Budget 2023: విద్యాభివృద్ధిరస్తు!

కేంద్ర బడ్జెట్‌లో మునుపెన్నడూ లేనంతగా ఈసారి విద్యారంగానికి కేటాయింపులు చేశారు. రూ.1,12,899 కోట్లు కేటాయించారు.

Updated : 02 Feb 2023 05:41 IST

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో మునుపెన్నడూ లేనంతగా ఈసారి విద్యారంగానికి కేటాయింపులు చేశారు. రూ.1,12,899 కోట్లు కేటాయించారు. మొత్తం బడ్జెట్‌లో ఇది 2.5 శాతం. పాఠశాల విద్యా విభాగానికి రూ.68,805 కోట్లు, ఉన్నత విద్యా విభాగానికి రూ.44,094 కోట్లు దక్కాయి. తాజా బడ్జెట్‌లో కేంద్రం విద్య, నైపుణ్యాల అభివృద్ధికి పెద్దపీట వేసింది.

* దేశవ్యాప్తంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల (మోడల్‌ స్కూళ్లు) కోసం 38,800 మంది టీచర్లు, సహాయక సిబ్బందిని నియమించనున్నారు. 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులకు బోధన అందించే 740 ఏకలవ్య పాఠశాలల్లో వచ్చే మూడేళ్లలో వీరిని నియమిస్తారు.

* పిల్లలు, కౌమారప్రాయుల కోసం జాతీయ డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. భౌగోళికాంశాలు, కళలు, భాషలు-సాహిత్య ప్రక్రియలు తదితర అంశాలకు సంబంధించిన నాణ్యమైన పుస్తకాలను అందుబాటులోకి తెస్తారు.

* పంచాయతీ, వార్డు స్థాయుల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తారు. ఇవి జాతీయ డిజిటల్‌ గ్రంథాలయ వనరులను వినియోగించుకునేందుకు వసతులను కూడా కల్పిస్తారు. పఠనాసక్తి, ఆర్థిక రంగంపై విజ్ఞానాన్ని పెంపొందించేందుకు నేషనల్‌, చిల్డ్రన్స్‌ బుక్‌ ట్రస్ట్‌లు, పలు సంస్థలు ప్రోత్సాహాన్ని అందిస్తాయి.

* జాతీయ విద్యా మిషన్‌కు రూ.38,953 కోట్లు కేటాయించారు. నూతన విద్యావిధానం (ఎన్‌ఈపీ), 2020 అమలుకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉత్తమ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు రూ.4,235.74 కోట్లు కేటాయించారు.

* 2022-23 బడ్జెట్‌తో పోలిస్తే యూజీసీకి 9.37%, కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు 17.66%, డీమ్డ్‌ యూనివర్సిటీలకు 27%, ఐఐటీలకు 14%, ఎన్‌ఐటీలకు 10.5% కేటాయింపులు పెంచారు.

* వివిధ రకాల పరిశోధనలు చేపట్టేందుకు.. అత్యాధునిక అప్లికేషన్ల అభివృద్ధికి.. సుస్థిర నగరాలు, వ్యవసాయ, ఆరోగ్య రంగాలకు సంబంధించి సమస్యల పరిష్కారానికి.. దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో 3 కృత్రిమ మేధ (ఏఐ) కేంద్రాలను (సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌) ఏర్పాటు చేస్తారు. ప్రముఖ పరిశ్రమలకు చెందిన వారు కూడా భాగస్వాములవుతారు.

* 5జీ సేవల అప్లికేషన్లను అభివృద్ధి చేసేందుకు గాను బ్యాంకులు, వివిధ సంస్థల సహకారంతో ఇంజినీరింగ్‌ విద్యాసంస్థల్లో 100 ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. నూతన శ్రేణి అవకాశాలు, వాణిజ్య విధానాలు, కీలక ఉపాధి రంగాల గురించి తెలుసుకునేందుకు ఇవి తోడ్పాటు అందిస్తాయి.

* వినూత్న బోధన, పాఠ్యాంశాలు; నిరంతర వృత్తిపరమైన అభివృద్ధి, ఐసీటీ అమలు వంటి అంశాల ఆధారంగా.. ఆధునిక పద్ధతుల్లో టీచర్ల శిక్షణ కార్యక్రమాలను రూపొందిస్తారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థల ద్వారా శిక్షణలో సమూల మార్పులు చేస్తారు. వీటిని సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌గా అభివృద్ధి చేస్తారు.


47 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ

తాజా బడ్జెట్‌లో ‘యూత్‌ పవర్‌’ పేరుతో వారికి ప్రాధాన్యం కల్పించారు. యువత సాధికారత, ఉద్యోగాల సృష్టికి లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు గాను ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన-4.0ను అమలు చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు తగినట్లు ఇచ్చే శిక్షణలో పరిశ్రమలను కూడా భాగస్వామ్యం చేయనున్నారు. కోడింగ్‌, కృత్రిమ మేధ, రోబోటిక్స్‌, మెకాట్రానిక్స్‌, ఐవోటీ, త్రీడీ ప్రింటింగ్‌, డ్రోన్‌, సాఫ్ట్‌స్కిల్స్‌ వంటి కొత్త తరం కోర్సులు నిర్వహిస్తారు. యువత అంతర్జాతీయ అవకాశాలను అందుకునేలా వివిధ రాష్ట్రాల్లో 30 స్కిల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. నేషనల్‌ అప్రెంటిస్‌షిప్‌ ప్రమోషన్‌ పథకం కింద మూడేళ్లలో దేశవ్యాప్తంగా 47 లక్షల మంది యువతకు శిక్షణ ఇస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు