రిక్షావాలా నుంచి క్యాబ్‌ కంపెనీకి అధిపతిగా..

బస్సు డ్రైవర్‌ ఉద్యోగం దొరక్క దిల్లీలో రిక్షా లాగిన యువకుడు ఇప్పుడు ఓ అంకుర సంస్థను స్థాపించాడంటే నమ్మగలమా.. పట్నాలో ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు విక్రయించిన ఆ యువకుడు ఇప్పుడు దేశమంతా తన సంస్థను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాడంటే ఊహించగలమా.. సినిమా కథలా ఉన్న ఈ విషయాలన్నీ నిజమైతే అదే బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్‌ కుమార్‌ జీవితం.

Updated : 01 Feb 2023 08:17 IST

బిహార్‌ యువకుడి స్టార్టప్‌ ప్రస్థానం

బస్సు డ్రైవర్‌ ఉద్యోగం దొరక్క దిల్లీలో రిక్షా లాగిన యువకుడు ఇప్పుడు ఓ అంకుర సంస్థను స్థాపించాడంటే నమ్మగలమా.. పట్నాలో ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు విక్రయించిన ఆ యువకుడు ఇప్పుడు దేశమంతా తన సంస్థను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాడంటే ఊహించగలమా.. సినిమా కథలా ఉన్న ఈ విషయాలన్నీ నిజమైతే అదే బిహార్‌కు చెందిన దిల్‌ఖుష్‌ కుమార్‌ జీవితం.

సెకండ్‌ హ్యాండ్‌ నానోతో..

సహర్సా జిల్లాలోని బన్‌గావ్‌ గ్రామానికి చెందిన యువకుడు దిల్‌ఖుష్‌ కుమార్‌. ఇంటర్‌తోనే చదువు ఆపేశాడు. బస్సు నడుపుకొందామని ఏడేళ్ల క్రితం బిహార్‌ను వదిలిపెట్టి దిల్లీకి చేరుకున్నాడు. వాళ్లనీ వీళ్లనీ బతిమాలినా ఆ ఉద్యోగం దొరక్కపోవడంతో రిక్షా లాగే పనికి కుదిరాడు. కొంతకాలానికి పట్నాకి తిరిగొచ్చేసి ఇంటింటికీ కూరగాయలు అమ్మడం, జిరాక్స్‌ దుకాణం నడపడం లాంటివి చేశాడు. చిన్నప్పటి నుంచి లక్షాధికారి కావాలని కలలు కన్న దిల్‌ఖుష్‌కు ఈ పనులు చేయడం నచ్చలేదు. ఏదైతే అది అయిందని 2016లో అంకుర సంస్థను స్థాపించడానికి సిద్ధపడ్డాడు. చిన్నప్పటి నుంచి కారు మీద ఉన్న మక్కువతో తన సొంత ఊరు బన్‌గావ్‌లో ఆర్యగో అనే క్యాబ్‌ సేవల సంస్థను ప్రారంభించాడు. సెకండ్‌ హ్యాండ్‌ నానోతో గేదెల పాకలో ప్రయాణం ప్రారంభించిన ఆ సంస్థను రెండేళ్లలో 500 డ్రైవర్లతో ఏడు జిల్లాలకు విస్తరించాడు.

రోడ్‌బేజ్‌తో బిహార్‌ లోపలికి

రోడ్‌బేజ్‌ అంటే రోడ్‌ వేస్‌ అనే పదాన్ని బిహారీలు పలికే విధానం. దీనిని బట్టే దిల్‌ఖుష్‌ ప్రణాళికను అర్థం చేసుకోవచ్చు. బిహార్‌లో ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా మరో ప్రాంతానికి కారులో వెళ్లేందుకు 2022లో ఈ యాప్‌ను తీసుకొచ్చాడు. నాణ్యతలో రాజీ పడకుండా ఐఐటీ, ఐఐఎమ్‌ల నుంచే ఉద్యోగులను తీసుకున్నాడు. వన్‌-వే టాక్సీ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా బిహార్‌లో ట్యాక్సీ చైన్‌ను సృష్టించాడు. ఓలా, ఉబర్‌ వంటి సంస్థలకు భిన్నంగా సుదూర ప్రాంతాలకు క్యాబ్‌లు వస్తుండటంతో రోడ్‌బేజ్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం 4000 వరకు కార్లతో క్యాబ్‌ సేవలు అందిస్తున్న దిల్‌ఖుష్‌ ప్రధానమంత్రి ప్రశంసలూ అందుకున్నాడు. ‘చెప్పులు వేసుకునే వారినీ విమానాలు ఎక్కిస్తామని మోదీ అంటారు... అలాగే నేను వారిని కారు ఎక్కించే ప్రయత్నం చేస్తా’ అనే దిల్‌ఖుష్‌.. రానున్న రోజుల్లో 25 వేల క్యాబ్‌లతో కేరళ నుంచి కశ్మీర్‌ వరకు తన సంస్థను విస్తరిస్తానని చెబుతున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు