Budget 2023: ‘తయారీ’కి ప్రోత్సాహం?

ఒకవైపు.. ఏప్రిల్‌కల్లా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశ హోదా.. మరోవైపు.. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యం.. ఇంకోవైపు.. వచ్చే ఎన్నికల ముందు ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌..

Updated : 29 Jan 2023 09:05 IST

ఉపాధి విస్తరణే మూలసూత్రం
మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట
తాయిలాలకు అవకాశాలు తక్కువే అంటున్న నిపుణులు
బడ్జెట్‌లో ఆర్థిక బలోపేతానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చని విశ్లేషణ
ఈనాడు, దిల్లీ

ఒకవైపు.. ఏప్రిల్‌కల్లా ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశ హోదా..

మరోవైపు.. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని లక్ష్యం..

ఇంకోవైపు.. వచ్చే ఎన్నికల ముందు ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ (Budget 2023)..

* మధ్యతరగతి ప్రజలు, వేతన జీవులు ఆదాయపన్ను రాయితీలను కోరుకుంటున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అందులో మార్పులు పెద్దగా సాధ్యంకాకపోవచ్చన్న భావన ఆర్థిక నిపుణుల్లో వ్యక్తమవుతోంది.

వచ్చే ఎన్నికల నాటికి సాధ్యమైనంత ఎక్కువ మంది పేదలకు నివాస సౌకర్యం కల్పించడానికి ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కోసం బడ్జెట్‌లో రూ.40వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం లేకపోలేదు.

... ఇలా అవకాశాలు, ఆశలు, ఆశయాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్‌ (Budget 2023) ఎలా ఉండబోతోందోనని యావత్‌ భారతావని ఆసక్తిగా చూస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ (Budget 2023) ఇదే కావడంతో సమాజంలోని అన్ని వర్గాలూ తమకేమైనా ప్రయోజనం దక్కుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాయి. అయితే, మోదీ ప్రభుత్వ వైఖరి గమనిస్తూ వస్తున్న ఆర్థిక నిపుణులు మాత్రం వచ్చే బడ్జెట్‌ (Budget 2023)లో ఆర్థిక స్థిరత్వానికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. ఆర్థిక మంత్రి కూడా ఆ దిశగానే సంకేతాలిస్తున్నారు. ‘‘మూలధనం, మౌలిక వసతుల కల్పనపై పెట్టే ప్రతి రూపాయితో కొత్తగా రూ.2.95 తిరిగి వస్తుంది. అదే రెవెన్యూ వ్యయంపై చేసే ప్రతి రూపాయి వల్ల తిరిగి వచ్చేది 50 పైసల్లోపే’’ అంటున్న నిర్మలా సీతారామన్‌ మాటలను బట్టిచూస్తే మోదీ ప్రభుత్వం ఆర్థిక సంఘటితత్వానికే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మందగమనాన్ని తట్టుకోవటానికి

* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలూ కొంత నెమ్మదించే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం మౌలికవసతుల కల్పన, మూలధన వ్యయానికి ప్రాధాన్యం ఇస్తుందన్నది నిపుణుల భావన.

* మౌలిక వసతులపై ఎంత ఎక్కువ ఖర్చుచేస్తే అంత ఎక్కువగా ఉపాధి కల్పన జరుగుతుంది. అందుకు అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పన్నురహిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ బాండ్ల ద్వారా ఆర్థిక వనరులు సమీకరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నారు.

* తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశాలు బడ్జెట్‌ (Budget 2023)లో పుష్కలంగా ఉన్నాయి. రైల్వే, రోడ్లకు మూలధన వ్యయాన్ని పెంచొచ్చు.

* పర్యావరణానికి ప్రాధాన్యమిస్తూ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఆ రంగానికీ పెద్దపీట వేయొచ్చు.

* విద్యుత్తురంగం ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం క్రాస్‌ సబ్సిడీ విధానాన్ని తొలగించి ఆ స్థానంలో ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనివల్ల విద్యుత్తురంగంలో స్థిరత్వం పెరిగి పెద్దమొత్తంలో పెట్టుబడులు వస్తాయని అంచనావేస్తున్నారు.

* ప్రస్తుతం సరిహద్దుల్లో చైనాతో సున్నితమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం కొత్త బడ్జెట్‌ (Budget 2023)లో రక్షణ దళాల ఆధునికీకరణపై ఎక్కువ దృష్టిసారించవచ్చు.

* మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌, పెట్టుబడులు, ఉత్పాదకత పెంపు, ఇంధనరంగంలో మార్పులు, పర్యావరణ కార్యాచరణలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వాటి కేంద్రీకృతంగానే బడ్జెట్‌ (Budget 2023) తీసుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆదాయం అదుర్స్‌

గత రెండేళ్లు కరోనా కారణంగా ఆర్థిక అడుగులు తడబడినా 2022-23లో మాత్రం మన దేశంలో పరిస్థితులు ఆశాజనకంగానే ఉన్నాయి. ముగుస్తున్న ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయం అంచనాలను మించి రూ.2.3 లక్షల కోట్లు అధికంగా వచ్చే సూచనలున్నాయి. ప్రత్యక్ష పన్నులు రూ.2.2 లక్షల కోట్లు, జీఎస్‌టీ ఆదాయం రూ.95వేల కోట్లమేర పెరగనుండగా, డివిడెండ్లు రూ.40వేల కోట్లు, ఇంధన సుంకం రూ.30వేల కోట్లు, పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయం రూ.20వేల కోట్ల దాకా తగ్గొచ్చనుకుంటున్నారు. మొత్తంగా ఆదాయం అంచనాలను మించుతోంది.

ఖర్చులూ పైపైకే..

* ఖర్చు కూడా అంచనాల కంటే రూ.3 లక్షల కోట్ల మేర పెరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకు కారణం రాయితీలు, వ్యయాలు పెరగడమే. అయితే జీడీపీ వృద్ధిరేటు 15.4% మేర ఉన్నందున మొత్తంగా ఆర్థిక లోటు 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.4%కి పరిమితమవుతుందని అంచనా.

* 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వ్యయం దాదాపు 8.2% మేర పెరిగే సూచనలున్నాయి. అంటే ఇది రూ.44 లక్షల కోట్లకు చేరొచ్చు. రాయితీ వ్యయం రూ.3.8 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్లకు పరిమితం కావొచ్చు. మూలధన వ్యయం, ప్రభుత్వ ఆదాయం 12%మేర పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.


‘మద్దతు’కు చట్టబద్ధత ఇచ్చేనా?

* కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పీఎం కిసాన్‌ మినహా ప్రజారంజక పథకాలేమీ ప్రవేశపెట్టలేదు. మౌలిక వసతుల కల్పనో, ఆరోగ్య సంరక్షణో, జీవన ప్రమాణాల మెరుగదలతో ముడిపడిన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. అయితే ప్రభుత్వం మౌలిక వసతుల విస్తరణపై దృష్టిసారించినప్పటికీ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికీ ప్రాధాన్యమిస్తేనే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందన్నది నిపుణుల సూచన. అందువల్ల రాబోయే బడ్జెట్‌ (Budget 2023)లో కొన్ని ముఖ్య రంగాల్లో సంస్కరణలకూ ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

* వ్యవసాయ ఉత్పత్తులకు చట్టబద్ధంగా కనీస మద్దతు ధర కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌ రైతుల నుంచి వినిపిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు మేలు చేసే అవకాశమూ ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని