ఉత్తరాది గజగజ

భారీ హిమపాతంతో ఉత్తరాది రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. జమ్మూ-కశ్మీర్‌లో సాధారణ జీవనం తీవ్రంగా ప్రభావితమైంది.

Published : 31 Jan 2023 04:49 IST

శ్రీనగర్‌కు విమానాల నిలిపివేత

దిల్లీ, శ్రీనగర్‌: భారీ హిమపాతంతో ఉత్తరాది రాష్ట్రాలు గజగజలాడుతున్నాయి. జమ్మూ-కశ్మీర్‌లో సాధారణ జీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ఐదు జిల్లాల్లో మంచుచరియలు విరిగిపడే ప్రమాదం ఉందనే హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆదివారం రాత్రి నుంచి కశ్మీర్‌లో భారీస్థాయిలో మంచు కురుస్తుండడంతో రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. దృశ్య స్పష్టత 500 మీటర్ల లోపునకు పడిపోవడంతో శ్రీనగర్‌కు అన్ని విమానాలూ నిలిపివేశారు. కొండచరియలు విరిగి పడుతుండడంతో శ్రీనగర్‌-జమ్మూ జాతీయ రహదారిలో వాహనాలను అనుమతించడం లేదు. శ్రీనగర్‌లో ఏడు అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. పహల్గామ్‌లోనైతే 9 అంగుళాల మంచు దుప్పటి ఏర్పడినట్లయింది. హిమాచల్‌ప్రదేశ్‌లో జాతీయ రహదారులు సహా 500 రోడ్లను మూసివేశారు. నీరు, విద్యుత్తు సరఫరాకు పలుచోట్ల అంతరాయం వాటిల్లింది. రోహ్‌తంగ్‌, అటల్‌ సొరంగం వంటిచోట్ల ఎకాఎకి 75 సెంటీమీటర్ల మంచు కురిసింది. ఎముకలు కొరికే స్థాయిలో చలి ఉండడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పలు ప్రాంతాలకు ఆరెంజ్‌ ఎలర్ట్‌ జారీ చేశారు. హిమాచల్‌లో శుక్రవారం వరకు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆ రాష్ట్రంలో అనేకచోట్ల మైనస్‌ డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని గఢ్‌వాల్‌ ప్రాంతంలోనూ పెద్దఎత్తున మంచు పడుతోంది. బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి మంచు దుప్పట్లోనే ఉన్నాయి. యూపీలో రంభన్‌ జిల్లాలో భారీ హిమపాతంలో చిక్కుకున్న పర్యాటకుల్ని పోలీసులు రక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు