Income tax: ఐటీ కొత్త విధానంలో.. కొంత ఊరట
కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు.
రూ.7 లక్షల వరకు ఆదాయపన్ను పడదు
తగ్గిన శ్లాబుల సంఖ్యతో ఉపశమనం
పాత పన్నుల విధానంలో మార్పులేదు
ఈనాడు, బిజినెస్‌బ్యూరో: కొత్త పన్ను విధానాన్ని ఎంచుకునే వారిని ప్రోత్సహించే దిశగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశ పెట్టిన కొత్త విధానంలో రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను భారం లేకుండా రిబేటును ప్రతిపాదించారు. ఇందుకు ఎలాంటి పొదుపు, పెట్టుబడులతో పని ఉండదు. అంతకుమించి ఆదాయం కలిగిన వారికి శ్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది. దీంతోపాటు కొత్త పన్ను విధానం శ్లాబుల సంఖ్యనూ తగ్గించి, ఊరట కల్పించారు. మధ్య తరగతి వేతన జీవులకు ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశమే. పలు సెక్షన్ల కింద మినహాయింపులను అనుమతించే పాత పన్నుల విధానంలో మాత్రం ఎలాంటి మార్పులనూ ప్రతిపాదించలేదు. కొత్త పన్ను విధానంలో ఇప్పటి వరకు ఉన్న రూ.2,50,000 మినహాయింపును రూ.3 లక్షలకు పెంచారు. ఫలితంగా ఆదాయపు పన్ను పరిమితి రూ.50 వేలు పెరిగినట్లయ్యింది. పాత పన్ను విధానంలో ఆదాయ పరిమితిని మాత్రం రూ.2,50,000 గానే ఉంచారు. పాత పన్ను విధానంలోనూ పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్నప్పుడు ఎలాంటి భారం ఉండదు. చెల్లించాల్సిన పన్ను రూ.12,500 కు రిబేటు లభిస్తుంది. రూ.5 లక్షలకు మించినప్పుడే శ్లాబుల వారీగా పన్ను చెల్లించాల్సి వస్తుంది.
ప్రామాణిక తగ్గింపుతో..
పాత పన్ను విధానంలో రూ.50 వేల వరకు ప్రామాణిక తగ్గింపును అనుమతించేవారు. ఇక నుంచి కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికీ ఈ మినహాయింపు కల్పించనున్నారు. కొత్త విధానాన్ని ఎంచుకునే వారికి అదనపు ప్రయోజనం చేకూరేలా చేశారు.
సర్‌ఛార్జీ తగ్గింపు
అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల (హెచ్‌యూఎఫ్)కు ఊరట కలిగించేలా సర్‌ఛార్జీని తగ్గించారు. ప్రస్తుతం రూ.5 కోట్లకు మించి ఆదాయం ఉన్న వారికి 37% సర్‌ఛార్జీ వర్తిస్తోంది. దీన్ని 25 శాతానికి తగ్గిస్తున్నారు. దీంతో రూ.2 కోట్ల ఆదాయం ఉన్న వారందరూ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి 25 శాతం సర్‌ఛార్జీ పరిధిలోకి రానున్నారు.
ఏదైనా ఒక దానిని ఎంచుకొనే వీలు
పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం లేదా పాత పన్ను విధానంలో ఏదో ఒకదానిని ఎంచుకునే వీలుంది. గతంలో ఏదో ఒకదానిని మనమే ఎంచుకోవాల్సి వచ్చేది. పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు వెబ్‌సైట్‌లో కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఉంటుంది. పాత పన్ను విధానం కావాలనుకుంటే దీన్ని మార్చుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సరం పాత పన్ను విధానం, మరో ఆర్థిక సంవత్సరం కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. కానీ, వృత్తి, వ్యాపారం ద్వారా లాభాలను ఆర్జించే వారు ఒకసారి కొత్త పన్ను విధానంలోకి మారిన తర్వాత, మళ్లీ పాత పద్ధతిలో రిటర్నులు దాఖలు చేయడం సాధ్యం కాదు.
* ఉద్యోగులు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ చేసుకున్నప్పుడు రూ.3లక్షల వరకే పన్ను మినహాయింపు ఉండేది. పెరిగిన వేతనాలను దృష్టిలో పెట్టుకుని, ఈ మొత్తాన్ని రూ.25లక్షలకు పెంచుతున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు.
బీమా ప్రీమియం రూ.5లక్షలు దాటితే...
జీవిత బీమా పాలసీల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5లక్షలకు మించి ప్రీమియం చెల్లించినప్పుడు, పన్ను పరిధిలోకి తీసుకొస్తూ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. 2023 ఏప్రిల్ 1 నుంచి తీసుకునే పాలసీలకు చెల్లించే ప్రీమియం రూ.5లక్షల లోపు ఉన్నప్పుడు మాత్రమే మెచ్యూరిటీ మొత్తానికి పన్ను పరిధి నుంచి మినహాయింపు లభిస్తుంది. రూ.5 లక్షల పైన ప్రీమియం చెల్లించిన బీమా పాలసీల ద్వారా వచ్చిన ఆదాయానికి పన్ను మినహాయింపు వర్తించదు. పాలసీదారుడు మరణించిన సందర్భంలో వచ్చే పరిహారాలకు ఎలాంటి పన్ను ఉండదు.
వివాదాలను పరిష్కరించేలా..
ఆదాయపు పన్ను విషయంలో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకునేందుకు వీలుగా తీసుకొచ్చిన వివాద్ సే విశ్వాస్-2 పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.
మహిళలకు ప్రత్యేకంగా...
పొదుపు, పెట్టుబడుల దిశగా మహిళలను ప్రోత్సహించేందుకు కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మహిళా సమ్మాన్ బచత్ పత్ర’ పేరుతో అందిస్తున్న ఈ ఒకసారి పెట్టుబడి పథకంలో రూ.2లక్షల వరకు జమ చేసుకోవచ్చు. బాలికల పేరుమీదా ఇందులో పొదుపు చేసుకోవచ్చు. రెండేళ్ల వ్యవధి ఉన్న ఈ పత్రాల్లో వార్షిక వడ్డీ 7.5 శాతం చెల్లించనున్నారు. వ్యవధి లోపు పాక్షికంగా కొంత మొత్తాన్ని తీసుకునేందుకు అనుమతిస్తారు.
ఈపీఎఫ్ ఉపసంహరణపై టీడీఎస్ తగ్గింపు
భవిష్యనిధి నిల్వలను పాన్‌కార్డు అనుసంధానం లేకుండా పూర్తిగా వెనక్కు తీసుకుంటే, ఆ మొత్తంపై ఆదాయపన్ను భారాన్ని కేంద్రం తగ్గించింది. ప్రస్తుత 30శాతం టీడీఎస్‌ను 20 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో తెలిపింది.
చిన్న మొత్తాల పరిమితి పెంపు
* పదవీ విరమణ చేసిన వారికి క్రమం తప్పకుండా ఆదాయం అందించేందుకు ఉద్దేశించిన పెద్దల పొదుపు పథకం (సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం) పరిధిని పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఈ పరిమితి రూ.15 లక్షలు ఉండగా, దీన్ని రూ.30లక్షలకు పెంచారు. ప్రభుత్వ హామీ ఉండే ఈ పథకానికి ఎంతో ఆదరణ ఉంది. ప్రస్తుతం దీనికి 8% వార్షిక వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీని చెల్లిస్తారు. 55 ఏళ్ల తరవాత పదవీ విరమణ చేసిన వారు, 60 ఏళ్లు దాటిన వ్యక్తులు ఇందులో చేరొచ్చు.
* పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకం (మంత్లీ ఇన్‌కం అకౌంట్ స్కీం) పరిమితిని రూ.4.5 లక్షల నుంచి రూ.9లక్షలకు పెంచారు. ఉమ్మడి ఖాతా పరిమితిని రూ.9లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు.ప్రస్తుతం ఈ ఖాతాలో 7.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Lionel Messi: మెస్సికి అరుదైన గౌరవం.. ఫుట్‌బాల్ దిగ్గజాల సరసన విగ్రహం
-
Movies News
Priyanka Chopra: బాలీవుడ్‌పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. అందుకే హాలీవుడ్‌కి వెళ్లానంటూ
-
Politics News
DK Shivkumar: ఎన్నికల ప్రచారంలో కరెన్సీ నోట్లు వెదజల్లిన డీకేఎస్.. వీడియో వైరల్
-
Sports News
IPL 2023: ఆర్సీబీ మార్చ్‌లో గేల్ డ్యాన్స్..కోహ్లీ అని అరుస్తూ ప్రేక్షకుల కేరింతలు
-
Latestnews News
Quadruplets: ఒకే కాన్పులో నలుగురు పిల్లల జననం
-
World News
Belarus: ‘అమెరికా ఒత్తిడివల్లే.. రష్యా అణ్వాయుధాలకు చోటు!’