గతేడాది 165 మందికి మరణశిక్షలు

దేశవ్యాప్తంగా ట్రయల్‌కోర్టులు 2022లో 165 మందికి మరణశిక్షలు విధించాయి. దీంతో గతేడాది చివరినాటికి మరణశిక్షను ఎదుర్కొంటున్న మొత్తం ఖైదీల సంఖ్య 539కి చేరింది.

Published : 31 Jan 2023 05:26 IST

రెండు దశాబ్దాల తర్వాత అత్యధిక సంఖ్యలో విధించిన ట్రయల్‌కోర్టులు

ఈనాడు, దిల్లీ:  దేశవ్యాప్తంగా ట్రయల్‌కోర్టులు 2022లో 165 మందికి మరణశిక్షలు విధించాయి. దీంతో గతేడాది చివరినాటికి మరణశిక్షను ఎదుర్కొంటున్న మొత్తం ఖైదీల సంఖ్య 539కి చేరింది. 2000 తర్వాత ఒక్క ఏడాదిలో ఇంతమందికి మరణశిక్షలు విధించడం ఇదే తొలిసారి. ‘డెత్‌ పెనాల్టీ ఇన్‌ ఇండియా, యాన్యువల్‌ స్టాటిస్టిక్స్‌ రిపోర్టు-2022’ పేరుతో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని ప్రాజెక్టు 39ఏ ఈ మేరకు ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. గతేడాది గుజరాత్‌లో అత్యధికంగా 51 మందికి మరణశిక్షలు పడ్డాయి. అందులోనూ ఒక బాంబుపేలుడు కేసులో అహ్మదాబాద్‌ కోర్టు 38 మందికి ఉరిశిక్ష విధించింది. 2016 తర్వాత ఒక్క కేసులో ఇంతమందికి మరణ దండన విధించడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు ఉరిశిక్షపడ్డ 539 మంది ఖైదీల్లో అత్యధికులు ఉత్తర్‌ప్రదేశ్‌లో (100) ఉండగా, తర్వాతి స్థానాల్లో గుజరాత్‌ (61), ఝార్ఖండ్‌ (49), మహారాష్ట్ర (39), మధ్యప్రదేశ్‌ (31), కర్ణాటక (25), ఉత్తరాఖండ్‌ (24), పశ్చిమబెంగాల్‌ (23), హరియాణా (21), కేరళ (20), రాజస్థాన్‌ (19), బిహార్‌ (14), తమిళనాడు (14), తెలంగాణ (13), ఒడిశా (13), అస్సాం (12), పంజాబ్‌ (10) ఉన్నాయి. 2022లో కోర్టులు 57 హత్యకేసులు, 47 హత్య, లైంగిక నేరాల్లో, 39 ఉగ్రవాద నేరాల్లో, 8 కిడ్నాపింగ్‌, మర్డర్‌ కేసుల్లో, 5 చిన్నారులపై అత్యాచార కేసుల్లో మరణశిక్షలు విధించాయి. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. గత ఏడాది ట్రయల్‌కోర్టులు మరణశిక్ష విధించిన కేసుల్లో 51.28% లైంగిక నేరాలకు సంబంధించినవే. 2015 తర్వాత మరణశిక్షలుపడ్డవారి సంఖ్య 40% పెరిగింది. అప్పిలేట్‌ కోర్టులు ఈ కేసులను వేగంగా పరిష్కరించకపోవడంవల్ల మరణశిక్షపడ్డ వారి సంఖ్య నానాటికీ పెరుగుతూవస్తోంది. 2022లో హైకోర్టులు 68, సుప్రీంకోర్టు 11 కేసులను మాత్రమే పరిష్కరించాయి. హైకోర్టులు విచారించిన 68 కేసుల్లో 101 మంది ఉండగా, అందులో ముగ్గురికి మరణశిక్ష ఖరారైంది. 48 మంది మరణ శిక్ష యావజ్జీవశిక్షగా మారింది. 43 మంది నిరపరాధులుగా విడుదలయ్యారు. ఆరుకేసులను మళ్లీ విచారించమని ట్రయల్‌కోర్టుకు పంపారు. ఒక దోపిడీ, హత్య కేసులో మాత్రం ట్రయల్‌కోర్టు విధించిన యావజ్జీవశిక్షను బాంబే హైకోర్టు మరణశిక్షగా మార్చింది. హైకోర్టులు ఇలా శిక్షపెంచడం 2016 తర్వాత ఇది రెండోసారి. సుప్రీంకోర్టు విచారించిన 11 కేసుల్లో 15 మంది నిందితులు ఉండగా అందులో అయిదుగురు నిర్దోషులుగా విడుదలయ్యారు. 8 మంది మరణశిక్షను యావజ్జీవశిక్షగా మార్చింది. ఇద్దరి మరణశిక్షను ఖరారుచేసింది. దర్యాప్తు సరిగా లేకపోవడం, పోలీసులు, ప్రాసిక్యూషన్‌, ట్రయల్‌కోర్టులు నిబంధనలను సరిగా అనుసరించకపోవడం కారణంగా అయిదుగురికి దోషవిముక్తి కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని