ఆ అయిదుగురి నియామకాలకు త్వరలో ఆమోదం

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జీల నియామకానికి గత డిసెంబరులో కొలీజియం చేసిన అయిదు సిఫార్సులకు త్వరలో ఆమోదముద్ర వేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Published : 04 Feb 2023 04:07 IST

కొలీజియం సిఫార్సు చేసిన జడ్జీల పేర్లపై కేంద్రం తరఫున సుప్రీంకోర్టుకు తెలిపిన ఏజీ
హైకోర్టు నియామకాల్లో జాప్యంపై ధర్మాసనం అసహనం

దిల్లీ: దేశ సర్వోన్నత న్యాయస్థానంలో జడ్జీల నియామకానికి గత డిసెంబరులో కొలీజియం చేసిన అయిదు సిఫార్సులకు త్వరలో ఆమోదముద్ర వేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌ ధర్మాసనానికి అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌.వెంకటరమణి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. రెండు పిటిషన్లపై విచారణ సందర్భంగా.. హైకోర్టు జడ్జీల పదోన్నతుల విషయంలో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. ‘‘ఇది చాలా తీవ్రమైన విషయం. మరీ అసౌకర్యం కలిగించే నిర్ణయం తీసుకునేలా మమ్మల్ని ప్రోత్సహించవద్దు’’ అని ఏజీకి స్పష్టం చేసింది. అయిదుగురు హైకోర్టు జడ్జీల పేర్లను డిసెంబరు 13న కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, పట్నా హైకోర్టు సీజే జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, మణిపుర్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, పట్నా హైకోర్టు జడ్జి జస్టిస్‌ ఎహసానుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల పేర్లు కొలీజియం సిఫార్సుల్లో ఉన్నాయి. ఈ జాబితా కేంద్రం వద్ద పెండింగులో ఉండగానే.. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని కొలీజియం జనవరి 31న మరో రెండు పేర్లను పదోన్నతుల నిమిత్తం కేంద్రానికి పంపింది. అలహాబాద్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌, గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ అరవింద్‌కుమార్‌ల పేర్లు ఈ రెండో జాబితాలో ఉన్నాయి. ప్రధాన న్యాయమూర్తితోపాటు మొత్తం 34 మంది జడ్జీల నియామక సామర్థ్యం ఉన్న సుప్రీంకోర్టులో ప్రస్తుతం 27 మంది న్యాయమూర్తులు ఉన్నారు.

కొలీజియం సిఫార్సుల ఆమోదంలో కేంద్రం చేస్తున్న జాప్యంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ‘‘డిసెంబరులో అయిదు పేర్లు సిఫార్సు చేశాం. ఫిబ్రవరి నెల వచ్చేసింది. ఆ అయిదుగురికీ నియామక ఉత్తర్వులు పంపుతున్నట్లు మేము రికార్డు చేయవచ్చా?’’ అని ఏజీని ప్రశ్నించింది. ‘‘నాకు ఉన్న సమాచారం మేరకు.. ఆదివారం నాటికల్లా ఉత్తర్వులు జారీ కావచ్చు. దయచేసి, రికార్డు చేయవద్దు’’ అని ఏజీ బదులిచ్చారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన అంశాన్ని మటుకు కొంతకాలం వాయిదా వేస్తున్నట్లు వెంకటరమణి చెప్పగా.. ఈ జాప్యం తమకు ఇబ్బందికరంగా ఉందని ధర్మాసనం పేర్కొంది. ‘‘ఆ ఉత్తర్వులు జారీ కాకపోతే మమ్మల్ని ఏం చేయమంటారు? మా సిఫార్సులను మేము ఉపసంహరించుకోవాలని మీరు కోరుకొంటున్నారా? హైకోర్టులో పనిచేసేందుకు ఫలానావాళ్లు తగిన వ్యక్తులని కొలీజియం భావించాక, ప్రభుత్వం ఆ విషయాన్ని జాప్యం చేస్తూపోతే ఎలా! కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకునే అనివార్య పరిస్థితిని మీరు కల్పిస్తున్నారు’’ అని న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు.  ఇందులో థర్డ్‌ పార్టీ జోక్యాన్ని తాము సహించబోమని చెప్పారు.‘‘ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు జరిగే బదిలీల్లో జాప్యం ప్రసక్తే ఉండకూడదు. ఇందులో ప్రభుత్వ పాత్ర స్వల్పమే. జాప్యం కొనసాగితే పరిపాలన, న్యాయవ్యవస్థల పరంగా అవాంఛనీయ చర్యలకు దారి తీయవచ్చు. ఓ హైకోర్టు సీజేగా ఒకరి పేరును మేము సిఫార్సు చేశాం. ఆ జడ్జి 19 రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ జాప్యంతో ఆయన సీజేగా నియామకం పొందకుండానే రిటైర్డ్‌ కావాలని మీరు కోరుకొంటున్నారా?’’ అని ధర్మాసనం నిలదీసింది. ఈ విషయం తనకు తెలుసని, తగిన చర్య తీసుకునేలా చూస్తామని ఏజీ చెప్పారు. కొన్ని పేర్లు రాత్రికి రాత్రి ఆమోదిస్తారు, మరికొన్ని జాప్యం చేస్తారు.. ఒక పద్ధతంటూ లేదంటూ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పిటిషనరు తరఫున న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వాదించారు. తదుపరి విచారణను ధర్మాసనం 13వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని