కేంద్ర బడ్జెట్‌.. పలురంగాలకు కేటాయింపులు ఇలా..

దేశంలో అణు విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యాన్ని బాగా పెంచాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఈ దిశగా కేటాయింపులు జరిపింది. భారత అణు విద్యుత్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐఎల్‌)కు రూ.9,410 కోట్లను ప్రత్యేకించింది.

Updated : 02 Feb 2023 06:00 IST

అణు విద్యుత్‌ కార్పొరేషన్‌కు రూ.9,410 కోట్లు

దిల్లీ: దేశంలో అణు విద్యుత్‌ ఉత్పాదక సామర్థ్యాన్ని బాగా పెంచాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో ఈ దిశగా కేటాయింపులు జరిపింది. భారత అణు విద్యుత్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐఎల్‌)కు రూ.9,410 కోట్లను ప్రత్యేకించింది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది 43 శాతం అధికం కావడం విశేషం. ఈ కేటాయింపులకు తోడు అంతర్గత, బడ్జెటేతర వనరుల ద్వారా రూ.12,863 కోట్లను ఎన్‌పీసీఐఎల్‌ సమకూర్చుకుంటుంది. తాజా బడ్జెట్‌లో అణు ఇంధన శాఖకు రూ.25,078.49 కోట్లను  కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సవరించిన అంచనాల (రూ.25,965.67) కన్నా ఇది తక్కువ. ఈ శాఖ పరిధిలోకి వచ్చే ఇండియన్‌ రేర్‌ ఎర్త్స్‌ లిమిటెడ్‌కు రూ.120.30 కోట్లు, యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు రూ.59.82 కోట్లు, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు రూ.15 కోట్లను కేంద్రం కేటాయించింది. ఫ్యూయెల్‌ రీసైకిల్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.805.21 కోట్లను ప్రతిపాదించారు.


అంతరిక్ష పరిశోధనలకు రూ.12,543.93 కోట్లు

కేటాయింపుల్లో 8% కోత

శ్రీహరికోట, న్యూస్‌టుడే: అంతరిక్ష పరిశోధనలకు బడ్జెట్‌లో రూ.12,543.93 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో (రూ.13,700 కోట్లు) పోల్చితే ఇది 8% తక్కువ. కొవిడ్‌ ప్రభావంతో 2020-21 మినహా అంతరిక్ష పరిశోధనలకు బడ్జెట్‌లో గత రెండేళ్లు కేటాయింపులు పెరిగినా, ఈ ఆర్థిక సంవత్సరంలో కాస్త తగ్గాయి. ఇస్రో ఈ ఏడాది చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 వంటి భారీ ప్రాజెక్టులతోపాటు వాణిజ్య ప్రయోగాలతో తీరికలేని షెడ్యూల్‌ కలిగి ఉంది.


ఈవీఎంల కొనుగోలుకు రూ.1,900 కోట్లు

దిల్లీ: వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో- ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం(ఈవీఎం)ల కోసం బడ్జెట్‌లో రూ.1891.78 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, ఓటు రసీదు యంత్రాలు (వీవీప్యాట్‌లు), వాడకంలో లేని ఈవీఎంలను నిర్వీర్యం చేయడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు. వీటిని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌), ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఈసీఐఎల్‌) తయారు చేస్తాయి.


మంత్రుల జీతభత్యాలకు రూ.1,258.6 కోట్లు

దిల్లీ: కేంద్ర మంత్రుల జీతాలు, ప్రయాణ భత్యాలు, విదేశీ ప్రముఖులకు ఆతిథ్యం వగైరా ఖర్చులకు 2023-24 బడ్జెట్లో రూ.1,258.68 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి కార్యాలయ (పీఎంవో) ఖర్చులు, జాతీయ భద్రతా మండలి కార్యాలయం, ప్రధాన శాస్త్రీయ సలహాదారు పేషీ, మాజీ గవర్నర్లకు సచివాలయ సేవల ఖర్చులు కూడా ఇందులోకే వస్తాయి. సింహభాగం రూ.832.81 కోట్లు మంత్రి మండలికి కేటాయించారు. జాతీయ భద్రతా మండలి కార్యాలయ వాటా రూ.185.7 కోట్లు కాగా, ప్రధాన శాస్త్రీయ సలహాదారు పేషీకి రూ.96.93 కోట్లు, కేబినెట్‌ సచివాలయానికి 71.91 కోట్లు.. ప్రధాని కార్యాలయానికి రూ.62.65 కోట్లు వెచ్చిస్తారు. దేశంలో పర్యటనలకు వచ్చే విదేశీ ప్రముఖుల ఆతిథ్యానికి రూ.6.88 కోట్లు, మాజీ గవర్నర్లకు సచివాలయ సేవల ఖర్చులకు రూ.1.8 కోట్లు కేటాయించారు.    


పేద ఖైదీలకు ఆర్థిక సాయం

దిల్లీ: జరిమానా, బెయిల్‌ రుసుం కట్టలేని స్థితిలో ఉన్న పేద ఖైదీలకు ఆర్థికంగా తోడ్పాటు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘‘పేద ఖైదీలతో పాటు జరిమానా కట్టలేని, బెయిల్‌ రుసుం చెల్లించలేని వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తాం’’ అని చెప్పారు.


మైనారిటీ వ్యవహారాలకు నిధుల కోత

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు భారీగా నిధులు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే సుమారు 38శాతం కోత పెట్టారు. 2022-23 బడ్జెట్‌లో రూ5020.50కోట్లు కేటాయించగా వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.3097.60 కోట్లు ప్రతిపాదించారు.


పర్యాటకం పరుగులు తీయాలి

దిల్లీ: ‘దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యల్ని యుద్ధ ప్రాతిపదికన చేపడతాం. ‘సమగ్ర ప్యాకేజీ’లో భాగంగా కనీసం 50 ప్రాంతాల్ని తీర్చిదిద్దుతాం. రాష్ట్రాలు తమ రాజధానుల్లో కానీ, ముఖ్యమైన పర్యాటక కేంద్రాల్లో కానీ ‘యూనిటీ మాల్‌’ను ఏర్పాటు చేసుకుని స్థానిక చేతివృత్తులు, హస్తకళా ఉత్పత్తుల్ని విక్రయించుకోవడానికి సహకరిస్తాం’ అని నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రకటించారు. నిర్దిష్టమైన నైపుణ్యాలు, వ్యవస్థాపక అభివృద్ధిని పెంపొందించుకుంటూ ‘దేఖో ఆప్నా దేశ్‌’ లక్ష్యాలను సాధిస్తామని చెప్పారు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడంపై దృష్టి పెడతామని, ముఖ్యమైన ప్రాంతాల విశేషాలు, నాణ్యమైన ఆహారం దొరికే చోట్లు, భద్రతకు సంబంధించిన వివరాలన్నింటినీ ఓ యాప్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. దేశ సరిహద్దు గ్రామాల్లో పర్యాటకాభివృద్ధికి... మౌలిక వసతులను, సౌకర్యాలను భారీ స్థాయిలో కల్పించనున్నట్లు వివరించారు.


వార్తా సంస్థలకు ఝలక్‌!

పన్ను మినహాయింపును తొలగించాలని ప్రతిపాదన

దిల్లీ: వార్తా సంస్థ(ఏజెన్సీ)లకు ఆదాయపు పన్ను మినహాయింపును తొలగించాలని కేంద్రం తాజా బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీనికి పార్లమెంట్‌లో ఆమోదం లభిస్తే వార్తా ఏజెన్సీలైన పీటీఐ, యూఎన్‌ఐ వంటి సంస్థలపై ప్రభావం పడుతుంది. వార్తా ఏజెన్సీలకు పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు ఇస్తున్న ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 10లో ఉన్న క్లాస్‌ 22-బీని సవరించాలని ఆర్థిక బిల్లు పేర్కొంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది.


స్వచ్ఛభారత్‌కు నిధుల హారం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమమైన స్వచ్ఛభారత్‌ మిషన్‌(అర్బన్‌)కు కేంద్ర బడ్జెట్‌లో గతంతో పోలిస్తే దాదాపు 150శాతం అధికంగా నిధులు కేటాయించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఈ కార్యక్రమానికి రూ.5 వేల కోట్లు ప్రతిపాదించారు. సవరించిన అంచనాల మేరకు 2022-23లో రూ.2 వేల కోట్లు ఇచ్చారు. స్వచ్ఛభారత్‌ మిషన్‌ (అర్బన్‌)తోపాటు సెంట్రల్‌ విస్టా రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును అమలుచేస్తున్న హౌసింగ్‌, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖకు  రూ.76,431.6 కోట్లు కేటాయించారు. మెట్రో ప్రాజెక్టుల కోసం రూ.19,518 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు.

స్మార్ట్‌ పట్టణాల మిషన్‌ కోసం రూ.8,800 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది కంటే ఇది రూ.800 కోట్లు అదనం


ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల  పెట్టుబడులు రూ.60,805 కోట్లు

దిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్‌ సంస్థల మొత్తం పెట్టుబడిని 15 శాతం పెంచి రూ.60,805 కోట్లు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనా రూ.52,878.08 కోట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. 2022-23 బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని రూ.51,470 కోట్లుగా పేర్కొన్నారు.

విద్యుత్‌ మంత్రిత్వ శాఖ మొత్తం వ్యయాలు రూ.20,761.32 కోట్లకు పెంచారు. 2022-23 బడ్జెట్‌లో రూ.16,074.74 కోట్లుగా ప్రతిపాదించగా, రూ.13,106.58 కోట్లకు కుదించారు.


రూ.10,000 కోట్లతో...  పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి

దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ఏడాదికి రూ.10,000 కోట్ల కేటాయింపుతో ‘పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిధుల్ని వినియోగించుకోవచ్చన్నారు. 50,000 నుంచి లక్ష జనాభా ఉన్న నగరాలను ద్వితీయ శ్రేణిగా, 20,000 నుంచి 50,000 జనాభా ఉన్న వాటిని తృతీయ శ్రేణి నగరాలుగా పరిగణిస్తారు.

* తడి, పొడి వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆర్థికమంత్రి చెప్పారు. ‘గోబర్ధన్‌’(గాల్వనైజింగ్‌ ఆర్గానిక్‌ బయో-ఆగ్రో రీసోర్సెస్‌ ధన్‌) పథకం కింద కొత్తగా 500 ‘వ్యర్థం నుంచి అర్థం(ధనం)’ ప్లాంట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

మ్యాన్‌హోల్‌ నుంచి మిషన్‌హోల్‌కు

పట్టణ ప్రణాళికలను అమలు చేయడంలో రాష్ట్రాలను, నగరాలను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అన్ని నగరాలు, పట్టణాల్లో మురుగు కాలువలు, సెప్టిక్‌ ట్యాంక్‌ల వ్యవస్థను మ్యాన్‌హోల్‌ నుంచి మిషన్‌హోల్‌కు పూర్తిస్థాయిలో మారుస్తామన్నారు.


మహిళా, శిశు సంక్షేమశాఖకు స్వల్పంగా పెరిగిన నిధులు

దిల్లీ: మహిళ, శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు స్వల్పంగా పెరిగింది. ఈ శాఖకు గత ఆర్థిక సంవత్సరం కంటే రూ.267 కోట్లు  అదనంగా కేటాయించారు. గత బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.25,172.28 కోట్లు ఇవ్వగా 2023-24కిగానూ రూ.25,448.75 కోట్లు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

మహిళలు, బాలికలకు సమ్మాన్‌ ధ్రువపత్రం

మహిళలు, బాలికల కోసం కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో ఓ కీలక ప్రకటన చేశారు. మహిళ లేదా బాలిక పేరుతో బ్యాంకుల్లో రూ.2 లక్షలకు మించకుండా డిపాజిట్‌ చేసేవారికి మహిళా సమ్మాన్‌ ధ్రువపత్రం జారీ చేస్తారు. రెండేళ్లపాటు నగదును డిపాజిట్‌గా ఉంచుకోవచ్చు. వీరికి 7.5శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తారు. పాక్షికంగా నగదును వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

* సాక్షం అంగన్‌వాడీ పోషణ్‌ 2.0 కింద రూ.20,554.31కోట్లు..శిశు సంక్షేమానికి సంబంధించిన మిషన్‌ వాత్సల్యకు రూ.1,472కోట్లు,  మహిళా సాధికారికత కోసం ఉద్దేశించిన ‘శక్తి’ మిషన్‌కు రూ.3,143 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ మిషన్‌కు 2022-23లో రూ.3,184కోట్లు కేటాయించడం గమనార్హం.


దుర్బల గిరిజన తెగల అభివృద్ధికి నూతన పథకం

దిల్లీ: దుర్బల గిరిజన తెగల ఆర్థిక, సామాజిక స్థితిగతులను మెరుగుపర్చేందుకు ఓ పథకాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ‘ప్రధాన మంత్రి దుర్బల ఆదిమ గిరిజన తెగల అభివృద్ధి పథకం (పీఎం-పీవీటీజీ)’ కింద వచ్చే మూడేళ్లలో రూ.15 వేల కోట్ల నిధులు కేటాయించనున్నట్లు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు.  ఈ బడ్జెట్‌లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు రూ.12,461.88 కోట్లు కేటాయించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 47.44 శాతం ఎక్కువ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు