Mughal Garden: మొగల్ గార్డెన్స్ ఇక.. ‘అమృత్ ఉద్యాన్’
ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఉద్యానవనాల్లో ఒకటైన రాష్ట్రపతి భవన్‌లోని మొగల్ గార్డెన్స్ పేరు మారింది. ఇక నుంచి దీనిని ‘అమృత్ ఉద్యాన్’గా పిలవనున్నారు.
పేరు మారుస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన
చరిత్రాత్మక నిర్ణయమన్న భాజపా
ఆరెస్సెస్ ఎజెండాలో భాగమన్న ప్రతిపక్షాలు
ఈనాడు, దిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఉద్యానవనాల్లో ఒకటైన రాష్ట్రపతి భవన్‌లోని మొగల్ గార్డెన్స్ పేరు మారింది. ఇక నుంచి దీనిని ‘అమృత్ ఉద్యాన్’గా పిలవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను దేశం నిర్వహించుకొంటున్న వేళ.. మొగల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నావికా గుప్తా తెలిపారు. పేరు మార్పుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. భాజపా శ్రేణులు స్వాగతించాయి. వలసపాలనకు చెందిన మరో చిహ్నం ముక్కలైందని భాజపా ఒక ప్రకటనలో పేర్కొంది. నవ భారతం దిశగా ఇది మరో ముందడుగు అని కేంద్రమంత్రులు అభివర్ణించారు. ‘‘రాష్ట్రపతి భవన్‌లోని ప్రఖ్యాత ఉద్యానవనానికి అమృత్ ఉద్యాన్ అని పేరు మార్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ధన్యవాదాలు. కొత్త పేరుతో వలసపాలనలోని మరో చిహ్నం రద్దు అవ్వడమే కాకుండా.. ఈ నిర్ణయం అమృతకాలంలో భారతదేశ ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది’’ అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తదితరులు కూడా పేరు మార్పుపై సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాత్రం అధికారికంగా స్పందించలేదు. ‘చరిత్రను తిరగరాసే ప్రయత్నం’ అంటూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా పేర్కొన్నాయి. ‘‘ఎవరికి తెలుసు. రేపు ఈడెన్‌గార్డెన్స్‌ను కూడా మోదీ గార్డెన్స్‌గా మారుస్తారేమో. ఉద్యోగాల కల్పనపై, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడంపై, ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ఆస్తుల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి’’అని టీఎంసీ నేత, రాజ్యసభ సభ్యుడు డెరిక్ ఓబ్రియెన్ అన్నారు. చరిత్రను తిరగరాయాలన్న ఆరెస్సెస్ అజెండాను ప్రభుత్వం అమలు చేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. పేరు మార్పును చరిత్రాత్మక నిర్ణయంగా భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. అమృతకాలంలో దేశాన్ని బానిసమనస్తత్వం నుంచి మోదీ ప్రభుత్వం బయటికి తీసుకొస్తోందని అన్నారు. వలస పాలన చిహ్నాలను తొలగించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా పాత తరం పేర్లను మారుస్తూ వస్తోంది. అందులో భాగంగా రాజ్‌పథ్ పేరును గత ఏడాది కర్తవ్యపథ్‌గా మార్చింది.
ముర్ము చేతుల మీదుగా..
అమృత్ ఉద్యాన్‌ను ప్రజలు ఆదివారం నుంచి సందర్శించవచ్చు. ఈ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పాల్గొననున్నారు. అనంతరం ఈ నెల 31వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు (సోమవారం గార్డెన్ల నిర్వహణ కోసం, మార్చి 8న హోలీ మినహా) ప్రజల సందర్శనకు తెరుస్తారు. ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది.
భువిలో స్వర్గం..
రాష్ట్రపతిభవన్‌లో 15 ఎకరాల్లో విస్తరించిన ఈ ఉద్యానవనాన్ని భువిలో స్వర్గమంటారు. ప్రపంచంలోనే అరుదైన పుష్పాలు, మొక్కలకు ఈ గార్డెన్స్ వేదిక. జమ్మూ-కశ్మీర్‌లోని మొగల్ గార్డెన్ స్పూర్తితో దీన్ని తీర్చిదిద్దారు. 1911లో కింగ్ జార్జ్.. రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చనున్నట్లు ప్రకటించారు. సర్ ఎడ్విన్ లుటియన్స్ సర్ హర్బెర్ట్ బేకర్ కలిసి వైస్రాయ్ హౌస్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ కేంద్రంగా న్యూదిల్లీకి రూపకల్పన చేశారు. స్వాతంత్య్రం అనంతరం వైస్రాయ్ హౌస్.. రాష్ట్రపతి భవన్‌గా మారింది. 1917లో మొగల్ గార్డెన్స్ ఆకృతికి లుటియన్స్ తుదిరూపు ఇచ్చారు. మొక్కలు నాటడం మాత్రం 1928-29 మధ్య ప్రారంభమైంది. ఇందులో ఈస్ట్ లాన్, సెంట్రల్ లాన్, లాంగ్ గార్డెన్, సర్క్యులర్ గార్డెన్, హెర్బల్-1, హెర్బల్-2, టాక్టైల్ గార్డెన్, బొన్సాయ్ గార్డెన్, ఆరోగ్య వనం పేర్లతో భిన్నమైన తోటలు ఉన్నాయి. ఇందులో 150 రకాల గులాబీలు, ఎన్నో రకాల తులిప్స్, ఆసియాటిక్ లిల్లీస్, ప్రపంచంలోనే అరుదైన పుష్పాలు ఉన్నాయి. ఈ గార్డెన్స్ సంరక్షణకు 300 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Afghan embassy in India: భారత్‌లో అఫ్గాన్ ఎంబసీని మూసేస్తున్నారా? కేంద్రానికి మెసేజ్..!
-
Elon Musk: వలసదారులకు నేను అనుకూలం : ఎలాన్ మస్క్
-
TDP: సొంత భూమే పోగొట్టుకున్నా.. నేను అవినీతి చేస్తానా?: మాజీ మంత్రి నారాయణ
-
Siddharth: కన్నడ ప్రజల తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు: ప్రకాశ్ రాజ్
-
Canada: హంతకులకు ఆశ్రయం ఇస్తున్నారు.. కెనడాపై బంగ్లాదేశ్ మంత్రి తీవ్ర ఆరోపణలు
-
Imran Tahir: 44 ఏళ్ల వయసులోనూ తాహిర్ జోరు.. ధోని రికార్డు బద్దలు కొట్టి..