కేరళ)
గాంధేయవాది. స్వాతంత్య్ర సమరయోధుడు. సంస్కృత పండితుడు. బలహీన వర్గాల అభ్యున్నతికి గత 80 ఏళ్లుగా నిస్వార్థ సేవలందిస్తున్నారు.
వడివేల్ గోపాల్, మాసి సదైయాన్ (తమిళనాడు)
ఇరులా గిరిజన తెగకు చెందిన వీరు పాముల్ని పడతారు. తరతరాలుగా వీరి కుటుంబ వృత్తి ఇది. వీరిద్దరూ నిరక్షరాస్యులు. ప్రమాదకరమైన, విషపూరిత పాముల్ని పట్టడంలో అందెవేసిన చేయి.
నేక్రం శర్మ (59) (హిమాచల్‌ప్రదేశ్)
ఒకే పొలంలో 9 రకాల ఆహార ధాన్యాలు పండించే ‘నౌ అనాజ్’ విధానాన్ని పునరుద్ధరించిన సేంద్రియ రైతు. ఆయన చేసే సాగులో నీటి వినియోగం 50% తక్కువ. దేశీయ విత్తనాలు ఉత్పత్తి చేయిస్తున్నారు.
జానుమ్ సింగ్ సోయ్ (72) (ఝార్ఖండ్)
గిరిజనులు వాడే హో భాష పరిరక్షణకు నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. వారి సంస్కృతి, జీవన విధానంపై ఆరు పుస్తకాలు వెలువరించారు. హో భాషలో పండితుడు. పీజీ కోర్సులో ఆ భాషను చేర్చేందుకు కృషిచేశారు.
ధనిరామ్ టోటో (57) (పశ్చిమ బెంగాల్)
జల్పాయ్‌గుడి జిల్లాలో టోటో (డెంగ్‌కా) భాష పరిరక్షకుడు. టోటో భాషకు లిపి తీసుకువచ్చారు. అంతరించిపోయే ప్రమాదం ఎక్కువగా ఉన్న భాషల జాబితాలో యునెస్కో ఈ భాషను చేర్చింది. దీనిలో 37 అక్షరాలు ఉన్నాయి.
అజయ్‌కుమార్ మండవి (54) (ఛత్తీస్‌గఢ్)
వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో ప్రజలకు పునరావాసం కల్పిస్తున్నారు. కలపపై రకరకాల ఆకృతులు చెక్కడంలో శిక్షణ ఇస్తున్నారు. తుపాకీ వదిలిపెట్టి ఉలి చేతపట్టేలా యువతలో మార్పు తీసుకువస్తున్నారు.
రాణీ మచయ్య (79) (కర్ణాటక)
కొడగు ప్రాంతానికి చెందిన ఈమె ఉమ్మథత్ జానపద నృత్యకారిణి. నాట్యం ద్వారా కడవ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. సంప్రదాయ నృత్యానికి చేయూత అందిస్తూ మహిళలకు నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు.
కె.సి.రున్రెంసంగి (59) (మిజోరం)
ఆయిజోల్‌కు చెందిన జానపద గాయని. మిజో సంస్కృతిని పరిరక్షించడంలో మూడు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. దేశమంతటా కార్యక్రమాలు నిర్వహించే ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
రిసింగ్బర్ కుర్కలాంగ్ (60) (మేఘాలయ)
గిరిజనులు వాడే దుయితారా వాయిద్య తయారీదారుడు, సంగీతకారుడు. నాలుగు తీగలు ఉండే ఖాసీ జానపద సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్నారు. ఈ పరికరాలను పనసచెట్టు కలపతో తయారుచేస్తారు.
మంగళా కాంతి రాయ్ (102) (పశ్చిమబెంగాల్)
కురువృద్ధ జానపద వాయిద్యకారుడు. సరిందాను ఉపయోగించి పిట్టల అరుపుల్ని సృష్టించడంలో దిట్ట. వర్క్‌షాపులు, ప్రదర్శనల ద్వారా 8 దశాబ్దాలుగా ఈ పరికరాన్ని ప్రోత్సహిస్తూ పరిరక్షిస్తున్నారు.
మొవా సుబోంగ్ (61) (నాగాలాండ్)
నాగా వాయిద్యకారుడు. బమ్‌హుమ్ అనే వాయిద్యాన్ని వెదురుతో తయారు చేశారు. వేణువు మాదిరిగా ఇది పనిచేస్తుంది. సంప్రదాయ నాగా సంగీతానికి ఆధునికత జోడించి హొవే పేరుతో ఒక వాయిద్య బృందం రూపొందించారు.
మునివెంకటప్ప (72) (కర్ణాటక)
థమటే అనే జానపద వాయిద్యాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తున్నారు. ఇదొక డప్పులాంటిది. 16వ ఏట నుంచి దీనిని వాయించడం మొదలుపెట్టి ఇప్పుడు ఔత్సాహికులకు శిక్షణనిస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇస్తున్నారు.
దోమర్‌సింగ్ కున్వర్ (75) (ఛత్తీస్‌గఢ్)
‘ఛత్తీస్‌గడీ నాట్య నాచా’ కళాకారుడు. అర్ధ శతాబ్దకాలం నుంచి ఈ సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి జీవితాన్ని అంకితం చేశారు. 13 భాషలు, మాండలికాల్లో దేశవ్యాప్తంగా 5 వేల ప్రదర్శనలు ఇచ్చారు.
పరశురాం కోమాజీ ఖునే (70) (మహారాష్ట్ర)
ఐదు వేల నాటకాల్లో 800 విభిన్న పాత్రలు పోషించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో యువత పునరావాసం కోసం కృషి చేస్తున్నారు. మద్యపానం నుంచి బయటపడడం, మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నారు.
గులాం మహమ్మద్ జాజ్ (81) (జమ్మూ కశ్మీర్)
కశ్మీర్‌లో గత 200 ఏళ్లుగా సంతూర్‌ల తయారీలో ఉన్న కుటుంబాలకు చెందిన 8వ తరం వ్యక్తి. ఈ పరికరాల తయారీతో కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వీటిలో కొన్ని శతాబ్దకాలం నుంచి వాడుకలో ఉన్నాయి.
భానుభాయ్ (66) (గుజరాత్)
చునారా సామాజిక వర్గానికి చెందిన ఏడో తరం కళాకారుడు. మహాభారత, రామాయణ ఘట్టాలను కళాఖండాల రూపంలో చిత్రిస్తుంటారు. దేశ విదేశాల్లో ఈ కళకు ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు 200 కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
పరేశ్ రాత్వా (54) (గుజరాత్)
పిథోడా కళాకారుడు. ఇది 12,000 ఏళ్ల క్రితం నాటి జానపద కళ. ఈ కళ గొప్పతనాన్ని చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా 30 ఎగ్జిబిషన్లు నిర్వహించారు.
కపిల్‌దేవ్ ప్రసాద్ (68) (బిహార్)
చేనేత కార్మికుడు. ఐదు దశాబ్దాలుగా బవాన్ బుటీ నేతను ప్రోత్సహిస్తున్నారు. తాను చేసే అల్లికలపై ప్రాచీన బౌద్ధ చిహ్నాలను ముద్రిస్తున్నారు. నేత వస్త్రాలు రూపొందిస్తారు.
తులారాం ఉర్పేటి (98) (సిక్కిం)
చిన్న రైతు. సంప్రదాయ విధానాలతో చిన్ననాటి నుంచి సేంద్రియ సాగు చేస్తున్నారు. రసాయన ఎరువులపై రైతులు ఆధారపడడం తగ్గేలా శిక్షణను, స్ఫూర్తిని అందిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
China: పుతిన్‌కు అరెస్టు వారెంట్.. స్పందించిన డ్రాగన్
-
Politics News
Bandi Sanjay: కాలయాపన చేయకుండా రైతులను ఆదుకోండి: సీఎంకు బండి సంజయ్ లేఖ
-
Movies News
Social Look: పైనాపిల్‌కు తమన్నా కళ్లజోడు.. పూజాహెగ్డే డిసెంబరు ఫొటో!
-
General News
TSPSC: నా భర్తపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు: హైకోర్టులో నిందితుడి భార్య పిటిషన్
-
General News
AP ICET: ఏపీ ఐసెట్ దరఖాస్తులు ప్రారంభం.. రెండు షిఫ్టుల్లో పరీక్ష!