గగనతలంలో ఢీకొన్న యుద్ధ విమానాలు

భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన రెండు యుద్ధ విమానాలు అరుదైన రీతిలో గగనతలంలోనే పరస్పరం ఢీకొన్నాయి! మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన భారీ నష్టాన్ని మిగల్చడంతో పాటు పైలట్‌- వింగ్‌ కమాండర్‌ హనుమంతరావు సారథి ప్రాణాన్ని బలిగొంది.

Published : 29 Jan 2023 03:28 IST

పైలట్‌ హనుమంతరావు సారథి దుర్మరణం

దిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు చెందిన రెండు యుద్ధ విమానాలు అరుదైన రీతిలో గగనతలంలోనే పరస్పరం ఢీకొన్నాయి! మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన భారీ నష్టాన్ని మిగల్చడంతో పాటు పైలట్‌- వింగ్‌ కమాండర్‌ హనుమంతరావు సారథి ప్రాణాన్ని బలిగొంది. రోజువారీ శిక్షణ కార్యక్రమంలో భాగంగా గ్వాలియర్‌ వైమానిక స్థావరం నుంచి శనివారం ఉదయం బయల్దేరిన సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000 విమానాలు కొద్దిసేపట్లోనే కూలిపోయాయి. అధికారికంగా ధ్రువపడకపోయినా.. ఒకదాన్ని ఒకటి ఢీకొనడం వల్లనే దుర్ఘటన సంభవించినట్లు బలంగా వినిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా ప్రాంతంలో విమాన శకలాలు పడినట్లు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఇతర శాఖల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. సుఖోయ్‌లో ఇద్దరు, మిరాజ్‌లో ఒక పైలట్‌ ఉన్నట్లు వాయుసేన తెలిపింది. వీరిలో మిరాజ్‌ విమాన పైలట్‌ మరణించినట్లు ప్రకటించింది. సుఖోయ్‌ పైలట్లు చివరిక్షణంలో కిందికి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో గాయాలపాలైన వారిద్దరిని సైనిక ఆసుపత్రికి తరలించారు. విమానాల శకలాలు మొరెనా జిల్లాలోని పహార్‌గఢ్‌ ప్రాంతంలో పడినట్లు జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ అస్థానా తెలిపారు. ఈ ఘటనపై రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వాయుసేనాధిపతి- ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరి నివేదించారు. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు వాయుసేన ఆదేశించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు