సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌

తెలుగు బిడ్డ, ప్రస్తుతం మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌తో సహా అయిదుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు/ సీనియర్‌ న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్‌ జారీచేసింది.

Published : 05 Feb 2023 05:48 IST

అత్యున్నత న్యాయస్థానంలో మరో తెలుగు జడ్జి
మొత్తం ఐదుగురి పేర్లతో కేంద్రం నోటిఫికేషన్‌

ఈనాడు, దిల్లీ: తెలుగు బిడ్డ, ప్రస్తుతం మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌ కుమార్‌తో సహా అయిదుగురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు/ సీనియర్‌ న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, అదే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మనోజ్‌మిశ్ర ఉన్నారు. వీరి నియామకంతో సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య 32కి చేరనుంది. ఇక రెండే ఖాళీలు ఉంటాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం గత డిసెంబరు 13న ఈ అయిదుగురి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. గతనెల 31న మరో ఇద్దరి పేర్లను సిఫార్సు చేస్తూ- తొలి అయిదుగురి నియామక ప్రకటనను ముందుగా విడుదల చేయాల్సిన విషయాన్ని గుర్తుచేసింది. శుక్రవారం ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓక్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ ఐదుగురి నియామకానికి కేంద్రం ఇప్పటివరకూ ఆమోదముద్ర వేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన నేపథ్యంలో నోటిఫికేషన్‌ వెలువడింది. వీరంతా ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు ప్రమాణం స్వీకరిస్తారు.

ధర్మాసనంపై రెండో తెలుగు వ్యక్తి..

ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేస్తున్న జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహ తర్వాత సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనంపై కూర్చోబోతున్న రెండో తెలుగు వ్యక్తి జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్‌. సుదీర్ఘకాలం ఏపీ అడ్వకేట్‌ జనరల్‌గా సేవలందించిన ఆయన తండ్రి పి.రామచంద్రారెడ్డిది చిత్తూరు జిల్లా. జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ 1963 ఆగస్టు 14న హైదరాబాద్‌లో జన్మించారు. అక్కడే విద్యాభ్యాసం కొనసాగించారు. హైదరాబాద్‌ నిజాం కాలేజీలో డిగ్రీ, దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదివారు. 1988లో న్యాయవాదిగా వృత్తి జీవితం ప్రారంభించారు. 2000 నుంచి 2003 వరకు ఉమ్మడి ఏపీ హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. 2008 ఆగస్టు 8న అక్కడే అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 20న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 అక్టోబర్‌ 14న పంజాబ్‌-హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021 ఫిబ్రవరి 12న మణిపుర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

..ఆ లోటు భర్తీ అవుతుంది

జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ నేరుగా బార్‌కౌన్సిల్‌ నుంచి ఎంపికయ్యారు. 2022 జనవరి 1న జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, ఆగస్టు 26న సీజేఐ హోదాలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పదవీ విరమణ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో ఏపీ, తెలంగాణ హైకోర్టు బార్‌ల నుంచి ప్రాతినిధ్యం లేకపోయింది. ఆ లోటు ఇప్పుడు జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ ద్వారా భర్తీకానుంది. ప్రస్తుతం న్యాయమూర్తిగా నియమితులైన అయిదుగురిలో ఒకరుగా ఉన్న పట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా స్వల్పకాలం పాటు ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందించారు. కొత్త న్యాయమూర్తులు సోమవారం ప్రమాణం స్వీకరించనున్నారు. జనవరి 31న కొలీజియం పంపిన ఇద్దరు న్యాయమూర్తుల నియామకానికీ కేంద్రం ఆమోదముద్ర వేస్తే సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య పూర్తిస్థాయికి (34)కి చేరుతుంది. ఆరుగురు న్యాయమూర్తులు ఈ ఏడాది మే నుంచి జులై మధ్య పదవీ విరమణ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని