సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు జడ్జీలు

ప్రస్తుత అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

Updated : 01 Feb 2023 06:37 IST

కొలీజియం సిఫార్సు
పెండింగ్‌లో ఉన్న అయిదుగురి నియామకాలపై  నోటిఫికేషన్‌ జారీ చేయండి
కేంద్రానికి సూచన

ఈనాడు, దిల్లీ: ప్రస్తుత అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించాలని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గత ఏడాది డిసెంబర్‌ 13న సిఫార్సు చేసిన జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమనుల్లా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల నియామక నోటిఫికేషన్‌ ఇంతవరకూ వెలువడలేదని, అందువల్ల తొలుత వారి నియామక ప్రకటన విడుదల చేసి, తర్వాత ఈ ఇద్దరి నియామకాలు చేపట్టాలని కొలీజియం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రతిభ, నిజాయతీ, సామర్థ్యం, విభిన్న ప్రాంతాలకు, అట్టడుగు వర్గాల వారికి అవకాశం కల్పించే విషయాన్ని పరిగణలోకి తీసుకొని జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌, జస్టిస్‌ అరవింద్‌కుమార్‌ల పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం కోసం సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు కొలీజియం పేర్కొంది. ‘ప్రస్తుతం సిఫార్సు చేసిన వారిలో జస్టిస్‌ రాజేష్‌ బిందల్‌ పేరును ఆరుగురు కొలీజియం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. జస్టిస్‌ అరవింద్‌కుమార్‌ విషయంలో జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ ఆయన పేరును తర్వాతి దశలో పరిగణనలోకి తీసుకొని ఉండొచ్చని చెప్పార’ని కొలీజియం వెల్లడించింది. ఈ ప్రకటనపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సంతకం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని