బడ్జెట్‌ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి

1950లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా, జాన్‌ మథాయ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్‌ లీకైంది. దీంతో ఆయన పదవిని వీడాల్సి వచ్చింది.

Updated : 02 Feb 2023 07:13 IST

1950లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధానిగా, జాన్‌ మథాయ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో బడ్జెట్‌ లీకైంది. దీంతో ఆయన పదవిని వీడాల్సి వచ్చింది. వాస్తవానికి అప్పట్లో బడ్జెట్‌ను రాష్ట్రపతి భవన్‌లోనే ముద్రించారు. అందులోని కొన్ని భాగాలు ముందే బయటకు తెలిసిపోయాయి. దీనిపై వివాదం చెలరేగింది. జాన్‌ మథాయ్‌ కొంతమంది ఉన్నత వర్గాలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. బడ్జెట్‌ లీక్‌ అవడం అలా ఆర్థిక మంత్రి పదవికి ఎసరు పెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వం బడ్జెట్‌ ముద్రణను రాష్ట్రపతి భవన్‌ నుంచి మింట్‌ రోడ్డులోని ముద్రణాలయానికి మార్చింది. అయినా పరిస్థితులు బెరుకుబెరుకుగానే ఉండేవి. దీంతో 1980లో నార్త్‌బ్లాక్‌లోనే ప్రత్యేక ప్రింటింగ్‌ ప్రెస్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి అక్కడే కట్టుదిట్టంగా బడ్జెట్‌ ప్రతులను ముద్రించడం మొదలు పెట్టారు. అదే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. బడ్జెట్‌ తయారీ సందర్భంగా ఆర్థిక శాఖలోని కొందరు ఎంపికచేసిన అధికారులు, సిబ్బంది కొన్ని రోజులు క్వారంటైన్‌లాంటి పరిస్థితుల్లో ఉంటారు. పూర్తిగా నేలమాళిగకే పరిమితం అవుతారు. ఒక్క కేంద్ర ఆర్థిక మంత్రికి మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఉంటుంది. -ఈనాడు ప్రత్యేక విభాగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు