Union budget 2023: వచ్చే ఏడాది వృద్ధిరేటు 6.8%

ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు(జీడీపీ) 2022-23లో 7శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది.

Updated : 01 Feb 2023 07:43 IST

పీపీపీ ప్రకారం మనది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
‘కొవిడ్‌’ పూర్వ స్థితికి చేరుకున్నాం
రూపాయి పనితీరు భేష్‌
ఒత్తిళ్లను తట్టుకుని మన ఆర్థిక రంగం నిలబడింది
ఆందోళనకరంగానే కరెంటు ఖాతా లోటు
ఆర్థిక సర్వే వెల్లడి

దిల్లీ: ప్రపంచంలో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని ఆర్థిక సర్వే తెలిపింది. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు(జీడీపీ) 2022-23లో 7శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. 2023-24లో అది 6 నుంచి 6.8 శాతానికి పరిమితమవుతుందని పేర్కొంది. కొనుగోలు శక్తి (పర్చేజింగ్‌ పవర్‌ ప్యారిటీ/పీపీపీ) పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని వెల్లడించింది. దేశీయంగా వినియోగం పెరుగుతున్నందున ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ‘‘అంతర్జాతీయ వృద్ధిని మొదట కరోనా మహమ్మారి దెబ్బతీయగా.. ఆపై రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణానికి దారితీశాయి. దానిని అదుపులోకి తెచ్చేందుకు అమెరికా ఫెడరల్‌ రిజర్వుతో సహా అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరించిన వడ్డీరేట్ల పెంపు ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా ఫెడ్‌ రేట్ల పెంపు చర్యలతో ఆ దేశ స్టాక్‌ మార్కెట్లలోకి పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచుతోంది. దీంతో అనేక దేశాల కరెన్సీతో పోలిస్తే డాలర్‌ విపరీతంగా బలపడుతోంది. ఈ కారణంగా పలు దేశాలు కరెంటు ఖాతా లోటు(సీఏడీ)ను ఎదుర్కొంటున్నాయి. అంతేకాకుండా దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్‌ లాంటి దేశాలు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు గురవుతున్నాయి. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి దాడి పూర్వస్థితికి చేరుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అనేక దేశాల కంటే ముందువరుసలో నిలిచి పూర్తిస్థాయి రికవరీని సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐరోపాలో తలెత్తిన సంక్షోభం(రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం)తో కూడా మనదేశం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. ఇతర దేశాల కరెన్సీతో పోలిస్తే మన రూపాయి పనితీరు బాగానే ఉంది. ఇప్పటికీ అధికస్థాయిలో కొనసాగుతున్న అంతర్జాతీయ కమోడిటీ(ముఖ్యంగా ముడి చమురు) ధరలతో సీఏడీ ఆందోళనకరంగా పెరుగుతున్నా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి తీరు బలంగా ఉంది’’ అని సర్వే వివరించింది.

మూడు ముప్పులు ముంచెత్తాయి

సర్వేపై కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..2020 నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మూడు ముప్పులు ముంచెత్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో మిగిలిన దశాబ్దకాలం పాటు భారత వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ముడి చమురు ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు మించకుండా ఉంటే దేశ అంచనా వృద్ధి రేటులో తేడా ఉండదన్నారు. పునరుత్పాదక ఇంధన మిళిత లక్ష్యాల సాధనలో మనదేశం గణనీయంగా ముందుకుసాగుతోందని తెలిపారు.

ఆర్థిక సర్వేలో కీలకాంశాలు..

* కొవిడ్‌ మహమ్మారి సమయంలో స్తంభించిన భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు పూర్తిగా కోలుకుంది. నిలిచిపోయిన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8% వద్ద ద్రవ్యోల్బణం వ్యక్తిగత వినిమయాన్ని తగ్గించే అధిక స్థాయిలోగానీ, లేదా పెట్టుబడులను బలహీనపరిచేంత తక్కువ స్థాయిలోగానీ ఉండదు.

* రుణరేట్లు దీర్ఘకాలం అధికంగా ఉండే అవకాశం ఉంది. కఠిన ద్రవ్య పరపతి విధాన వైఖరిని మరికొంత కాలం పొడిగించడానికి స్థిరంగా కొనసాగుతున్న ద్రవ్యోల్బణం దోహదం చేయనుంది.

* అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఇంకా వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉన్నందున రూపాయి మారక విలువకు సవాళ్లు ఎదురుకావొచ్చు.

* ఎగుమతుల వృద్ధి నెమ్మదించడం, సీఏడీ విస్తృతమవుతుండడంతో రూపాయికి ఒడుదొడుకులు తప్పకపోవచ్చు.

* ప్రపంచవ్యాప్తంగా కమోడిటీ ధరలు అధిక స్థాయిల్లో కొనసాగుతున్నందున బలహీనమైన రూపాయి విలువతో సీఏడీ మరింత పెరిగే అవకాశం ఉంది. జులై-సెప్టెంబరు కాలానికి సీఏడీ 4.4 శాతంగా ఉంది. ఇది అంతకు ముందు త్రైమాసికంలో 2.2 శాతంగా, ఏడాది క్రితం 1.3 శాతంగా ఉండేది.

* ప్రపంచ ఆర్థిక వృద్ధి, వాణిజ్య కార్యకలాపాలు నెమ్మదించడం ఎగుమతులపై ప్రభావం చూపాయి.

* స్థిరాస్తి రంగంతో పాటు నిర్మాణ కార్యకలాపాలు పుంజుకోవడంతో ఉపాధి కల్పన మెరుగైంది. వలస కూలీలు తిరిగి పట్టణాలకు చేరడానికి ఇది దోహదం చేసింది.

* 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సాధారణ స్థాయిలో ఉండి, రుణ వ్యయం తక్కువగా ఉన్నట్లయితే ‘సూక్ష్మ, చిన్న మధ్యస్థాయి పరిశ్రమల’(ఎంఎస్‌ఎంఈ) రుణాల వృద్ధి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

* కొవిడ్‌ తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన ‘అత్యవసర రుణ హామీ పథకం’ వల్ల నిలు వేగంగా ఎంఎస్‌ఎంఈలు కోలుకుంటున్నాయి.

* వచ్చే ఆర్థిక సంవత్సరంలో.. మూలధన పెట్టుబడులు పుంజుకుంటాయి.

* పీఎం కిసాన్‌, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన వంటి పథకాలు పేదరికాన్ని తగ్గించడంలో గణనీయంగా దోహదపడ్డాయి.

* దేశీయంగా వినియోగం పెరగడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. అయితే, మరిన్ని ఉద్యోగాల కల్పనకు ప్రైవేటు పెట్టుబడులు మరింత పెరగాలి.

* సీఏడీని ఎదుర్కోవడానికి, రూపాయి అస్థిరతను నిలువరించడానికి మన వద్ద చాలినని విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి.


మన దేశంపై ప్రపంచ దేశాల ఆశావాదాన్ని, మౌలికరంగంపై దృష్టి, వ్యవసాయరంగంలో ప్రగతి, పరిశ్రమలు, భవిష్యత్తు రంగాలు వంటి వాటితో సహా భారత వృద్ధి పథాన్ని 2022-23 ఆర్థిక సర్వే సమగ్రంగా విశ్లేషించింది.

ప్రధాని నరేంద్ర మోదీ


ఆర్థిక సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు

* ప్రపంచ వృద్ధిలో మందగమనం అంతర్జాతీయ కమోడిటీల ధరలను కిందకు తెస్తుంది. ఈ కారణంగా 2024 ఆర్థిక సంవత్సరంలో దేశ సీఏడీ పరిస్థితి మెరుగు పడుతుంది.

* 2014 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2019 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం ఆరోగ్య వ్యయంలో ప్రభుత్వ వాటా 28.6 శాతం నుంచి 40.6 శాతానికి చేరింది.

* భారత వ్యవసాయ రంగం అద్భుత పనితీరు కనబరచింది. అయితే వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న పెట్టుబడులు వంటి సమస్యల నేపథ్యంలో ఈ రంగానికి కొత్త దిశానిర్దేశం అవసరం.

* దేశవ్యాప్తంగా మధ్యలోనే బడి మానేసే పిల్లల రేటులో క్రమం తప్పకుండా తగ్గుదల చోటు చేసుకుంటోంది. మరోపక్క పాఠశాల, ఉన్నత విద్యలో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయి.

* దేశ ఆర్థిక ప్రగతిలో సామాజిక రంగ మౌలిక సదుపాయాలు అభివృద్ధి మరింత కీలకం.

* 2015 ఆర్థిక సంవత్సరంలో తీసుకొచ్చిన జన్‌ధన్‌-ఆధార్‌-మొబైల్‌ అంకురం కొవిడ్‌-19 టీకా కార్యక్రమానికి డిజిటల్‌ మౌలికసదుపాయమైన కొవిన్‌ రూపకల్పనలో ఉపకరించింది.

* పీఎం గతిశక్తి, జాతీయ లాజిస్టిక్స్‌ పాలసీ, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు తయారీ రంగ ఉత్పత్తికి ఊతమిస్తాయి.

* సాధారణ పరిస్థితులు నెలకొంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 జీడీపీ నమోదుకు అవకాశం ఉంది.

* ఇతర దేశాలతో పోలిస్తే కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి భారత్‌ చాలా వేగంగా కోలుకుంది. దేశీయ గిరాకీ, మూలధన పెట్టుబడుల్లో పెరుగుదల భారత వృద్ధికి దోహదం చేయనున్నాయి.

* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఎగుమతుల వృద్ధి కాస్త నెమ్మదించింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని