Budget 2023: వ్యవ‘సాయం’ యథాతథం

కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులను పెద్దగా పెంచలేదు.

Updated : 02 Feb 2023 13:35 IST

గత బడ్జెట్‌తో పోలిస్తే స్వల్పంగానే నిధుల పెంపు
కిసాన్‌, ఫసల్‌ బీమా యోజనలకు పెరగని కేటాయింపులు
పంట రుణాలు మాత్రం 11% అధికం
‘శ్రీఅన్న’కు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా ‘హైదరాబాద్‌’

ఈనాడు, దిల్లీ: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు గత ఏడాదితో పోలిస్తే నిధుల కేటాయింపులను పెద్దగా పెంచలేదు. దాదాపు యథాతథంగా ఉంచింది. 2022-23లో వ్యవసాయ,  అనుబంధ రంగాలకు రూ.1.24 లక్షల కోట్లు కేటాయించగా ఈసారి రూ.1.25 లక్షల కోట్లు ఇచ్చింది. వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించడానికి అధిక ప్రాధాన్యమిస్తూ అంకుర సంస్థలు, పరిశోధనలు, డిజిటల్‌ వేదికలు, కంప్యూటరీకరణకు బాటలు వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన ప్రసంగంలో ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ పలు కీలక ప్రకటనలు చేశారు. ముఖ్యాంశాలివీ...

వ్యవసాయ రుణాలు రూ.20 లక్షల కోట్లు

రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని గత ఏడాదితో పోలిస్తే 11% పెంచారు. పశుసంవర్థక, మత్స్య, పాడి, పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కోట్ల రుణాలను ఇస్తామన్నారు. ఇది నిరుడు రూ.18 లక్షల కోట్లు. చిన్న, మధ్యతరహా రైతులకు పూచీకత్తు/తనఖా లేకుండా రూ.1.6 లక్షల వంతున రుణం ఇస్తామన్నారు.

సేంద్రియ సేద్యంలోకి కోటి మంది

సేంద్రియ సేద్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి కోటి మంది రైతులను ప్రోత్సహిస్తామన్నారు. వీరికి సూక్ష్మ ఎరువులు, పురుగు మందులను సరఫరా చేయడానికి 10 వేల బయో ఇన్‌పుట్‌ రిసోర్సు సెంటర్లను స్థాపిస్తామన్నారు. ప్రత్యామ్నాయ, రసాయన ఎరువుల సమతుల వినియోగాన్ని పెంచడానికి పీఎం-ప్రణామ్‌ (ప్రధానమంత్రి- వ్యవసాయ నిర్వహణకు ప్రత్యామ్నాయ పోషకాల ప్రోత్సాహం) పథకం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు.

ఉద్యానంలో క్లీన్‌ ప్లాంట్‌

ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడానికి రూ.2,200 కోట్లతో ఆత్మనిర్భర్‌ హార్టికల్చర్‌ క్లీన్‌ ప్లాంట్‌ పథకాన్ని మంత్రి ప్రవేశపెట్టారు. దీని ద్వారా వ్యాధి నిరోధకత, నాణ్యత కలిగిన మొక్కలను, పరికరాలను రైతులకు అందిస్తామన్నారు. 

యువ ఆవిష్కర్తలకు ప్రోత్సాహం

గ్రామీణ ప్రాంతాల్లోని యువ ఆవిష్కర్తలు ఏర్పాటు చేసే వ్యవసాయ అంకుర సంస్థలకు ‘అగ్రికల్చర్‌ యాక్సిలరేటర్‌ ఫండ్‌’ (ఏఏఎఫ్‌) ద్వారా ప్రోత్సాహాన్ని అందజేస్తారు. ఈ సంస్థల ద్వారా రైతులు ఎదుర్కొనే సవాళ్లకు నవీన, అందుబాటులో ఉండే పరిష్కారాలను చూపుతామన్నారు.

పొడుగు పింజల పత్తికి ప్రాధాన్యం

నాణ్యమైన పత్తి దిగుబడిని పెంచడానికి పొడుగు పింజల రకాలకు ప్రాధాన్యం ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)లో పని చేస్తామన్నారు.

రూ.6వేల కోట్లతో మీనం మిలమిల

మత్స్యశాఖ అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.6 వేల కోట్లను కేటాయించారు. దేశీయంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల దాణాపై కస్టమ్స్‌ సుంకం తగ్గించారు.

‘సహకారం’లో కంప్యూటరీకరణ

చిన్న, సన్నకారు రైతుల సంక్షేమం కోసం సహకార వ్యవస్థ ఆధారిత ఆర్థిక నమూనాను అవలంబిస్తున్నట్లు సీతారామన్‌ ప్రకటించారు. దీనికోసం రూ.2,516 కోట్లతో 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీఎస్‌) కంప్యూటరీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో పీఏసీఎస్‌, ప్రాథమిక మత్స్య సొసైటీలు, డెయిరీ సహకార సొసైటీలను ఏర్పాటు చేస్తామన్నారు.


చిరుధాన్యాల్లో పెద్దన్న... ‘శ్రీఅన్న’

చిరుధాన్యాల ప్రాముఖ్యతను ప్రపంచానికి పరిచయం చేయడంలో భారత్‌ ముందుందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. చిరుధాన్యాలను మంత్రి తన ప్రసంగంలో ‘శ్రీఅన్న’ పేరుతో ఉచ్చరించారు. చిరుధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో, వాటి ఎగుమతిలో ద్వితీయ స్థానంలో భారత్‌ నిలిచిందని గుర్తుచేశారు. భారత్‌ను ప్రపంచ శ్రీఅన్న కేంద్రంగా మార్చడంలో భాగంగా హైదరాబాద్‌లో ఉన్న ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌’ను సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని