మధ్యతరగతి మది గెల్చుకోండి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో మధ్య తరగతి ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ ఆ వర్గానికి చేరువ కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు.

Updated : 30 Jan 2023 05:56 IST

కేంద్ర పథకాలతో కలిగిన లబ్ధిని వివరించండి
మంత్రులకు  ప్రధాని దిశానిర్దేశం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో మధ్య తరగతి ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ ఆ వర్గానికి చేరువ కావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. కేంద్ర బడ్జెట్‌ వేళ.. ఆదివారం ఆయన మంత్రిమండలి సమావేశాన్ని నిర్వహించారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. ప్రభుత్వ పథకాలతో పేదలు, అణగారిన వర్గాలకు లబ్ధి చేకూరిందని ప్రధాని ఈ భేటీలో పేర్కొన్నారు. అలాగే మధ్యతరగతికీ ప్రయోజనం కలిగిందని తెలిపారు. ఈ వివరాలను ఆ వర్గానికి తెలియజేయాలన్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో బ్రిటిష్‌ పాలనను గుర్తుకు తెచ్చే అంశాలు, చట్టాలను గుర్తించి, వాటిని రద్దు చేయాలన్నారు. గడిచిన 8 ఏళ్లలో వివిధ రంగాలకు సంబంధించి మోదీ ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి అధికారులు ఈ సమావేశంలో ఒక దృశ్యశ్రవణ సమర్పణ చేశారు. సామాజిక, ఆర్థిక రంగాలపై క్యాబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గాబా వివరణ ఇచ్చారు. ప్రధానంగా విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఐఐటీలు, ఐఐఎంలు, ఐఐఎస్‌సీలను ప్రారంభించినట్లు వివరించారు. ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యలో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల పరంగా భారీ పరివర్తన జరిగినట్లు చెప్పారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్థాయిలో సీట్లు పెరిగాయని, దీనివల్ల విద్యార్థులకు ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం కార్యదర్శి అనురాగ్‌ జైన్‌.. ప్రభుత్వం ప్రారంభించిన అనేక ప్రాజెక్టులపై మాట్లాడారు. మోదీ సర్కారు చేపట్టిన మంచి పనుల గురించి ప్రచారం చేయడానికి  అందుబాటులో ఉన్న వివిధ సామాజిక మాధ్యమాల గురించి సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర వివరణ ఇచ్చారు. అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్లకు సంబంధించిన ముద్రిత ప్రతులను మంత్రులకూ అందజేశారు. ఈ ఏడాది కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు