Budget 2023: ఈ బండి ఎటు వెళ్తుందండీ?

ఏటికేడు పెరిగిపోతున్న అవసరాలు, ప్రయాణికుల ఆకాంక్షలు నడుమ ఈసారి కేంద్ర బడ్జెట్లో రైల్వేకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? నిత్యం కోట్ల మందిని గమ్యాలకు చేరవేస్తూ భారతీయ జీవనరేఖగా గుర్తింపు పొందిన రైల్వేశాఖ.. ప్రభుత్వం నుంచి తగినంత మద్దతును పొందగలుగుతుందా? కాలదోషం పట్టిన ప్రాజెక్టులకు కొత్త సంవత్సరంలోనైనా దశ తిరుగుతుందా?.. వీటికి సమాధానాలు ఫిబ్రవరి ఒకటిన లభించనున్నాయి.

Updated : 30 Jan 2023 10:41 IST

భారీ ఆకాంక్షల నడుమ వస్తున్న రైల్వే పద్దు
విస్తరణ, నవీకరణకు మరింతగా కేటాయింపులు దక్కేనా..!
రాయితీలపై సగటు ప్రయాణికుల ఆశలు
మరిన్ని వందేభారత్‌ రైళ్లు?

ఏటికేడు పెరిగిపోతున్న అవసరాలు, ప్రయాణికుల ఆకాంక్షలు నడుమ ఈసారి కేంద్ర బడ్జెట్లో రైల్వేకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? నిత్యం కోట్ల మందిని గమ్యాలకు చేరవేస్తూ భారతీయ జీవనరేఖగా గుర్తింపు పొందిన రైల్వేశాఖ.. ప్రభుత్వం నుంచి తగినంత మద్దతును పొందగలుగుతుందా? కాలదోషం పట్టిన ప్రాజెక్టులకు కొత్త సంవత్సరంలోనైనా దశ తిరుగుతుందా?.. వీటికి సమాధానాలు ఫిబ్రవరి ఒకటిన లభించనున్నాయి. ఆరోజు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సాధారణ ప్రజలతో పాటు రైల్వేశాఖ కూడా ఆశలు పెట్టుకుంది. పెరుగుతున్న దేశ జనాభా అవసరాలను తట్టుకునేలా రైల్వేల్లో భారీగా విస్తరణ, నవీకరణ పనులు చేపట్టాలంటే పెద్దఎత్తున కేటాయింపులు అవసరం. తొమ్మిది రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనుండడం, సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది పైచిలుకు సమయమే మిగిలి ఉండడంతో ఈసారి రైల్వేకు కేటాయింపుల్లో కేంద్రం పెద్దపీట వేస్తుందా? అనేది వేచిచూడాల్సిందే.

సాధారణ రైలు పెట్టెల పెంపు ఏదీ?

గత కొన్నేళ్లుగా ప్రయాణికుల రుసుములను నేరుగా పెంచకుండా పరోక్ష పద్ధతుల్లో వీలైనంత ఆదాయాన్ని పెంచడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తూ వస్తోంది. ఎక్కువ సదుపాయాలు కావాలంటే ఎక్కువ రుసుములు చెల్లించుకోవడానికి సిద్ధం కావాలనే సంకేతాలు ఇస్తూ.. సాధారణ రైళ్లలో టికెట్‌ ఛార్జీల జోలికి వెళ్లడం లేదు. టికెట్‌ తక్కువే ఉన్నా సాధారణ రైలుపెట్టెలు పరిమిత సంఖ్యలోనే ఉండడంతో వాటిలో అడుగుపెట్టడం కూడా సామాన్యులకు అసాధ్యంగా మారుతోంది. ఏళ్ల తరబడి పెండింగులో ఉంటున్న నూతన రైలు మార్గాలు, విద్యుదీకరణ, ప్రస్తుత మార్గాల విస్తరణ, అదనపు లైన్ల నిర్మాణం, ఉత్పాదక యూనిట్ల నిర్మాణం వంటివి ఎప్పుడు పూర్తవుతాయని రాష్ట్రాలు ప్రశ్నిస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి.

వేగం 160 కి.మీ.

ఎంపిక చేసిన రూట్లలో గంటకు 160 కి.మీ. వేగంతో రైళ్లు ప్రయాణించేలా పట్టాల సామర్థ్యాన్ని మెరుగుపరచాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దానికి తగ్గట్టుగా బడ్జెట్లో కేటాయింపులు చూపించే అవకాశం ఉంది. తద్వారా ముందుగా వందేభారత్‌ రైళ్లను వాటి గరిష్ఠ వేగంతో నడపవచ్చు. తర్వాత అంచెలంచెలుగా బులెట్‌ రైళ్ల వైపు అడుగులు వేయొచ్చనేది రైల్వే ఉద్దేశం.

* ఏసీ తరగతికి పెద్దపీట వేస్తూ క్రమంగా నాన్‌-ఏసీ పెట్టెలను తగ్గించుకుంటూ రావాలనేది దీర్ఘకాల ప్రణాళికల్లో ఒకటి. ఇప్పటికే ఇది కొంతమేర ఆచరణలోకి వచ్చింది. దీంతోపాటు సంప్రదాయ పెట్టెలన్నింటినీ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లుగా మార్చాలన్న ఆలోచనకు బడ్జెట్లో ప్రభుత్వ అనుమతిని రైల్వేశాఖ కోరనుంది.


రాయితీలు హుళక్కేనా

కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి అనేక రకాల రాయితీలకు రైల్వేశాఖ చెల్లుచీటీ రాస్తూ వస్తోంది. దీనిపై ప్రజల్లో అసంతృప్తి పేరుకుపోతోంది. ముఖ్యంగా వయోవృద్ధులు ఈ రాయితీలకు దూరమయ్యారు. ఎన్నికల ఏడాది కావడంతో దీనిపై ఈసారి కరుణిస్తారా అనే ఆశలు ఉన్నా ఇటీవల రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేసిన ప్రకటన మాత్రం దానిపై నీళ్లు జల్లేదిగానే ఉంది.


ఏయే అంశాలకు ప్రాధాన్యం లభించవచ్చు..

* కొత్తరకం రైళ్లతో పాటు స్టేషన్ల అభివృద్ధి, సిగ్నల్‌ వ్యవస్థ ఆధునికీకరణ, రైళ్లు ప్రమాదాలకు గురికాకుండా సాంకేతిక ఏర్పాట్లు విస్తృతం చేయడం, విద్యుదీకరణ వంటివాటికి ఈ బడ్జెట్లో కేటాయింపులు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.

* మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈసారి 20-25% మేర ఎక్కువగా నిధులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం సీట్లు మాత్రమే ఉంటున్న వందేభారత్‌ రైళ్లలో త్వరలో బెర్తుల్ని తీసుకురానున్నట్లు రైల్వే ఇప్పటికే ప్రకటించింది. తేజస్‌, హమ్‌సఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్ల సంఖ్యా పెరగనుంది.

* సరకు రవాణా నడవాల (ఫ్రైట్‌ కారిడార్ల) నిర్మాణం, అధునాతన రైలు పెట్టెల ఉత్పత్తి, హైడ్రోజన్‌తో నడిచే ఇంజిన్లను అందుబాటులోకి తీసుకురావడం, రూ.లక్ష కోట్ల పైచిలుకు అంచనా వ్యయంతో చేపట్టిన ముంబయి-అహ్మదాబాద్‌ బులెట్‌ రైలు పనుల్ని వేగవంతం చేయడం వంటి ఎన్నో లక్ష్యాలు రైల్వే మంత్రిత్వ శాఖ ముందున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేయనున్నారు.


కేంద్ర మద్దతు రూ.1.80 లక్షల కోట్లు!

గత ఆరు సంవత్సరాలుగా రైల్వేకు ప్రత్యేక బడ్జెట్‌ లేకపోవడంతో సాధారణ బడ్జెట్లో భాగంగానే దానిని కలిపి చూపిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కోసం గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు చూపించారు.

* ఈసారి రైల్వేకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పరమైన మద్దతు రూ.1.40 లక్షల కోట్ల నుంచి రూ.1.80 లక్షల కోట్లకు పెంచవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. తదనుగుణంగా రైల్వే బడ్జెట్‌ రమారమి రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని అంచనా. అధునాతన వందేభారత్‌ రైళ్లను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, ప్రైవేటు భాగస్వామ్యంతో కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తుండడం, రాజకీయపరమైన అనివార్యతల కారణంగా కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది.

 ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు