ఐఐఎంల స్వావలంబనకు కేంద్రం సంకేతాలు!

దేశంలో ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లుగా ఉన్న ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లకు తాజా కేంద్ర బడ్జెటులో కేటాయింపులు సగానికి తగ్గాయి.

Published : 03 Feb 2023 05:24 IST

సగానికి తగ్గిన బడ్జెట్‌ కేటాయింపులు

దిల్లీ: దేశంలో ప్రముఖ బిజినెస్‌ స్కూళ్లుగా ఉన్న ది ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లకు తాజా కేంద్ర బడ్జెటులో కేటాయింపులు సగానికి తగ్గాయి. కొత్తగా స్థాపించిన ఐఐఎంలకు ఈ చర్య ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, ఇప్పటికే స్థిరపడిన విద్యాసంస్థలకు పెద్దగా సమస్యలు ఉండవని విద్యావేత్తలు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 20 ఐఐఎంలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు స్వయంసమృద్ధికి మరింత వినూత్నంగా ఆలోచించాలన్న సంకేతాలను కేంద్ర ప్రభుత్వం పంపి ఉండవచ్చని ఉదయ్‌పుర్‌ ఐఐఎం డైరెక్టర్‌ అశోక్‌ బెనర్జీ అభిప్రాయపడ్డారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్లో ఈ ఉన్నత విద్యాసంస్థలకు కేవలం రూ.300 కోట్లు కేటాయించారు. గత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల మేరకు రూ.608.23 కోట్లు ఇచ్చారు. అంటే.. కొత్త ఆర్థిక సంవత్సరంలో 50.67 శాతం నిధులు తగ్గుతున్నాయన్న మాట. తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఉన్నతవిద్యకు 8 శాతం నిధులు అధికంగా రూ.44,094 కోట్లు కేటాయించినప్పటికీ, ఐఐఎంల వాటా సగానికి తగ్గటం గమనార్హం. గతేడాది బడ్జెట్‌ (2022-23) అంచనాల ప్రకారం ఐఐఎంలకు రూ.653.92 కోట్లు కేటాయించారు. ‘‘పబ్లిక్‌ - ప్రయివేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని ప్రోత్సహించడం, పరిశ్రమల మద్దతుతో కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమాలు, ఇతర విరాళాల ద్వారా ఐఐఎంలు స్వావలంబన సాధించాలన్నది ఈ బడ్జెట్‌ కోతల ఉద్దేశం కావచ్చు’’ అని అశోక్‌ బెనర్జీ అన్నారు.

* రోహతక్‌ ఐఐఎం డైరెక్టర్‌ ధీరజ్‌శర్మ బడ్జెట్‌ కోతల గురించి మాట్లాడుతూ..‘‘ప్రభుత్వ గ్రాంటుల కోసం మేము ఎప్పుడూ ఎదురుచూడలేదు. విభిన్న శిక్షణ కార్యక్రమాలు, ట్యూషన్‌ ఫీజుల ద్వారా మేము మొత్తం ఆదాయ వనరులను సమకూర్చుకుంటాం. కాబట్టి, ఈ నిధుల కోత ప్రభావం మాపై ఉండదు. కొత్త ఐఐఎంలకు ప్రభుత్వ నిధులతో అవసరం ఉండవచ్చు’’ అన్నారు. గోవా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (జీఐఎం) డైరెక్టర్‌ అజిత్‌ పరులేకర్‌ కాస్త భిన్నంగా స్పందించారు. ‘‘ఆర్థికమంత్రి నేషనల్‌ డేటా గవర్నెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ గురించి మాట్లాడారు. రీసెర్చ్‌-ఇంటెన్సివ్‌ సంస్థలకు ఇది చాలా ప్రయోజకనకరం. బడ్జెట్‌ కేటాయింపులు తగ్గటం మటుకు అసంతృప్తి కలిగించింది’’ అన్నారు. దేశంలో నూతన విద్యావిధానం స్ఫూర్తిదాయకంగా అమలు చేసేందుకు పలు  ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలకు అదనంగా రూ.4,235.74 కోట్లు కేటాయించారని.. ఇందులో ఐఐఎంల వాటా ఎంత అనేది అనిశ్చితంగా ఉందని గురుగ్రాంకు చెందిన అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అశుతోష్‌ దాస్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు