Budget 2023: క్రమశిక్షణా.. ప్రజాకర్షణా?

అటు ఉరుముతున్న ఆర్థికమాంద్యం.. ఇటు తరుముకొస్తున్న ఎన్నికలు.. ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేయాలా? జనాకర్షణకు పట్టం కట్టాలా? కేంద్ర బడ్జెట్‌ వేళ మోదీ సర్కారు ముంగిట నిలిచిన అతిపెద్ద సవాళ్లు ఇవి.

Updated : 01 Feb 2023 07:43 IST

నేడే కేంద్ర బడ్జెట్‌
ఎన్నికల ముంగిట రాజకీయ అనివార్యతలు
పన్నుల భారం తగ్గింపుపై మధ్యతరగతి ఆశలు

దిల్లీ: అటు ఉరుముతున్న ఆర్థికమాంద్యం.. ఇటు తరుముకొస్తున్న ఎన్నికలు.. ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేయాలా? జనాకర్షణకు పట్టం కట్టాలా? కేంద్ర బడ్జెట్‌ వేళ మోదీ సర్కారు ముంగిట నిలిచిన అతిపెద్ద సవాళ్లు ఇవి. తరాజు ఎటువైపు ఎక్కువగా మొగ్గినా రెండో దానిపై తీవ్ర ప్రభావం తప్పదు. అత్యంత చాకచక్యంగా అడుగులేయాల్సిన తరుణమిది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎంత నిర్మాణాత్మకంగా ముందుకు వెళతారనే దానిని ఇప్పుడు యావద్దేశం ఆసక్తితో గమనిస్తోంది. తాయిలాలను ఆశిస్తున్న భిన్నవర్గాల్ని సంతృప్తిపరుస్తూనే.. దేశ ఆర్థిక రంగాన్ని పరుగులు తీయించడానికి బడ్జెట్‌లో ఎలాంటి ప్రతిపాదనలను ఆమె చేయబోతున్నారనేది అత్యంత కీలకాంశం. పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్‌లను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

వరుస కట్టిన సవాళ్లు

కరోనా నుంచి కోలుకునే లోపే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం రూపంలో మరో పిడుగు...ఆ వెంటే తరుముకొస్తున్న ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఈ సమస్యలకు తోడు సరిహద్దుల్లో చైనా కవ్వింపులతో దేశ రక్షణ రంగానికి కేటాయింపులు భారీగా పెంచాల్సిన అనివార్యతను భారత ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అదే సమయంలో అధిక ధరలు, నిరుద్యోగంతో కుదేలవుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదిలోనే పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు వెళ్లే లోపు పూర్తిస్థాయిలో ప్రవేశ పెట్టే చివరి బడ్జెట్‌ ఇదే కావడంతో వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికీ ప్రాధాన్యమివ్వక తప్పదు. ఇన్ని అనివార్యతల మధ్య బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌కు పెద్ద పరీక్షే! బడ్జెట్‌ లోటును తగ్గిస్తూనే ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ప్రస్పుటమవుతోంది.

ఆశల పల్లకీలో మధ్యతరగతి

ఏటా బడ్జెట్‌ అనగానే ప్రతి రంగం కొన్ని ప్రయోజనాలను ఆశించటం సహజం. ఈసారి మధ్యతరగతి మాత్రం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ప్రపంచవ్యాప్త ఆర్థిక, సామాజిక పరిణామాల ప్రభావం భారత మధ్యతరగతిపైనా పడింది. ముఖ్యంగా రూ.5-10 లక్షల మధ్య వార్షికాదాయ వర్గంపై ద్రవ్యోల్బణ భారం భారీగానే ఉంది. ఎలాంటి రాయితీలకు నోచుకోని ఈ వర్గం కేంద్ర బడ్జెట్‌పైనే ఆశలు పెట్టుకుంది. తగ్గుతున్న ఆదాయం, పెరుగుతున్న జీవన వ్యయాలు, ఉద్యోగాల్లో కోతలు... తదితరాల నుంచి తమకు ఊరటనిచ్చే ప్రకటనలేమైనా మోదీ ప్రభుత్వం చేస్తుందేమోనని వీరంతా ఆశిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల్లోనూ భాజపాకు మధ్యతరగతిని బలమైన మద్దతుదారుగా భావిస్తుంటారు. కాబట్టి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చూసినా... వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకొని ఈ వర్గం పట్ల ఆర్థికమంత్రి కరుణ చూపించే అవకాశాలున్నాయనేది అంచనా.

పెట్టుబడుల ఆకర్షణ

వరుసగా మూడోసారి విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్న ప్రధాని మోదీ.. దేశంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని, అందుకుగాను పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.  ఎన్నికలకు ఏడాది వ్యవధి ఉండడంతో పలు సంక్షేమ పథకాలు కొనసాగించడం కోసం భారీ స్థాయిలో రుణాలు తీసుకోవడానికి కూడా కేంద్రం వెనుకాడక పోవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. మాంద్యం పరిస్థితుల్లో దీనిని సుస్థిరం చేసుకుంటూనే మరింత పురోగతి దిశగా అడుగులు వేయడానికి సీతారామన్‌ ఎటువంటి ప్రతిపాదనలు చేయనున్నారో వేచిచూడాల్సిందే.


కిసాన్‌ సమ్మాన్‌ నిధి పెంపు!

వ్యవసాయ భూమి ఉన్న రైతుల బ్యాంకు ఖాతాల్లో మూడు విడతల్లో ఏడాదికి మొత్తం రూ.6 వేలును(ఒక్కోదఫా రూ.2వేలు చొప్పున) మోదీ ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త బడ్జెట్‌లో ఆ సాయాన్ని మరో రూ.2 వేలకు పెంచే అవకాశం ఉంది. అంటే రూ.2వేలు చొప్పున నాలుగు విడతల్లో ఏడాదికి మొత్తం రూ.8 వేలను ప్రతి రైతు ఖాతాకు జమ చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.  ఎరువులపై ఇస్తున్న రాయితీలో, కరోనా సమయంలో పేదల కోసం ప్రారంభించిన ఉచిత ఆహార ధాన్యాల పంపిణీలో కోత విధించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కరోనా సమయంలో చిన్న వ్యాపారులకు తక్కువ వడ్డీకే రుణాలు, ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వంటి చర్యలతో ద్రవ్యలోటు ఒక దశలో రికార్డుస్థాయిలో 9.3 శాతానికి పెరిగింది. రిజర్వుబ్యాంకు విధించిన పరిమితికన్నా ఇది చాలా అధికం. దీనిని 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6శాతం దిగువకు తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించ వచ్చని అధికార వర్గాల సమాచారం. దీనికోసం రాబడిని పెంచే మార్గాలను అన్వేషించే అవకాశం ఉంది.


ఆదాయపు పన్నులో మార్పులుంటాయా?

పెరుగుతున్న ధరలతో కుటుంబాల పొదుపు తగ్గుతున్న నేపథ్యంలో... ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను వేతన జీవులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలన్న డిమాండు బలంగా వినిపిస్తోంది. ఏటా ఈ పన్నుల విషయంలో నిరాశే మిగులుతోంది. ఈసారి కూడా భారీ వెసులుబాటైతే ఉండకపోవచ్చు కానీ.. కొద్దోగొప్పో మార్పులు జరగొచ్చన్న వాదన వినిపిస్తోంది. మధ్యతరగతిని ఆకట్టుకోవటానికి.. ముఖ్యంగా తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ఆర్థిక మంత్రి ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. కొలువుల కోత ప్రభావం నుంచి తప్పించటానికి పట్టణ ఉపాధి కల్పన పథకానికి శ్రీకారం చుట్టే ప్రతిపాదనలూ ఉన్నాయంటున్నారు. వీటితో పాటుగా గృహరుణాలు, ఆరోగ్య ఖర్చులపై పన్నుల్లో కాసింత వెసులుబాటు లభించే వీలుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు అధిక నిధులు కేటాయించాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని