బినామీ చట్టం తీర్పుపై సమీక్షకు.. బహిరంగ విచారణ

బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ చట్టం, 2016లోని కొన్ని నిబంధనలను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్షకు బహిరంగ విచారణ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు మంగళవారం పరిగణనలోకి తీసుకొంది.

Published : 01 Feb 2023 04:54 IST

సుప్రీంకోర్టు ఆమోదం

దిల్లీ: బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ చట్టం, 2016లోని కొన్ని నిబంధనలను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్షకు బహిరంగ విచారణ చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ వినతిని సుప్రీంకోర్టు మంగళవారం పరిగణనలోకి తీసుకొంది. ఈ చట్టంలోని సెక్షన్‌ 3(2), సెక్షన్‌ 5లతోపాటు బినామీ లావాదేవీలు చేస్తే గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా.. లేదా రెండు శిక్షలూ విధించే అంశాన్ని గతేడాది ఆగస్టు 23న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. ఆ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని.. అస్పష్టంగా, ఏకపక్షంగా ఉన్నాయని పేర్కొంది. ఈ చట్టం అమలులోకి రావడానికి ముందు జరిగిన లావాదేవీల్లో ఆస్తుల స్వాధీనం, నేరవిచారణ లాంటివి చేపట్టడానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన ఓ తీర్పును సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషనుపై ఈ తీర్పు వెలువడింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనాన్ని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రభుత్వం తరఫున ఈ తీర్పుపై సమీక్ష కోరారు.

రానా అయ్యుబ్‌ కేసులో తీర్పు రిజర్వు

మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జర్నలిస్టు రానా అయ్యుబ్‌పై గాజియాబాద్‌ ప్రత్యేక కోర్టు జారీ చేసిన సమన్లపై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పును రిజర్వు చేసింది. రానా తరఫు న్యాయవాది వృందా గ్రోవర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘‘ముంబయిలో తప్పు జరిగిందని ఈడీ ఆరోపిస్తోంది. అలాంటప్పుడు గాజియాబాద్‌ ప్రత్యేక కోర్టు ఎలా సమన్లు జారీ చేస్తుంది’’ అని అన్నారు. ‘‘అక్రమ విరాళాలు సేకరించారని రానాపై గాజియాబాద్‌లోని ఇందిరాపురంలో కేసు నమోదయింది. ఒకవేళ సింగపుర్‌లోనో, తిరువనంతపురంలోనో తప్పు జరిగితే అక్కడికి వెళ్లి కేసు నమోదు చేయాలా?. కెట్టో అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ద్వారా రూ.కోటి వరకు డబ్బులు సేకరించి.. రూ.50లక్షలు ముంబయిలో ఉన్న తన వ్యక్తిగత ఖాతాకు బదలాయించుకున్నారు’’ అని ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. రానా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని తీర్పును రిజర్వు చేస్తున్నట్లు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాల ధర్మాసనం తెలిపింది. గతేడాది నవంబరు 29న గాజియాబాద్‌లోని ప్రత్యేక కోర్టు రానాపై ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని