ఆగ‘మేఘాల’పై గుండె తరలింపు

మధ్యప్రదేశ్‌లో 34 ఏళ్ల జీవన్మృతుడు (బ్రెయిన్‌ డెడ్‌) నుంచి సేకరించిన గుండె ఒక సైనికుడికి ప్రాణదానం చేయనుంది.

Updated : 31 Jan 2023 06:03 IST

సైనికుడి ప్రాణాలు నిలిపేందుకు వాయుసేన విమానాలు  

దిల్లీ: మధ్యప్రదేశ్‌లో 34 ఏళ్ల జీవన్మృతుడు (బ్రెయిన్‌ డెడ్‌) నుంచి సేకరించిన గుండె ఒక సైనికుడికి ప్రాణదానం చేయనుంది. ఈ అవయవాన్ని సోమవారం ఇందౌర్‌ నుంచి పుణెకు తరలించారు. ఈ ఆపరేషన్‌లో వాయుసేనకు చెందిన రెండు విమానాలు సమన్వయంతో పనిచేశాయని అధికారులు తెలిపారు. ఉజ్జయినికి చెందిన కూరగాయల వ్యాపారి ప్రదీప్‌ అశ్వనీ ఈ నెల 20న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అందులో అతడి తలకు బలమైన దెబ్బ తగిలింది. నాటి నుంచి ఇందౌర్‌లోని ఒక ఆసుపత్రిలో అతడికి చికిత్స అందించారు. అతడి పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. అతడిని బ్రెయిన్‌ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. ఈ బాధను దిగమింగుకొని అతడి అవయవాలను దానమివ్వాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. సైనిక డాక్టర్లు వచ్చి ప్రదీప్‌ నుంచి గుండె సేకరించి, ప్రత్యేక విమానంలో పుణెకు తరలించారు. హృద్రోగంతో బాధపడుతున్న సైనికుడికి ఈ అవయవాన్ని అమర్చనున్నారని, ఇది తమ కుటుంబానికి గర్వకారణమని బాధితుడి సోదరి నీలమ్‌ పేర్కొన్నారు. ప్రదీప్‌ దేహం నుంచి మూత్రపిండాలు, కాలేయం, కళ్లను కూడా సేకరించి స్థానిక ఆసుపత్రులకు తరలించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని