ఐరాస సంస్కరణలకు సభ్యదేశాల అనైక్యతే అడ్డంకి

ఐక్యరాజ్య సమితిని సంస్కరించేందుకు సర్వప్రతినిధుల సభ(యూఎన్‌జీఏ)లోని సభ్య దేశాల అనైక్యతే ప్రధాన అడ్డంకిగా మారిందని యూఎన్‌జీఏ అధ్యక్షుడు చాబా కొరొసి పేర్కొన్నారు.

Published : 31 Jan 2023 04:49 IST

సంస్థ విధులను అడ్డుకొనేలా వీటో అధికారం
యూన్‌జీఏ అధ్యక్షుడు కొరొసి

దిల్లీ: ఐక్యరాజ్య సమితిని సంస్కరించేందుకు సర్వప్రతినిధుల సభ(యూఎన్‌జీఏ)లోని సభ్య దేశాల అనైక్యతే ప్రధాన అడ్డంకిగా మారిందని యూఎన్‌జీఏ అధ్యక్షుడు చాబా కొరొసి పేర్కొన్నారు. భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)ని సంస్కరించాలంటే, అంతకన్నా ముందు యూఎన్‌జీఏ ఒక్కతాటిపైకి వచ్చి ఆ దిశగా తీర్మానం చేయాలని చెప్పారు. కానీ ఇప్పటివరకూ అలాంటి ప్రయత్నం జరగలేదన్నారు. చాలా కాలంగా సభ్య దేశాల మధ్య ఐక్యత లేదని పేర్కొన్నారు. ఐరాస వ్యవస్థలో సంస్కరణలకు అయిదు శాశ్వత సభ్య దేశాలు ఆసక్తి కనబర్చడం లేదని, అయితే భద్రతా మండలిలో మార్పులు చేపట్టాల్సిన అవసరాన్ని అవి అంగీకరించాయన్నారు. శాశ్వత సభ్య దేశాలకున్న వీటో అధికార వ్యవస్థ 75 ఏళ్ల క్రితం నాటిదని, ఐరాస విధులను, సంస్కరణలను అడ్డుకోవడానికి అదో ఉపకరణంగా మారిందని వ్యాఖ్యానించారు. భారత్‌లో మూడు రోజుల పర్యటనకు వచ్చిన ఆయన సోమవారం విలేకర్లతో ఈ మేరకు మాట్లాడారు. ప్రధాని మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌, పెట్రోలియం శాఖ మంత్రి హర్‌ దీప్‌ సింగ్‌ పురీలను కలిసి అంతర్జాతీయ పరిణామాలు, ఐరాస వ్యవహారాలపై చర్చించారు. భద్రతా మండలిలో తనకూ శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనీ, అందుకు మండలిని సంస్కరించాలని భారత్‌ చిరకాలంగా పట్టుబడుతోంది. ప్రస్తుతం ఐరాస రెండు సమస్యలను ఎదుర్కొంటోందని కొరొసి చెప్పారు. ఒకటి- ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని పరిష్కరించలేకపోవడం; రెండు- భద్రతా మండలి సంస్కరణకు నిర్దిష్ట కాల పరిమితిని నిర్ణయించలేకపోవడం, సంస్కరణకు ఒక అంగీకార పత్రాన్ని ఇంతవరకు రూపొందించలేకపోవడమని ఆయన అన్నారు. ఐరాస ప్రతిస్పందన యంత్రాంగాన్ని మెరుగుపర్చడంలో భారత్‌ కొన్నేళ్లుగా కీలక పాత్ర పోషిస్తోందని కొరొసి అభినందించారు. 1977 తరవాత తొలిసారిగా సమితి జలవనరుల సంరక్షణపై సమావేశం నిర్వహించబోతోందని ఆయన చెప్పారు. కొరొసితో అంతర్జాతీయ జలవనరులను కాపాడవలసిన ఆవశ్యకత గురించి చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని