కొలీజియంలో కాదు.. సెర్చ్‌ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలి

ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి పార్లమెంటులో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది.

Published : 03 Feb 2023 04:46 IST

ఈ మేరకు సుప్రీంకోర్టుకు సూచించాం
పార్లమెంటులో వెల్లడించిన న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు

ఈనాడు, దిల్లీ: ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకాలు, పదోన్నతులకు సంబంధించి పార్లమెంటులో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. కొలీజియం వ్యవస్థ, మెమోరాండం ఆఫ్‌ ప్రొసీజర్‌ (ఎంవోపీ) సవరణ తదితర అంశాలపై కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాల్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పలు అంశాలను స్పృశించారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల పదవులకోసం అర్హులైన వారిని గుర్తించేందుకు అన్వేషణ, మదింపు (సెర్చ్‌ కం ఎవాల్యుయేషన్‌) కమిటీ ఏర్పాటుచేయాలని సుప్రీంకోర్టు కొలీజియానికి సూచించినట్లు పేర్కొన్నారు. సెర్చ్‌ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధి ఉండాలన్నామే తప్ప కొలీజియంలో కాదని మంత్రి తెలిపారు. ‘‘సుప్రీంకోర్టు ఇప్పటివరకు ఇచ్చిన వివిధ తీర్పులను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ఎంవోపీ ఖరారు చేయాల్సిన అవసరాన్ని చెబుతూ కేంద్ర ప్రభుత్వం జనవరి 6వ తేదీన సుప్రీంకోర్టుకు ఒక వర్తమానం పంపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధితో కూడిన సెర్చ్‌ కం ఎవాల్యుయేషన్‌ కమిటీ ఏర్పాటుచేయాలని సూచించింది. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కమిటీలో కేంద్ర ప్రభుత్వంతోపాటు, సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని పేర్కొంది. ఈ సెర్చ్‌ కమిటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాను తయారుచేస్తే కొలీజియంలు అందులోని పేర్లను సిఫార్సు చేయొచ్చని చెప్పాం’’ అని కిరణ్‌ రిజిజు వెల్లడించారు. ఆయన గురువారం రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు ముకుల్‌ వాస్నిక్‌ అడిగిన ప్రశ్నకు ఈమేరకు సమాధానం ఇచ్చారు.

సామాజిక వైవిధ్యం అవసరం

భాజపా ఎంపీ సుశీల్‌ మోదీ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. 2018 నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమితులైన 554 మందిలో జనరల్‌ కేటగిరీకి చెందిన వారే 430 మంది ఉన్నారని తెలిపారు. మిగిలిన వారిలో ఓబీసీలు 58 మంది, ఎస్సీలు 19 మంది, ఎస్టీలు ఆరుగురు, మైనారిటీలు 27 మంది, మహిళలు 84 మంది ఉన్నారని చెప్పారు. కులం, వర్గం ఆధారంగా న్యాయమూర్తుల నియామకాలు చేపట్టాలని రాజ్యాంగ నిబంధనల్లో ఎక్కడా లేదని.. ఉన్నత న్యాయవ్యవస్థలో సామాజిక వైవిధ్యం ఉండాలని ప్రభుత్వ పరంగా తాము న్యాయస్థానాలకు సూచిస్తూనే ఉన్నామని అన్నారు. మరో ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ 2011 జన గణన ప్రకారం పది లక్షలకు 21 మంది జడ్జీలే ఉన్నారని చెప్పారు. హైకోర్టు కొలీజియాలు కాలావధిని పాటించడం లేదని, 236 ఖాళీలకు పేర్లను సిఫార్సు చేయాల్సి ఉందని, ఇప్పటివరకు వీటికి సంబంధించిన ప్రతిపాదనలే పంపలేదని చెప్పారు. జనవరి 30కి 18 మంది పేర్లను తిరిగి పరిశీలించాలని సుప్రీంకోర్టుకి పంపామని, అందులో ఆరు పేర్లను కొలీజియం పునరుద్ఘాటించిందని అన్నారు. ఏడు కేసుల్లో మరింత సమాచారం కావాల్సిందిగా హైకోర్టు కొలీజియాలను కోరిందని, ఐదు పేర్లను మాత్రం సంబంధిత హైకోర్టులకు వెనక్కి పంపిందని చెప్పారు. ప్రస్తుతం హైకోర్టు కొలీజీయాలు పంపిన 142 ప్రతిపాదనలు తమ దగ్గర పెండింగులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.


ఉమ్మడి పౌర స్మృతి అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు

దిల్లీ: దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ) అమలుపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు గురువారం రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు. యూసీసీని పరిశీలించి, దాని అమలుకు సంబంధించిన అంశాలపై సిఫార్సు చేయాలని ప్రభుత్వం 21వ న్యాయ కమిషన్‌ను గతంలో కోరిందన్నారు. ఆ కమిషన్‌ గడువు 2018 ఆగస్టు 31తో ముగిసిందని వెల్లడించారు. మళ్లీ ఈ అంశాన్ని 22వ న్యాయ కమిషన్‌ ముందుకు తీసుకెళ్లాల్సి ఉందన్నారు. ప్రస్తుత న్యాయ కమిషన్‌ గడువు త్వరలో ముగియనుందని, దానిని మరో మూడేళ్లు పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని