నేటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఉరుముతున్న వేళ భారత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్నాయి.

Published : 31 Jan 2023 03:57 IST

ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగం
ఆ వెంటనే సభ ముందుకు ఆర్థిక సర్వే
కేంద్ర ఆర్థిక పద్దును బుధవారం ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్‌

ఈనాడు, దిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ఉరుముతున్న వేళ భారత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్నాయి. సెంట్రల్‌హాలులో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా రాష్ట్రపతి ద్రౌపదీముర్ము వీటికి శ్రీకారం చుడతారు. గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగం అయిన వెంటనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆర్థిక సర్వేను సభ ముందుంచనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆమె దిగువ సభలో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. గురువారం నుంచి ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ప్రారంభమవుతుంది. ప్రధాని మోదీ జవాబు ఇవ్వనున్నారు. ఆ వెంటనే బడ్జెట్‌పై చర్చ మొదలవుతుంది.ఆర్థిక మంత్రి సమాధానమిస్తారు. వివిధ శాఖలకు కేటాయింపులపై స్థాయీ సంఘాలు అధ్యయనం జరిపి నివేదికలు సమర్పించడానికి పార్లమెంటుకు ఫిబ్రవరి 14 నుంచి మార్చి 12వ తేదీ వరకు విరామం ఇవ్వనున్నారు. రెండో దఫా సమావేశాల్లో.. శాఖల వారీ బడ్జెట్‌ కేటాయింపులు, ఆర్థిక బిల్లుపై చర్చిస్తారు.

అదానీ, గవర్నర్ల తీరుపై చర్చకు విపక్షాల పట్టు

జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు, తర్వాత మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 6వరకు రెండు విడతలుగా జరిగే పార్లమెంటు సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మంగళవారం దిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించారు. లోక్‌సభ ఉపనాయకుడు, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వం వహించిన ఈ సమావేశానికి 27 పార్టీలకు చెందిన 37 మంది నేతలు హాజరయ్యారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగిన భారత్‌ జోడో యాత్ర ముగింపు సభ శ్రీనగర్‌లో ఉండటంతో కాంగ్రెస్‌ నేతలెవ్వరూ అఖిలపక్ష సమావేశానికి హాజరుకాలేదు. మంగళవారం వారి డిమాండ్లను తన దృష్టికి తీసుకొస్తామని చెప్పారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తెలిపారు.

*  మహిళా రిజర్వేషన్లు, ఓబీసీ కుల గణన, అదానీ వ్యాపారాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, చైనా చొరబాట్లపై చర్చ కోసం పలు పార్టీలు అడిగాయని, నిబంధనల ప్రకారం, సభాపతి అనుమతిస్తే ఏ అంశంపైనైనా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రహ్లాద్‌ జోషి పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాలు పాత పార్లమెంటు భవనంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.

*  అఖిలపక్ష భేటీలో చైనా చొరబాట్లపై చర్చ చేపట్టాలని బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ నేతలు డిమాండ్‌ చేయగా కేంద్ర ప్రభుత్వం అందుకు నిరాకరించినట్లు తెలిసింది. దేశ భద్రతతో ముడిపడిన ఈ అంశంపై పార్లమెంటులో చర్చించడం సాధ్యంకాదని పేర్కొన్నట్లు సమాచారం.

*  బిజూ జనతాదళ్‌ నేత సస్మిత్‌పాత్ర..బడ్జెట్‌ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు భారత రాష్ట్ర సమితి(భారాస), టీఎంసీలూ మద్దతు పలికినట్లు తెలిసింది.

*  తృణమూల్‌ కాంగ్రెస్‌, భారాస, డీఎంకే పార్టీలకు చెందిన నాయకులు రాష్ట్రాల్లో గవర్నర్లు పరిధి మీరి వ్యవహరిస్తున్న తీరుపై చర్చ కోసం డిమాండ్‌ చేశారు.

*  దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని వైకాపా డిమాండ్‌ చేసింది.


పార్లమెంటు క్యాంటీన్‌లో జొన్న ఉప్మా.. రాగి దోశ

దిల్లీ: జొన్న ఉప్మా, రాగి దోశ, రాగి రవ్వ ఇడ్లీ, సజ్జల కిచిడీ... తరహాలో తృణ ధాన్యాలతో చేసిన పలు ఆహార పదార్థాలు ఇప్పుడు పార్లమెంటు క్యాంటీన్‌ మెనూలో చోటు దక్కించుకున్నాయి. తృణ ధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో పార్లమెంటు భవనం క్యాంటీన్‌లో ఆరోగ్యకరమైన ఈ వంటకాలు అన్నిటినీ ఎంపీలు, సిబ్బంది, సందర్శకులకు అందుబాటులో ఉంచేలా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఏర్పాట్లు చేయించారు. ఆదివారం మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని మోదీ తృణ ధాన్యాల వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలను ప్రత్యేకంగా వివరించారు. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించే తృణ ధాన్యాల ఆహార పదార్థాలను క్యాంటీన్‌ మెనూలో చేర్చారు. ఇటీవల శీతాకాల పార్లమెంటు సమావేశాల సందర్భంగా తృణ ధాన్యాలతో చేసిన వంటలతో ఎంపీలకు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ విందునిచ్చిన విషయం తెలిసిందే. ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు