సమస్యలపై గళమెత్తిన స్వామీజీ.. మైకు లాక్కున్న ముఖ్యమంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తొలిసారి.. తీవ్ర అసహనానికి గురయ్యారు. సభలో మాట్లాడుతున్న ఓ స్వామీజీ చేతిలోని మైకును లాక్కున్నారు.

Updated : 28 Jan 2023 05:49 IST

కర్ణాటక సీఎం బొమ్మై అనూహ్య చర్య 

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తొలిసారి.. తీవ్ర అసహనానికి గురయ్యారు. సభలో మాట్లాడుతున్న ఓ స్వామీజీ చేతిలోని మైకును లాక్కున్నారు. బెంగళూరులో మౌలిక సదుపాయాలకు తీవ్రమైన కొరత ఉందని.. నగరవాసులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదంటూ కాగినెల మహాసంస్థానం కనకగురు పీఠాధిపతి ఈశ్వరానందపురి వ్యాఖ్యానించడంతో ఆయన ఇలా అసహనం చెందారు. మహదేవపురలో నిర్వహించిన బహిరంగ సభలో స్వామి మాట్లాడుతూ ‘వర్షాలు కురిసిన సమయంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. అధికారులు ఏమాత్రం స్పందించలేదు. ముఖ్యమంత్రి కూడా గతంలో పలు హామీలు ఇచ్చారు’ అంటూ ఈశ్వరానందపురి మాట్లాడుతుండగా వేదికపైనే ఉన్న బొమ్మై వేగంగా కదలి స్వామీజీ చేతిలోని మైకును లాక్కున్నారు. ‘కేవలం హామీలు ఇచ్చి మర్చిపోయే ముఖ్యమంత్రిని కాదు నేను. సమస్యను పరిష్కరించేందుకు శ్రమిస్తా. నిధులు కేటాయించాం.. పనులు జరుగుతున్నాయి’ అంటూ విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. సీఎం మైకు లాక్కుంటున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. కర్ణాటకలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు