సంక్షిప్త వార్తలు(3)

బలవంతపు మతమార్పిళ్ల అంశాన్ని ఐదుగురు జడ్జీలతో కూడిన విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీం కోర్టులో తాజాగా ఒక పిటిషన్‌ దాఖలైంది.

Updated : 30 Jan 2023 06:03 IST

మతమార్పిళ్ల అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించండి
సుప్రీంకోర్టులో పిటిషన్‌

దిల్లీ: బలవంతపు మతమార్పిళ్ల అంశాన్ని ఐదుగురు జడ్జీలతో కూడిన విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీం కోర్టులో తాజాగా ఒక పిటిషన్‌ దాఖలైంది. ఈ అంశంలో రాజ్యాంగ సూత్రాలకు భాష్యం చెప్పాల్సి ఉన్నందువల్ల ఇది అవసరమని పిటిషనర్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌ అందులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 25(1) అధికరణాన్ని నిర్వచిస్తూ సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన తీర్పులు లోపభూయిష్ఠంగా ఉన్నాయా అన్న సందేహాన్ని ఆయన వ్యక్తంచేశారు. సంబంధిత అధికరణంలోని ‘ప్రచారం’ అనే పదాన్ని అవి సమర్థించాయని, దానర్థం.. మతమార్పిడికి అనుమతిచ్చినట్లే అన్న భావన వ్యక్తమవుతోందన్నారు. జాతీయ సమగ్రత, సమైక్యత, గౌరవానికి భంగం వాటిల్లని విధంగా ఆ పదాన్ని నిర్వచించాలని కోరారు. మతమార్పిళ్లకు వ్యతిరేకంగా కొన్ని రాష్ట్రాలు చేసిన చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది.


హురియత్‌ కాన్ఫరెన్స్‌ కార్యాలయం జప్తు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో వేర్పాటువాద సంస్థ హురియత్‌ కాన్ఫరెన్స్‌కు చెందిన కార్యాలయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఆదివారం జప్తు చేసింది. ఉగ్ర నిధుల కేసులో దిల్లీ ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు కార్యాలయ ప్రాంగణం వద్ద జప్తు నోటీసును అతికించారు. 2019 ఆగస్టులో వేర్పాటువాద గ్రూపులపై ప్రభుత్వం అణచివేత చర్యలు ప్రారంభించిన నాటి నుంచి ఈ కార్యాలయం మూసే ఉంది. జప్తు విషయంపై హురియత్‌ కాన్ఫరెన్స్‌ స్పందించింది. కశ్మీర్‌ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆకాంక్షిస్తున్న ప్రజల నుంచి తమను ఎవరూ దూరం చేయలేరని పేర్కొంది.


పేరు మార్పుతో కష్టాలు తీరుతాయా?

ద్రవ్యోల్బణం, పేదరికం, నిరుద్యోగిత కారణంగా దేశ ప్రజల జీవితం దుర్భరమవుతోంది. అయినా ఈ సమస్యలపై దృష్టిపెట్టకుండా పేరు మార్పులు, బాయ్‌కాట్‌లు, విద్వేష ప్రసంగాలతో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతుండటం బాధాకరం. రాష్ట్రపతి భవన్‌లోని ప్రఖ్యాత మొగల్‌ గార్డెన్స్‌ పేరును మారిస్తే జనం కష్టాలు తీరుతాయా?

మాయావతి


గుజరాత్‌లో ఎందుకిలా?

ప్రశ్నాపత్రం లీకవడంతో గుజరాత్‌లో తాజాగా జూనియర్‌ క్లర్క్‌ నియామక పరీక్ష వాయిదాపడింది. ఆ రాష్ట్రంలో దాదాపుగా ప్రతి పరీక్ష పేపర్‌ లీకవుతోంది. లక్షల మంది యువత భవిష్యత్తు నాశనమవుతోంది. ఎందుకిలా?

అరవింద్‌ కేజ్రీవాల్‌


అప్పటికీ ఇప్పటికీ వ్యత్యాసమదే

భారత భూభాగం 1962లో చైనా ఆక్రమణకు గురైందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ అన్నారు. నిజమే. కానీ 1962కు, 2020-23కు మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏంటంటే.. అప్పట్లో మనం గట్టిగా పోరాడాం. అయినప్పటికీ భూభాగాన్ని కోల్పోయాం. కానీ ఇప్పుడు మనం భూమిని మాత్రమే పోగొట్టుకోలేదు. ఆక్రమణకు పాల్పడిన దేశానికి క్లీన్‌చిట్‌ కూడా ఇచ్చాం.

పవన్‌ ఖేడా


ఆహార ధరలు పెరిగితే..

ఆహార ధరలు పెరిగితే పేదరికమూ అధికమవుతుంటుంది. ఆహార ధరల్లో ఒక్కో శాతం పెరుగుదలతో.. ప్రపంచవ్యాప్తంగా కోటి మంది చొప్పున కడు బీదరికంలో కూరుకుపోతుంటారు.

ఐక్యరాజ్య సమితి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని