కేంద్ర మాజీ మంత్రి శాంతిభూషణ్‌ కన్నుమూత

కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి, ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్‌(97) మంగళవారం కన్నుమూశారు.

Published : 01 Feb 2023 03:52 IST

దిల్లీ: కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి, ప్రముఖ న్యాయవాది శాంతిభూషణ్‌(97) మంగళవారం కన్నుమూశారు. 1925లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో జన్మించిన ఆయన.. 1977 నుంచి 1979 వరకు మొరార్జీదేశాయ్‌ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా సేవలందించారు. ఇందిరాగాంధీ ఎన్నికను సవాలు చేసిన రాజ్‌నారాయణ్‌ తరపున అలహాబాద్‌ హైకోర్టులో వాదనలు వినిపించి విజయం సాధించారు. అలాగే సీజేఐకి ఉన్న రోస్టర్‌ అధికారాలనూ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. న్యాయవ్యవస్థలో అవినీతి ఉందని ఆరోపణలు చేయడమే కాకుండా.. జైలుకి అయినా వెళ్తాను తప్ప సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పనని ఆరోపణలకు కట్టుబడి ఉన్నారు. మొదటగా ఇందిరాగాంధీతో విభేదాలు ఏర్పడి చీలిపోయిన కాంగ్రెస్‌ (ఓ) పార్టీలో కీలకంగా పనిచేశారు. అనంతరం జనతా పార్టీలో, 1980లో భాజపాలో చేరారు. అవినీతిని నిరసించే శాంతిభూషణ్‌.. ఆప్‌ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. ప్రముఖ న్యాయవాదులు జయంత్‌ భూషణ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లు ఈయన కుమారులే. శాంతిభూషణ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ, న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని