దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్!
దిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ అభియోగపత్రంలో మరికొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి.
ఎమ్మెల్సీ కవిత.. వైకాపా ఎంపీ మాగుంట పాత్రల ప్రస్తావన
ఈడీ అభియోగపత్రాన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం
ఈనాడు, దిల్లీ-హైదరాబాద్: దిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన అనుబంధ అభియోగపత్రంలో మరికొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి. దిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు తొలిసారి నేరుగా తెరపైకి వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఏపీలోని ఒంగోలు వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రమేయంపై మరికొన్ని వివరాలను కూడా ఈడీ ప్రస్తావించింది. జనవరి 6న 13,657 పేజీలతో దాఖలు చేసిన ఈ అనుబంధ ఛార్జిషీట్‌లో సమీర్ మహేంద్రు, విజయ్‌నాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్ అరోరాలను నిందితులుగా పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన తక్కళ్లపల్లి లుపిన్, అరుణ్‌పిళ్లై, బుచ్చిబాబు, గౌతం ముత్తా, అభిషేక్ బోయినపల్లి, చందన్‌రెడ్డి, నరసింహారావు, నరేందర్‌రెడ్డి, భాస్కర్ వెనిశెట్టి, వి.శ్రీనివాసరావు (కవిత అనుచరుడు), ఎస్.శ్రీనివాసరావు, అరవ గోపీకృష్ణ సహా 65 మందిని విచారించింది. ఈ క్రమంలో మొత్తం అభియోగపత్రంలో 428 పేజీలతో కూడిన ఫిర్యాదు నివేదికను ఈడీ సమర్పించింది. దీన్ని దిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు గురువారం పరిగణనలోకి తీసుకుని నిందితులకు నోటీసులు జారీ చేసింది. విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది.
* ఆప్‌లో కీలకమైన విజయ్‌నాయర్ దిల్లీ కొత్త మద్యం విధాన రూపకల్పనలో కీలకంగా వ్యవహరించినట్లు సమీర్ ఈడీకిచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. కొత్త పాలసీ అరవింద్ కేజ్రీవాల్ మానసపుత్రికగా విజయ్ అభివర్ణించినట్లు తెలిపారు. కేజ్రీవాల్‌తో సమావేశానికి తాను రెండుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని కూడా సమీర్ తెలిపాడు. తర్వాత ఆయనకు సన్నిహితుడైన ఒక సహాయకుడు తన ఐఫోన్ నుంచి ఫేస్‌టైమ్ కాలింగ్ యాప్ ద్వారా కేజ్రీవాల్‌తో తనను మాట్లాడించినట్లు సమీర్ వెల్లడించాడు. ఈ సందర్భంగా కేజ్రీవాల్.. ఆ సహాయకుడు ‘తన మనిషి’ అని, అతడిని విశ్వసించవచ్చని చెప్పినట్లు సమీర్ వాంగ్మూలమిచ్చాడు. వీటినిబట్టి.. మద్యం విధానంలో అక్రమాలపై దిల్లీ ప్రభుత్వపరంగా చర్యలు మందగించేలా ఆప్ నాయకులు ప్రయత్నించినట్లు భావించాల్సి వస్తోందని ఈడీ పేర్కొంది.
గోవాలో ఆప్ ప్రచారానికి ముడుపుల నిధులు
మద్యం కుంభకోణంలో వచ్చిన రూ.100 కోట్లలో కొంత మొత్తాన్ని ఆప్ గత ఏడాది గోవాలో ఎన్నికల ప్రచారానికి వినియోగించినట్లు ఈడీ గుర్తించింది. అక్కడ ఎన్నికల సర్వేలో పాల్గొన్న వాలంటీర్లకు రూ.70 లక్షల నగదు పంపిణీ చేసినట్లు తెలిపింది. ప్రచారంలో భాగంగా ప్రకటనలు, హోర్డింగులకు వెచ్చించిన సొమ్ములో అధికశాతం హవాలా మార్గంలో నగదు రూపంలో చెల్లించారని అభియోగం మోపింది.
ఇంకా మరికొన్ని..
సమీర్ మహేంద్రును విచారించడంతో కీలకాంశాలు బహిర్గతమైనట్లు ఈడీ పేర్కొంది. దిల్లీ మద్యం వ్యాపారంలో సౌత్‌గ్రూపు ఎలా ప్రవేశించిందనే విషయంతోపాటు కేజ్రీవాల్, కవిత, మాగుంట పాత్రల గురించి ప్రస్తావించింది.
* సౌత్‌గ్రూపులో వాస్తవ వాటాదారుల గురించి కచ్చితంగా చెప్పాలని అరుణ్‌పిళ్లైని సమీర్ అడిగారు. అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరును అరుణ్ వెల్లడించారు. ఆమె తరఫున మాత్రమే తాను ప్రతినిధిగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు.
* 2021 సెప్టెంబరులో దిల్లీ తాజ్‌మాన్‌సింగ్‌లో విందులో అందరూ కలుసుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు అరుణ్ తన ఫోన్ ద్వారా కవితను ఫేస్‌టైమ్‌లో సమీర్‌తో మాట్లాడించాడు. వ్యాపారంలో తమ భాగస్వాములైనందుకు సమీర్‌ను కవిత అభినందించారు. అలాగే కొన్ని ఫిర్యాదులతో ఇండోస్పిరిట్ దరఖాస్తు నిలిచిపోయిన సందర్భంలోనూ సమీర్‌తో కవిత ఫేస్‌టైమ్‌లో మాట్లాడారు.
* 2022 ప్రారంభంలో సమీర్ హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఆమెను కలిశారు. శరత్, అరుణ్‌పిళ్లై, అభిషేక్, కవిత భర్త అనిల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అరుణ్ తమ కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఆయనతో వ్యాపారం చేస్తే తనతో చేసినట్లేనని కవిత సమీర్‌కు తెలిపారు. ఈ వ్యాపార సంబంధాన్ని ఇతర రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు వెల్లడించారు.
* 2021 మే నెలలో అభిషేక్ బోయినపల్లిని బంజారాహిల్స్‌లోని కవిత ఇంట్లో బుచ్చిబాబు కలిశారు. అనంతరం అభిషేక్‌ను శరత్‌కు బుచ్చిబాబు పరిచయం చేశారు. వీరు ముగ్గురూ కలిసి శరత్‌కు చెందిన చార్టర్డ్ విమానంలో దిల్లీ వెళ్లి సమీర్‌ను కలిశారు.
* అరుణ్‌పిళ్లై సూచన మేరకు సమీర్ ఇండోస్పిరిట్ నుంచి ఆంధ్రప్రభ పబ్లికేషన్స్‌లోకి రూ.కోటి, ఇండియా అహెడ్‌లోకి రూ.70 లక్షలు బదిలీ చేశారు.
* శరత్‌రెడ్డి 5.. మాగుంట 2 జోన్లలో మద్యం వ్యాపారం నిర్వహించారు. ఇండోస్పిరిట్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.5 కోట్ల పెట్టుబడి పెట్టినా.. ఇండోస్పిరిట్ నుంచి లాభాల్లో భాగంగా రూ.17 కోట్లు ఆర్జించింది.
రూ.100 కోట్ల అడ్వాన్సు రాబట్టడంపై పథకం..
* మద్యం వ్యాపారంలో 12 శాతం ఆదాయం వస్తుందని, ఇందులో ఆరు శాతం అంటే రూ.210 కోట్ల ముడుపులు విజయ్‌నాయర్‌కు ఇవ్వాల్సి ఉంటుందని, దీనిలో భాగంగానే సుమారు రూ.100 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చి ఈ డబ్బును తమ ప్రధాన డిస్ట్రిబ్యూటర్లైన ఇండోస్పిరిట్, బ్రిండ్కో అండ్ మహాదేవ్‌ల నుంచి రికవరీ చేసుకోవాలని భావించారు. తర్వాత మిగతా రూ. 100 కోట్లు కూడా వసూలు చేసి విజయ్‌నాయర్, సౌత్‌గ్రూప్‌లు పంచుకోవాలని నిర్ణయానికి వచ్చారు. మరో మూడున్నర సంవత్సరాలు దిల్లీలో ఆప్ అధికారంలో ఉంటుంది కనుక అప్పటివరకు తమ మధ్య బంధం ఇలానే కొనసాగాలని ఇరువురూ నిర్ణయానికి వచ్చారు.
* 2022 ఏప్రిల్ 8వ తేదీన కవిత, అరుణ్‌పిళ్లైలు విజయ్‌నాయర్, దినేష్ అరోరాలను దిల్లీ ఒబెరాయ్ హోటల్లో కలిసి సౌత్‌గ్రూప్ చెల్లించిన ముడుపులను తిరిగి ఇవ్వడంపై చర్చించారు.
* 2022 అక్టోబరు 3న దినేష్ అరోరా దిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో రెండుసార్లు కవితను కలిశాడు. అప్పుడు అరుణ్‌పిళ్లై, విజయ్‌లు కూడా ఉన్నారు. అడ్వాన్సుగా చెల్లించిన రూ. 100 కోట్లు వసూలు చేసుకోవడంపై వీరు చర్చించారు.
ఈడీ కేసులు బూటకం: కేజ్రీవాల్
దిల్లీ: అవినీతిని అరికట్టడానికి ఈడీ కేసులు పెట్టడం లేదని.. ఎమ్మెల్యేల కొనుగోలుకు, ప్రభుత్వాల తారుమారుకు కేసులు పెడుతున్నారంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర దర్యాప్తు సంస్థపై ధ్వజమెత్తారు. దిల్లీ మద్యం కేసులో ఈడీ అనుబంధ ఛార్జిషీటు దాఖలు చేయడాన్ని కేజ్రీవాల్ గురువారం తోసిపుచ్చారు. ‘ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలో ఈడీ 5,000 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఎంతమందిని జైలుకు పంపగలిగారు? ఈడీ కేసులన్నీ బూటకమే’ అని మండిపడ్డారు.
భాజపా ఎంపీ ప్రతి విమర్శ
‘‘గోవా ఎన్నికల కోసమని కేజ్రీవాల్ అడగటంతోనే లిక్కర్ మాఫియా రూ.వంద కోట్లు చెల్లించింది. ఆప్ కమ్యూనికేషన్ ఇన్‌ఛార్జి విజయ్ నాయర్ ద్వారా ఈ వ్యవహారం నడిచింది. కేజ్రీవాల్ అసలు అవతారం ఈడీ చార్జిషీటులో బయటపడింది’’ అని భాజపా ఎంపీ మనోజ్ తివారీ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
GHMC: అగ్నిమాపక నిబంధనలు పాటించని మాల్స్, ఆసుపత్రులను సీజ్ చేస్తాం: జీహెచ్ఎంసీ
-
World News
US Man: అతడికి డబ్బు ఖర్చుపెట్టడమంటే అలర్జీ అట..!
-
Sports News
PBKS vs KKR: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. కోల్‌కతాపై పంజాబ్ విజయం..
-
World News
Pope Francis: నేను ఆరోగ్యంగా ఉన్నా: పోప్ ఫ్రాన్సిస్
-
Movies News
Social look: జాన్వీ పూసల డ్రెస్.. కావ్య హాట్ స్టిల్స్.. సన్నీ ఫొటో షూట్
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం