సంక్షిప్త వార్తలు(6)

అంతరించిపోతున్న పులులను రక్షించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషను విచారణ సందర్భంగా.. దేశంలోని 53 అభయారణ్యాల్లో మొత్తం 2,967 పులులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదించింది.

Updated : 28 Jan 2023 05:52 IST

దేశంలోని 53 అభయారణ్యాల్లో 2,967 పులులు
సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: అంతరించిపోతున్న పులులను రక్షించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషను విచారణ సందర్భంగా.. దేశంలోని 53 అభయారణ్యాల్లో మొత్తం 2,967 పులులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ సంఖ్య ప్రపంచంలోని మొత్తం పులుల సంఖ్యలో 70 శాతానికి సమానం. 2018 నాటి నివేదిక మేరకు ఈ వివరాలు సమర్పిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. న్యాయవాది అనుపమ్‌ త్రిపాఠి అయిదేళ్ల కిందట దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఈ పిటిషను దాఖలు చేశారు. దేశంలో పులుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్యా భాటి కోర్టుకు తెలిపారు. 


వస్త్ర పరిశ్రమ వ్యర్థాల శుద్ధికి కొత్త ప్రక్రియ

దిల్లీ: వస్త్ర పరిశ్రమ విడుదల చేసే వ్యర్థ జలాలను రెండు అంచెల్లో శుద్ధి చేసి సహజ జల వనరుల్లోకి వదిలే ప్రక్రియను ఐఐటీ-జోధ్‌పుర్‌ పరిశోధకులు కనుగొన్నారు. తొలి అంచెలో ఎలెక్ట్రో కెమికల్‌ ప్రాసెసింగ్‌ చేసి, రెండో అంచెలో గొంగళిపురుగు నిర్మాణాన్ని పోలిన జడ్‌ఎన్‌వో కార్బన్‌ నానో ఫైబర్లతో కాలుష్యాన్ని శుద్ధి చేసే ప్రక్రియ ఇది. వస్త్ర పరిశ్రమ వదిలే వ్యర్థ జలాల్లోని రంగులు నీటి వనరుల్లో కలిసి మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని చేస్తున్నాయి. ఈ జలాల్లో భార లోహాలు, సేంద్రియ పదార్థాలు, రసాయనాలు కూడా ఉంటాయి. ఐఐటీ పరిశోధకులు అటు రంగులనూ, ఇటు సేంద్రియ కాలుష్యాలనూ తొలగించే రెండు అంచెల ప్రక్రియను కనుగొనడం పెద్ద ముందంజ.


17 మంది పాక్‌ ఖైదీల అప్పగింత

దిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన 17 మంది ఖైదీలను భారత్‌ ఆ దేశానికి అప్పగించింది. దేశంలోని వివిధ జైళ్లలో బందీలుగా ఉన్న వీరిని శుక్రవారం అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద పాక్‌ అధికారులకు అప్పగించింది. ఈ మేరకు పాక్‌ హైకమిషన్‌ కార్యాలయం ట్విటర్‌లో వెల్లడించింది.


బెయిలుపై విడుదలైన ఆశిష్‌ మిశ్ర

లఖింపుర్‌ఖేరి (యూపీ): సుప్రీంకోర్టు ఎనిమిది వారాల మధ్యంతర బెయిలు మంజూరు చేయడంతో కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. లఖింపుర్‌ఖేరి జిల్లా జైలు సీనియర్‌ సూపరింటెండెంట్‌ విపిన్‌కుమార్‌ మిశ్ర ఈ విషయాన్ని ధ్రువీకరించారు. పటిష్ఠమైన భద్రత నడుమ జైలు వెనుక గేటు నుంచి ఆయనను బయటకు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు. 2021 అక్టోబర్‌ 3న లఖింపుర్‌ఖేరిలో జరిగిన రైతుల ఆందోళన సందర్భంగా హింస చెలరేగి 8 మంది మృతిచెందిన కేసులో ఆశిష్‌ మిశ్ర విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. బెయిలు కాలంలో ఈయన ఉత్తర్‌ప్రదేశ్‌లో కానీ, దిల్లీలో కానీ ఉండరాదని జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జె.కె.మహేశ్వరిల ధర్మాసనం తమ ఆదేశాల్లో పేర్కొంది.


అధికార భాషగా సంస్కృతం ఎందుకు కాకూడదు?: జస్టిస్‌ బోబ్డే

నాగ్‌పుర్‌: భారతదేశానికి అధికార భాషగా సంస్కృతం ఎందుకు ఉండకూడదని మాజీ సీజేఐ జస్టిస్‌ శరద్‌ బోబ్డే ప్రశ్నించారు. 1949లో వచ్చిన వార్తా పత్రికల కథనాల ప్రకారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ సైతం ఇదే విషయాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తోందన్న ఆయన.. ఆ మేరకు మార్పు రావాలని ఆకాంక్షించారు. సంస్కృత భారతి ఆధ్వర్యంలో శుక్రవారం నాగ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బోబ్డే తన అభిప్రాయాలను పంచుకున్నారు.


ఆదర్శ మార్గంలో మహాకాళేశ్వరాలయం
‘జీరో వేస్ట్‌’ విధానం దిశగా అడుగులు

ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న ప్రసిద్ధ మహాకాళేశ్వరాలయం ప్రత్యేకత చాటుకోనుంది. వ్యర్థాలను సంపూర్ణంగా పునర్వినియోగించేందుకు (జీరో వేస్ట్‌) చర్యలు చేపడుతోంది. తద్వారా మధ్యప్రదేశ్‌లో జీరో వేస్ట్‌ విధానాన్ని అమలు చేస్తున్న తొలి ఆలయంగా నిలవనుంది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు సందర్శించే ఈ ఆలయంలో పెద్దఎత్తున పూల దండలు, ఇతర పూజసామగ్రి, ప్లాస్టిక్‌ సీసాలు, ఆహార వ్యర్థాలు పోగుపడుతున్నాయి. రోజూ సుమారు 10 క్వింటాళ్ల మేర వ్యర్థాలను సిబ్బంది తొలగిస్తున్నారు. ఇప్పటివరకూ వీటిని పురపాలక శాఖకు అప్పజెప్పేవారు. ఇకపై వీటిని ప్రత్యేక పద్ధతుల్లో వేరు చేసి రీసైక్లింగ్‌ చేయడం ద్వారా పునర్వినియోగించనున్నారు. కంపోస్టు ఎరువును కూడా తయారు చేసి ప్రాంగణంలోని మొక్కలకు వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్లాంటును ఆలయానికి చెందిన స్థలంలో ఏర్పాటు చేయనున్నారు. వంట గ్యాసును కూడా ఉత్పత్తి చేసి భక్తులను అన్నం వండటానికి వినియోగించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని