సభలో మోదీ.. మోదీ.. నినాదాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం చేస్తుండగా.. పలుమార్లు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు.

Published : 02 Feb 2023 05:37 IST

ఆదాయపన్ను ఉపశమనంపై అధికారపక్షం హర్షం
రాహుల్‌ రాకతో జోడో జోడో అంటూ కాంగ్రెస్‌ ఎంపీల హోరు

దిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం చేస్తుండగా.. పలుమార్లు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆదాయపన్ను ఉపశమనం అంశాన్ని నిర్మలా సీతారామన్‌ ప్రకటించగానే.. భాజపా సభ్యులు మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తూ బల్లలు చరిచారు. అయితే నూతన పన్ను విధానంలోకి మారిన వారికే ఈ ఉపశమనమని మంత్రి ప్రకటించగానే విపక్షాల నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. బడ్జెట్‌లో మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచుతున్నట్లు నిర్మల వెల్లడించగానే.. అధికారపక్ష సభ్యుల నుంచి గట్టి మద్దతు లభించింది. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన కొద్ది నిమిషాలకు రాహుల్‌గాంధీ సభలోకి వచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీలు.. ‘జోడో, జోడో, భారత్‌ జోడో’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దేశంలో 50 ప్రాంతీయ విమానాశ్రయాలను నిర్మిస్తామని.. ఆర్థిక మంత్రి చెబుతుండగా.. ‘అదానీ, అదానీ’ అంటూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. అదానీ వ్యాపారాలపై అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్‌ నివేదిక ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం పూర్తి కాగానే.. ప్రధాని నరేంద్రమోదీ ఆమె వద్దకు వెళ్లి అభినందనలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు