సంక్షిప్త వార్తలు (8)

గణతంత్ర దినోత్సవాల ముగింపును పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా నిర్వహించే ‘బీటింగ్‌ రిట్రీట్‌’ వేడుకలో ఈసారి డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి.

Updated : 29 Jan 2023 07:10 IST

బీటింగ్‌ రిట్రీట్‌లో 3,500 దేశీయ డ్రోన్లు

దిల్లీ: గణతంత్ర దినోత్సవాల ముగింపును పురస్కరించుకుని సంప్రదాయబద్ధంగా నిర్వహించే ‘బీటింగ్‌ రిట్రీట్‌’ వేడుకలో ఈసారి డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఎన్నడూలేని రీతిలో 3,500 దేశీయ డ్రోన్లు ఇక్కడ షోలో పాల్గొంటాయి. ఆదివారం రైసీనా హిల్‌ ప్రాంతంలో సూర్యాస్తమయ సమయాన ఆకాశాన ఇవి వెలుగులీనుతాయి. పరస్పర సమన్వయంతో జాతీయ ప్రముఖుల రూపాలను ఏర్పరుస్తాయి. ఈసారి కార్యక్రమంలో భారత శాస్త్రీయ సంగీత ట్యూన్లు వినిపిస్తాయి. విస్తృత ప్రజాదరణ పొందిన 29 గీతాలను దీనికోసం ప్రత్యేకంగా ఎంపిక చేశారు. త్రివిధ దళాలతో పాటు పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల వాయిద్యకారులు ఈ ట్యూన్లు వినిపిస్తారు. విజయ్‌చౌక్‌లో ప్రధాన వేడుక జరుగుతున్నప్పుడు నార్త్‌బ్లాక్‌, సౌత్‌బ్లాక్‌ భవంతులపై తొలిసారి త్రీడీ యానిమేషన్‌తో ప్రత్యేక కాంతులు విరజిమ్మే ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ దీనికి హాజరవుతారు.


పార్లమెంటులో ‘పౌరుల పిటిషన్‌’కు ప్రత్యేక వ్యవస్థ ఉండాలి
సుప్రీంకోర్టులో వ్యాజ్యం

దిల్లీ: సాధారణ పౌరులు సైతం పార్లమెంటులో పిటిషన్‌ దాఖలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించేలా కేంద్రం, ఇతర విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఎదుటకు విచారణకు రాగా పిటిషన్‌ ప్రతిని కేంద్ర ప్రభుత్వ న్యాయవాదికి అందజేయాలని పిటిషనర్‌కు సూచించింది. విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.  


బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌ దోషి మృతి

దిల్లీ: దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌లో జీవితఖైదు అనుభవిస్తున్న షెహ్‌జాద్‌ అహ్మద్‌ అలియాస్‌ పప్పు శనివారం చనిపోయాడు. క్లోమ వ్యాధితో బాధపడుతున్న అతడు కొంతకాలంగా ఇక్కడి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. 2008 దక్షిణ దిల్లీలోని జామియా నగర్‌లో ఉగ్రవాద అనుమానితులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అందులో ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ చంద్‌ శర్మ ప్రాణాలు కోల్పోయారు. నాటి ఘటనను బాట్లా హౌస్‌ ఎన్‌కౌంటర్‌గా పిలుస్తున్నారు.


పాక్‌ దొంగ లెక్కలపై ఐఎంఎఫ్‌ ఆరా
రూ.2 లక్షల కోట్ల అంతరంపై ప్రశ్నలు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ దొంగలెక్కలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వెలికి తీసింది. 2022-23 బడ్జెట్‌ అంచనాల్లో రూ.2 లక్షల కోట్ల ఉల్లంఘన జరిగిందని పేర్కొంది. ఈ విషయాన్ని ఆ దేశం దృష్టికి తీసుకొచ్చింది. మంగళవారం ఐఎంఎఫ్‌తో చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ లెక్కలు వెలుగులోకి రావడం పాక్‌కు అశనిపాతమే. సెప్టెంబరు నుంచి పాక్‌కు..ఐఎంఎఫ్‌ నిధులు నిలిపివేసింది. దివాలా అంచున ఉన్న దేశానికి ఈ నిధులు కీలకం. ఐఎంఎఫ్‌ ఎలాంటి షరతులు విధించినా తలొగ్గుతామని ఇటీవల పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రానున్న చర్చలు కీలకం కానున్నాయి. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో కేవలం 5,600 కోట్ల డాలర్ల విదేశీ రుణాలు మాత్రమే పాకిస్థాన్‌కు లభించాయి. ఇంత తక్కువస్థాయిలో రుణాలు రావడానికి ఐఎంఎఫ్‌ ప్యాకేచ్కీజీజిని పునరుద్ధరించడంలో పాక్‌ వైఫల్యమే కారణమని ఎక్స్‌ప్రెస్‌ ట్రిబ్యూన్‌ పత్రిక పేర్కొంది.


మూడో వంతుకు పైగా క్షీణించిన అమెజాన్‌ అడవులు

వాషింగ్టన్‌: బ్రెజిల్‌లోని అమెజాన్‌ అడవులు గతంలో శాస్త్రవేత్తలు ఊహించిన దానికన్నా ఎక్కువగా క్షీణించాయి. మానవుల కార్యకలాపాల కారణంగా ప్రస్తుతం మిగిలి ఉన్న అటవీ ప్రాంతంలో 38 శాతం ప్రభావితమైందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. నాలుగు ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన 35 మంది అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అమెజాన్‌ అడవులపై చేసిన అధ్యయనం ‘సైన్స్‌’ జర్నల్‌లో ప్రచురితమయింది. కార్చిచ్చులు, అటవీ ప్రాంతంలో మార్పులు, చెట్లను నరికివేయడం, తీవ్రమైన కరవు అడవుల క్షీణతకు ప్రధాన కారణాలని పరిశోధకులు తేల్చారు. ఇప్పటికిప్పుడు దిద్దుబాటు చర్యలు చేపట్టినా కర్బన ఉద్గారాల విడుదలను అడ్డుకోలేమని అధ్యయనంలో తేల్చిచెప్పారు. ఒకవేళ మనం చెట్ల కొట్టివేత పూర్తిగా ఆపేసినా.. ఇప్పటికే ముంచుకొచ్చిన వాతావరణ మార్పుల వల్ల అడవుల క్షీణత కొనసాగుతూనే ఉంటుందని అధ్యయన ప్రధాన శాస్త్రవేత్త డా.డేవిడ్‌ లపోలా హెచ్చరించారు.


రష్యా ఆయుధాలకు ప్రత్యామ్నాయాలనుభారత్‌కు సూచిస్తాం: అమెరికా

వాషింగ్టన్‌: రష్యా ఆయుధాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనడంలో భారత్‌కు తోడ్పడడాలని అమెరికా ఉప విదేశాంగ మంత్రి విక్టోరియా నులాండ్‌ తమ శాసనకర్తలను కోరారు. దాన్ని తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. నులాండ్‌ ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు భారత్‌, నేపాల్‌, శ్రీలంక, ఖతార్‌ దేశాలను సందర్శించునున్నారు. విదేశీ యాత్రకు బయలుదేరేముందు ఆమె సెనేట్‌ విదేశీ వ్యవహారాల కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా ఆయుధాల నాసిరకం పనితీరును చూసి భారత్‌కు సదరు ఆయుధాల పట్ల ఆసక్తి తగ్గిపోవచ్చని సెనెటర్‌ జెఫ్‌ మెర్క్‌ లే వ్యాఖ్యానించారు. దానికి మంత్రి నులాండ్‌ స్పందిస్తూ.. 60 ఏళ్లపాటు రష్యాతో రక్షణ బంధం నెరపిన తరవాత భారత్‌ ప్రత్యామ్నాయాలను అన్వేషించాల్సి వస్తోందనీ, ఈ విషయంలో దిల్లీకి తోడ్పడటం తమ బాధ్యతగా భావిస్తున్నామన్నారు. భారత్‌తో పాటు దక్షిణాఫ్రికానూ రష్యాకు దూరం జరిగేట్లు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అమెరికా వారించినా భారతదేశం చౌకగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనీ నులాండ్‌ వ్యాఖ్యానించారు.  


జెరూసలేంలో పాలస్తీనా బాలుడి కాల్పులు
ఇద్దరికి గాయాలు

జెరూసలేం: తూర్పు జెరూసలేంలో శనివారం ఓ పాలస్తీనా బాలుడు కాల్పులకు దిగడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరూ తండ్రీకొడుకులని.. వారి ప్రాణానికి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. శుక్రవారం ఇదే ప్రాంతంలో ఏడుగురిని బలితీసుకున్న కాల్పుల ఘటన తర్వాత గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం గమనార్హం. నేరానికి పాల్పడిన 13 ఏళ్ల బాలుడిపై కాల్పులు జరిపామని పోలీసులు ప్రకటించారు. గాయాలపాలైన అతడ్ని ఆస్పత్రికి తరలించామని తెలిపారు. యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటొనీ బ్లింకన్‌ ఆదివారం ఇజ్రాయెల్‌, పాలస్తీనా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఇలాంటి దాడులు మరికొన్ని జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


అదానీ గ్రూప్‌ అవకతవకలపై ప్రభుత్వం స్పందించాలి

అదానీ గ్రూప్‌ తమ షేర్ల విలువను పెంచడానికి అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్‌ విడుదల చేసిన నివేదికతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనివల్ల ప్రజల కష్టార్జితం హరించుకుపోతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండటం శోచనీయం. ఆ సంస్థలో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడుల పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మోదీ సర్కారు వెంటనే స్పందించి సందేహాలను తొలగించాలి.

 మాయావతి


మీ పిల్లలకు నేర్పాల్సింది అదే: హర్ష్‌ గోయెంకా

బాగా డబ్బు సంపాదించి సంపన్నులవ్వాలని మీ పిల్లలకు బోధించకండి. సంతోషంగా జీవించడమెలాగో వారికి నేర్పండి. అప్పుడే వారు పెరిగి పెద్దయిన తర్వాత వస్తువుల ధర కాకుండా వాటి విలువ తెలుసుకుంటారు. రక్తమాంసాలు మాత్రమే ఉన్న ఓ జీవిగా బతకకుండా, కరుణ, దయాగుణం నిండిన మనసున్న ఓ అసలైన మనిషిగా జీవిస్తారు.


సామాన్యులకు అండగా నిలిచాం: బైడెన్‌

రిపబ్లికన్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిలియనీర్లకు పన్నులు తగ్గించే చర్యలు చేపట్టింది. మరోవైపు సామాన్యుల సామాజిక భద్రతను, ఆరోగ్య బీమాను తొలగించే ప్రయత్నం చేసింది. కానీ మా ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలతో సంపన్నులు న్యాయబద్ధమైన పన్నులు చెల్లిస్తున్నారు. సామాన్యులకు ఔషధాల ఖర్చు తగ్గింది.


మార్పు కోసం గళాన్ని వినిపించండి: ఐరాస

వాతావరణ మార్పులను అరికట్టే దిశగా మీ గళాన్ని బలంగా వినిపించండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో దీని గురించి మాట్లాడటంతోపాటు ఇతర వేదికలపై మీ ఆలోచనలను పంచుకోండి. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా తగిన చర్యలు చేపట్టేలా ఒప్పించండి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు