ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌ ప్రతిపాదన లేదు

జాతీయస్థాయిలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ స్పష్టంచేశారు.

Published : 04 Feb 2023 07:38 IST

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌

ఈనాడు, దిల్లీ: జాతీయస్థాయిలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ స్పష్టంచేశారు. ఆయన శుక్రవారం రాజ్యసభలో కవితా పాటీదార్‌ అనే సభ్యురాలు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రత్యేక బడ్జెట్‌ లేకపోయినా ఆర్థికరంగానికి వెన్నెముకగా నిలుస్తున్న ఈ రంగానికి కేంద్రం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. వ్యవసాయ రంగానికి 2013-14లో రూ.27,662 కోట్లున్న కేటాయింపులను 2022-23 నాటికి రూ.1,32,513 కోట్లకు పెంచినట్లు వివరించారు. భూగర్భ జలాల వినియోగం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ నమూనా బిల్లును అన్ని రాష్ట్రాలకు పంపిణీ చేసిందని, ఇప్పటివరకు దాన్ని 21 రాష్ట్రాలు స్వీకరించి, అమలులో పెట్టాయని వెల్లడించారు.  తెలంగాణలో యేటా 21.27 టీఎంసీల నీరు భూగర్భంలోకి ఇంకుతుండగా, అందులో 19.25 టీఎంసీల నీరు తోడుకోవడానికి అందుబాటులో ఉంటోందని తెలిపారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో యేటా సాగునీటి అవసరాల కోసం 7.257 టీఎంసీలు, పరిశ్రమలకు 0.154 టీఎంసీలు, గృహావసరాలకు 0.596 టీఎంసీలు కలిపి 8 టీఎంసీల నీటిని తోడుకుంటున్నట్లు తెలిపారు. మొత్తం భూగర్భ జలాల్లో ఇది 41.6% అని వెల్లడించారు.

ఏపీలో 1,82,375 డూప్లికేట్‌ రేషన్‌కార్డులు, తెలంగాణలో 77,874

దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 1నాటికి 55 లక్షల డూప్లికేట్‌ రేషన్‌కార్డులు ఉన్నాయని, వీటిలో ఏపీలో 1,82,375, తెలంగాణలో 77,874 ఉన్నట్లు తేలిందని కేంద్ర సహాయమంత్రి సాద్వీ నిరంజన్‌ జ్యోతి రాజ్యసభలో శుక్రవారం తెలిపారు. రాష్ట్రాలు నిరంతరం సమీక్షించి, డూప్లికేట్‌ కార్డులను రద్దుచేసి, అర్హులకు కొత్తగా మంజూరు చేస్తాయన్నారు. ఏపీలో 2.68 కోట్లు, తెలంగాణలో 1.91 కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులు ఉన్నట్లు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని