అండమాన్‌ ఆదిమవాసులకు ఆధునిక వైద్యం

నాగరిక ప్రపంచానికి సుదూరంగా ఉండటమే కాదు... ఆధునికుల పొడ ఏ మాత్రం గిట్టని ఆదిమ ఆటవిక తెగ అది. తమ ప్రాంతంలోకి కొత్తవాళ్లెవరైనా ప్రవేశిస్తే విషపూరిత బాణాలతో దాడికి తెగబడతారు.

Published : 27 Jan 2023 05:04 IST

అంతరించే ముప్పు నుంచి జరావా తెగను రక్షించిన డాక్టర్‌ రతన్‌ చంద్ర కార్‌
పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక

పోర్టుబ్లెయిర్‌: నాగరిక ప్రపంచానికి సుదూరంగా ఉండటమే కాదు... ఆధునికుల పొడ ఏ మాత్రం గిట్టని ఆదిమ ఆటవిక తెగ అది. తమ ప్రాంతంలోకి కొత్తవాళ్లెవరైనా ప్రవేశిస్తే విషపూరిత బాణాలతో దాడికి తెగబడతారు. అందువల్లే అటువైపు తొంగి చూడటానికి కూడా ఎవరూ సాహసించరు. అలాంటి ప్రమాదకరమైన జరావాలున్న అండమాన్‌ దీవుల్లోని ఓ భూభాగంలోకి డాక్టర్‌ రతన్‌ చంద్ర కర్‌ సాహసోపేతంగా అడుగుపెట్టడమే కాకుండా తన వైద్య సేవలతో అక్కడి గిరిజన తెగ ప్రజల మనసును గెలుచుకున్నారు. అంటువ్యాధులతో అంతరించిపోతున్న స్థానిక జాతిని రక్షించారు. ఆధునిక వైద్యంతో వారిని నాగరిక ప్రపంచంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిరుపమానమైన డా.రతన్‌ చంద్ర సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్‌ నికోబార్‌ దీవుల పాలనాధికారుల ఆదేశాలతో పోర్టుబ్లెయిర్‌కు 120 కి.మీ దూరంలో ఉన్న జరావా తెగ ఆవాస ప్రాంతమైన కడమ్టల, లఖ్రలుంగ్టలోకి 1998లో డా.రతన్‌ చంద్ర కర్‌ భయభయంగానే అడుగుపెట్టారు. ఆయనను చూడగానే అక్కడి ప్రజలు చుట్టుముట్టారు. తొలుత ఓ గుడిసెలోకి ప్రవేశించిన డా.రతన్‌ చంద్ర.. ఎలుగుబంటి దాడిలో గాయపడిన వ్యక్తికి తొలుత వైద్యం చేశారు. ఆ తర్వాత క్రమంగా స్థానికులకు దగ్గరై అక్కడ ప్రబలిన మశూచీ, కళ్లకలక వంటి వ్యాధుల నుంచి రక్షించారు. వైద్య సేవలతో ఆదుకున్న రతన్‌ చంద్రను స్థానికులు స్నేహితునిగా భావించి చేరువయ్యారు. అంతరించే ముప్పు నుంచి జరావాలను ఆ వైద్యుడు కాపాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని