ఒంగోలు జాతి సహా 4 స్వదేశీ ఆవుల జన్యుక్రమం ఆవిష్కరణ

ఎంతో ప్రత్యేకంగా నిలిచిన ఒంగోలు జాతి ఆవులు సహా మూడు స్వదేశీ గోమాతల జన్యుక్రమాన్ని భారత శాస్త్రవేత్తలు తొలిసారిగా ఆవిష్కరించారు.

Published : 01 Feb 2023 04:33 IST

భోపాల్‌: ఎంతో ప్రత్యేకంగా నిలిచిన ఒంగోలు జాతి ఆవులు సహా మూడు స్వదేశీ గోమాతల జన్యుక్రమాన్ని భారత శాస్త్రవేత్తలు తొలిసారిగా ఆవిష్కరించారు. భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌) పరిశోధకులు ఈ ఘనత సాధించారు. భారత్‌లో వేడి వాతావరణాన్ని ఈ జాతులు ఎలా తట్టుకుంటున్నాయన్నది దీనివల్ల తెలుస్తుంది. దేశీయ పశుసంపద వృద్ధికీ ఇది దోహదపడుతుందని సంస్థ పేర్కొంది. ఈ పరిశోధన వివరాలు ‘బయో ఆర్కైవ్‌’లో ప్రచురితమయ్యాయి. స్వదేశీ ఆవుల జన్యుక్రమాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఆయా జాతులకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాటిలోని కొన్ని ప్రత్యేక లక్షణాలు, వ్యాధుల గురించి కూడా అర్థం చేసుకోవచ్చన్నారు. అవి నాసిరకం ఆహారం తీసుకోగలవని, కొన్ని రకాల వ్యాధులను తట్టుకోగలవని తెలిపారు. ‘‘ఈ పరిశోధన చాలా ముఖ్యమైంది. ఎందుకంటే భారత ఆవులకు సంబంధించిన జన్యుక్రమ వివరాలేవీ ప్రస్తుతం అందుబాటులో లేవు. ఏదైనా అధ్యయనం చేయాలంటే పశ్చిమ దేశాలకు చెందిన బాస్‌ టారస్‌ ఆవు జాతి జన్యుక్రమంపైనే ఆధారపడాల్సి వస్తోంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న వినీత్‌ శర్మ పేర్కొన్నారు. దేశీయ ఆవుల్లో ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. తాజా పరిశోధనలో కాసర్‌గోడ్‌ డ్వార్ఫ్‌, కాసర్‌గోడ్‌ కపిల, వేచుర్‌ జాతి ఆవుల జన్యుక్రమాన్ని కూడా శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని