సంక్షిప్త వార్తలు(15)

వ్యాధికారక సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ వల్ల స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు, ఇతర తీవ్ర వ్యాధులకు గురవుతారు. వారిలో మరణాల రేటూ ఎక్కువే.

Updated : 04 Feb 2023 05:38 IST

కొవిడ్‌.. పురుషులకు ఎక్కువ ప్రాణాంతకం

దిల్లీ: కొవిడ్‌ వ్యాధికారక సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ వల్ల స్త్రీలకన్నా పురుషులే ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు, ఇతర తీవ్ర వ్యాధులకు గురవుతారు. వారిలో మరణాల రేటూ ఎక్కువే. దీనికి కారణాలేమిటో అమెరికాలోని హ్యాకెన్‌ శాక్‌ మెరిడియన్‌ వైద్య పరిశోధన, నవీకరణ కేంద్ర పరిశోధకులు కనుగొన్నారు. వైరస్‌ నేరుగా పురుషుల ఊపిరితిత్తులపై దాడి చేస్తే, మహిళల్లో కొవ్వు కణజాలం మీద దాడి చేస్తుందని ఈ కేంద్రానికి చెందిన జ్యోతి నాగజ్యోతి చెప్పారు. మహిళల్లో వైరస్‌ కొవ్వు కణాల్లో దిగబడిపోవడం వల్ల ఊపిరితిత్తులకు పెద్దగా చేరలేకపోతోంది. అదే పురుషుల్లోనైతే వైరస్‌ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి, దానికి ప్రతిచర్యగా వాపును ప్రేరేపించే సైటోకైన్లు విడుదల అవుతాయి. దానివల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని మరణం సంభవిస్తోంది.


మతమార్పిడి కేసుల బదిలీలపై మీ స్పందన తెలపండి

కేంద్రానికి, 6 రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

దిల్లీ: బలవంత మత మార్పిళ్ల కట్టడికి వివిధ రాష్ట్రాలు తెచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఆయా హైకోర్టుల్లో దాఖలైన 21 కేసులను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందన తెలపాలని శుక్రవారం.. కేంద్రం, ఆరు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. డబ్బు, ఇతర ప్రలోభాలు చూపి మత మార్పిళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు దర్యాప్తు చేస్తోంది. అయితే మత మార్పిళ్లకు వ్యతిరేకంగా వివిధ రాష్ట్రాలు కూడా ఇటీవల కాలంలో చట్టాలు తెచ్చాయి. వీటికి వ్యతిరేకంగా వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కూడా ప్రధాన పిటిషన్‌తో కలిసి విచారించాలని కోరుతూ జమియత్‌ ఉలామా-ఎ-హింద్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సమాధానం చెప్పాలని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్రంతో పాటు.. గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల స్పందన కోరింది.


విద్వేష ప్రసంగాలు లేకుండా చూడండి

హిందూ సంస్థ సమావేశంపై మహారాష్ట్రకు సుప్రీం సూచన

దిల్లీ: ముంబయిలో ఈ నెల 5న సమావేశం నిర్వహించుకోవడానికి హిందూ జన్‌ ఆక్రోష్‌ మోర్చాకు అనుమతి లభిస్తే... విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. సమావేశాన్ని వీడియోలో చిత్రీకరించాలని.. ప్రజా జీవితానికి ఆటంకం కలిగి, నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ)లోని 151 సెక్షన్‌ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తే ఆ మేరకు సంబంధిత పోలీసులు అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ముంబయిలో జనవరి 29న నిర్వహించిన ర్యాలీలో ఒక మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని, ఈ నెల 5న జరిగే సమావేశంలో అలాంటివి పునరావృతం కాకుండా చూడాలంటూ షహీన్‌ అబ్దుల్లా అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ సూచన చేసింది.


నళినీ చిదంబరం సహా పలువురి ఆస్తుల జప్తు

శారదా కేసులో ఈడీ చర్యలు

దిల్లీ: శారదా కుంభకోణానికి సంబంధించి నగదు అక్రమ చలామణి కేసులో.. కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం భార్య నళినీ చిదంబరం సహా పలువురు ‘లబ్ధిదారుల’కు చెందిన రూ.6.30 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. జప్తు చేసిన ఆస్తుల్లో.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్‌ బిశ్వాస్‌లకు చెందినవి ఉన్నట్లు ఈడీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే అస్సాం మాజీ మంత్రి, దివంగత అంజన్‌ దత్తా కంపెనీకి చెందిన ఆస్తులు కూడా ఉన్నట్లు వెల్లడించింది. జప్తు చేసిన వాటిలో రూ.3 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.3.30 కోట్ల చరాస్తులు ఉన్నట్లు తెలిపింది. ఈ ఆస్తులన్నీ శారదా గ్రూప్‌తో పాటు, అక్రమాల్లో లబ్ధి పొందినవారికి చెందినవేనని పేర్కొంది. శారదా కేసులో ఈడీ ఇంతవరకు రూ.600 కోట్ల మేర ఆస్తులను జప్తు చేసింది.


286 శాతం పెరిగిన 71 మంది ఎంపీల ఆస్తులు

దిల్లీ: లోక్‌సభకు 2009 నుంచి 2019 మధ్య తిరిగి ఎన్నికైన 71 మంది ఎంపీల ఆస్తులు సగటున ఏకంగా 286 శాతం పెరిగాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది. వీరిలో భాజపాకు చెందిన కర్ణాటకలోని బీజాపుర్‌ లోక్‌సభ సభ్యుడు రమేశ్‌ చందప్ప జిగాజినగి ఆస్తుల వృద్ధి అందరి కంటే ఎక్కువని తెలిపింది. ఆయనకు 2009లో రూ.1.18 కోట్ల ఆస్తులు ఉండగా అవి 2014 నాటికి రూ.8.94 కోట్లకు, 2019 నాటికి రూ.50.41 కోట్లకు చేరుకున్నాయని ఈ పెరుగుదల 4,189 శాతమని వివరించింది. ఆరుసార్లు వరుసగా ఎంపీగా గెలిచిన ఆయన 2016 జులై నుంచి 2019 మే వరకూ కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. భాజపాకే చెందిన మరో ఎంపీ(బెంగళూరు సెంట్రల్‌) పి.సి.మోహన్‌ రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తులు వరుసగా 2009లో రూ.5.37 కోట్లు, 2019లో రూ.75.55 కోట్లుగా ఉన్నాయి. ఈ పెంపుదల 1,306 శాతం. మూడో స్థానంలోనూ కమలదళానికే చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ ఎంపీ వరుణ్‌గాంధీ నిలిచారు. ఆయన ఆస్తులు 2009-2019 మధ్య రూ.4.92 కోట్ల నుంచి రూ.60.32 కోట్లకు చేరాయి. తరువాత స్థానాల్లో సుప్రియా సదానంద్‌ సూలే (ఎన్‌సీపీ) రూ.51.33 కోట్ల నుంచి రూ.140.88 కోట్లు; పినాకి మిశ్ర (బిజద) రూ.29.69 కోట్ల నుంచి రూ.117.47 కోట్లు ఉన్నారు.


ఓటర్ల చైతన్యానికి ‘మేం భారతీయులం..’ పాట

దిల్లీ: ప్రస్తుత ఏడాదిలో పలు రాష్ట్రాల శాసనసభలకు, వచ్చే ఏడాది లోక్‌సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటింగ్‌ శాతం పెరుగుదలకు తీసుకోవలసిన చర్యలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) దృష్టి సారించింది. ఇందుకోసం వినూత్నమైన వ్యూహాలను అమలు పరుస్తోంది. ఇందులో భాగంగా సుభాష్‌ ఘాయ్‌ ఫౌండేషన్‌తో కలిసి ‘మేం భారతీయులం..మేం భారత ఓటర్లం’ (మై భారత్‌ హూ, హమ్‌ భారత్‌ కే మత్‌దాత హై) అనే పాటను రూపొందించింది. ఇందులో దేశంలోని విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు కనిపిస్తూ.. తమ నియోజకవర్గ ప్రయోజనాల కోసం ఓటుహక్కు వినియోగించుకోవాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తారు. ఇప్పటికే ఈ పాట విడుదలైందని ఈసీ శుక్రవారం వెల్లడించింది.


భాజపా ఎంపీలకు బడ్జెట్‌ ముఖ్యాంశాల బోధన

దిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 2023-24 యూనియన్‌ బడ్జెట్‌ ముఖ్యాంశాలను శుక్రవారం భాజపా ఎంపీలకు విడమరచి చెప్పారు. మధ్యతరగతి, మహిళలు, వృద్ధులు.. ఇలా అన్ని వర్గాలకు బడ్జెట్‌ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. ఈ చర్చలో ఆదాయపన్ను కొత్త, పాత విధానాలపై ఎంపీల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఈ అంశాలన్నీ మంత్రి కూలంకషంగా చెప్పారు. నియోజకవర్గాల్లోని ప్రజలకు ఆదాయపన్ను విధానాలతోపాటు బడ్జెట్‌ ప్రయోజనాలను వివరించి చెప్పాలని ఆమె కోరారు.


రాజస్థాన్‌ మంత్రిపై అపహరణ కేసు

జైపుర్‌: రాజస్థాన్‌ పంచాయతీ శాఖ సహాయ మంత్రి రాజేంద్ర గుఢాపై అపహరణ కేసు నమోదైంది. గత నెల 27న దుర్గా సింగ్‌ అనే వార్డు సభ్యుణ్ని అపహరించి ఖాళీ చెక్కుపై సంతకం చేయించుకున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ తనను తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని రాజేంద్ర ఆరోపించారు. 2018 ఎన్నికల్లో బీఎస్పీ తరఫున గెలిచిన రాజేంద్ర అనంతరం కాంగ్రెస్‌లో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు.


ఎన్‌ఐఏకు తాలిబన్‌  బెదిరింపుల మెయిల్‌

ముంబయి: తాలిబన్‌తో సంబంధాలున్న వ్యక్తి ముంబయిపై దాడి చేయబోతున్నాడంటూ తమకు ఓ మెయిల్‌ వచ్చిందని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) శుక్రవారం వెల్లడించింది. దీంతో నగర పోలీసు విభాగం, తీవ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్‌) అప్రమత్తమైంది. వచ్చిన మెయిల్‌ పాకిస్థాన్‌ ఐపీ చిరునామాను చూపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత నెలలోనూ ఈ దర్యాప్తు సంస్థకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయని.. ఇది ఎవరో ఆకతాయి పనేనని అనుమానిస్తున్నారు.


152.7 లక్షల టన్నుల ఎరువులు దిగుమతి

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు వరకు భారత్‌ 152.7 లక్షల టన్నుల యూరియా, ఫాస్పరస్‌, పొటాష్‌లను దిగుమతి చేసుకుందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్‌ ఖుబా తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అదే సమయంలో దేశీయంగా 362.73 లక్షల టన్నుల ఎరువులు ఉత్పత్తి చేశామని చెప్పారు. మరో ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. సూపర్‌ ఫాస్పేట్‌ ఎరువు నాణ్యతను పెంచడంతోపాటు డీఏపీకి ప్రత్యామ్నాయంగా రైతులు దీన్ని వినియోగించేలా పోత్సహించేందుకు ఫెర్టిలైజర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలో ఓ కార్య బృందాన్ని నియమించినట్లు చెప్పారు.

గత ఐదేళ్లలో రూ.1.93 లక్షల కోట్ల విలువైన సైనిక పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ వెల్లడించారు. ఇందులో హెలికాప్టర్లు, రాడార్లు, రాకెట్లు, రైఫిల్స్‌, మిసైల్స్‌, మందుగుండు సామగ్రి ఉన్నాయని పేర్కొన్నారు.

రాజకీయ పార్టీల ఆర్థిక కార్యకలాపాలను క్రమబద్ధీకరించే ప్రతిపాదనేదీ లేదని లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తాం

త్రిపురలో వామపక్ష కూటమి హామీ

అగర్తలా: త్రిపుర శాసనసభ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్న సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి పలు ప్రజాకర్షక హామీలను కురిపించింది. రాష్ట్రంలో తమకు అధికారం కట్టబెడితే ప్రభుత్వోద్యోగుల పాత పింఛను పథకాన్ని(ఓపీఎస్‌) పునరుద్ధరిస్తామని శుక్రవారం విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలో వెల్లడించింది. ఇంకా వారికి ఏడాదికి రెండు కరవు భత్యం పెంపులను అమలు చేస్తామంది.


చిత్ర వార్త


లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి

దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం

దిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలను 2024లో ఒకేసారి నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేంద్రానికి, ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. ఇందులో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలనూ 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలతో కలిపి నిర్వహించాలని పిటిషనర్‌ కోరారు. ఇలా చేయడం వలన ప్రజాధనం ఆదా కావడంతో పాటు, భద్రత, పరిపాలనపరమైన అంశాలపై ఒత్తిడి కూడా తగ్గుతుందని పిల్‌లో పేర్కొన్నారు.


అభివృద్ధిలో పీడిత తాడిత వర్గాలకే ప్రాధాన్యం
స్పష్టం చేసిన ప్రధాని నరేంద్రమోదీ

గువాహటి: ప్రభుత్వ అభివృద్ధి పథంలో పీడిత తాడిత, వెనుకబడిన వర్గాలవారికే ప్రాధాన్యం ఇస్తున్నామని  ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అస్సాంలోని బార్‌పేట జిల్లాలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో  దృశ్యమాధ్యమ విధానం ద్వారా ప్రధాని ప్రసంగించారు. మహిళల పొదుపు మొత్తాలకు అధిక వడ్డీ వచ్చేలా మహిళా సమ్మాన్‌ పొదుపు పత్రాలను తీసుకొచ్చామన్నారు. అదే విధంగా ఈశాన్య రాష్ట్రాల మహిళల అభివృద్ధికి ఉపకరించే ఎన్నో నిర్ణయాలను ఈ ఏడాది బడ్జెట్‌లో పొందుపరచామన్నారు. దశాబ్దాలుగా అనుసంధానతకు, అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిన ఈశాన్య రాష్ట్రాలపై  గత ఎనిమిదేళ్లుగా ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు గుర్తుచేశారు. స్థానిక ఉత్పత్తులకు, కళాకారులకు తాము అందిస్తున్న తోడ్పాటు గురించి వివరించారు.


జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను సవరించండి
గ్రీన్‌పీస్‌ ఇండియా డిమాండ్‌

దిల్లీ: మానవ ఆరోగ్యంపై వాయు కాలుష్యం చూపే ప్రతికూల ప్రభావాలకు ప్రస్తుత జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలు అద్దం పట్టడం లేదని గ్రీన్‌పీస్‌ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. సంబంధిత ప్రమాణాలను వెంటనే సవరించాలని డిమాండ్‌ చేస్తూ ఆ స్వచ్ఛంద సంస్థకు చెందిన కార్యకర్తలు దిల్లీలోని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన ప్రమాణాలతో పోలిస్తే భారత ప్రమాణాలు.. గాలిలో కాలుష్య కారకాలు 8 రెట్లు ఎక్కువ ఉండటాన్నీ సాధారణ పరిస్థితిగానే పరిగణిస్తున్నాయని వారు పేర్కొన్నారు.


విదేశీ జైళ్లలో 8,343 భారతీయ ఖైదీలు: కేంద్రం

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వివిధ కారాగారాల్లో 8,343 మంది భారతీయ ఖైదీలు మగ్గుతున్నారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. ఇందులో అత్యధికంగా 1,926 మంది యూఏఈ జైళ్లలో ఉన్నారని.. తర్వాత స్థానం నేపాల్‌ (1362)దని చెప్పారు.

* దేశవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్‌ కోర్టుల్లో 20 ఏళ్లుగా 6.74 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. హైకోర్టుల్లోనూ రెండు దశాబ్దాలుగా 2,94,547 కేసులు విచారణ కొనసాగుతూనే ఉందని తెలిపారు.

* గత ఐదేళ్లలో రూ.1.93 లక్షల కోట్ల విలువైన సైనిక పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్‌ భట్‌ వెల్లడించారు. ఇందులో హెలికాప్టర్లు, రాడార్లు, రాకెట్లు, రైఫిల్స్‌, మిసైల్స్‌, మందుగుండు సామగ్రి ఉన్నాయని పేర్కొన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని