సంక్షిప్త వార్తలు (9)

వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగాన్ని ఏకంగా 90 శాతం వరకూ తగ్గించే వినూత్న హరిత టెక్నాలజీని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Updated : 05 Feb 2023 06:31 IST

వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగానికి కళ్లెం
కొత్త సాంకేతికత అభివృద్ధి చేసిన భారత శాస్త్రవేత్తలు

చండీగఢ్‌: వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగాన్ని ఏకంగా 90 శాతం వరకూ తగ్గించే వినూత్న హరిత టెక్నాలజీని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనికి ‘ఎయిర్‌ నానో బబుల్‌’ అని పేరు పెట్టారు. వస్త్ర పరిశ్రమలో నీటి వినియోగం చాలా ఎక్కువ. అద్దకం, బ్లీచింగ్‌ సహా పలు దశల్లో ఒక కిలో నూలు వస్త్రం ప్రాసెస్‌ చేయడానికి 200-250 లీటర్ల నీరు అవసరం. దీనివల్ల కలుషిత నీటి సమస్య కూడా ఉత్పన్నమవుతోంది. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ సమస్యపై రోపార్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. వీరు గాలి, ఓజోన్‌తో కూడిన నానో బబుల్స్‌ ఆధారంగా ఈ టెక్నాలజీని సిద్ధం చేశారు. వెంట్రుక కన్నా పదివేల రెట్లు సన్నగా ఉండే ఈ సూక్ష్మ బుడగలకు హైడ్రోఫోబిక్‌ తత్వం ఉంటుంది. అందువల్ల అవి నీటి కన్నా మెరుగ్గా వస్త్రంతో చర్య జరుపుతాయి. రసాయనాలు, రంగులను వస్త్రం అంతటా వ్యాప్తి చేయిస్తాయి. మిగులు రంగులను సమర్థంగా తొలగిస్తాయి. అవి నీటిలో క్షీణించిపోయేలా చేస్తాయి. మొత్తంమీద 90-95 శాతం నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి. ప్రాసెసింగ్‌ రసాయనానికి వాహకంగా ఈ బబుల్స్‌ పనిచేస్తాయి. అదనపు కెమికల్స్‌ అవసరాన్ని తప్పిస్తాయి. నానో బబుల్‌ యంత్రంతో ప్రాసెస్‌ చేశాక నీటిని తిరిగి వినియోగించొచ్చు.


అర్ధరాత్రి ఊరేగింపులు, పెళ్లిళ్లలో లెహంగాలు నిషేధం 

గ్రామ ప్రజలు వివాహాల్లో అనవసర ఖర్చులు చేయకుండా పంజాబ్‌లోని ఓ గ్రామ పంచాయతీ కమిటీ వినూత్న తీర్మానాన్ని ఆమోదించింది. వివాహాల్లో యువతులు లెహంగాలు ధరించవద్దని, అర్ధరాత్రి దాటాక పెళ్లి బారాత్‌ నిర్వహించవద్దని కపుర్తలా జిల్లాలోని భదాస్‌ గ్రామ పంచాయతీ కట్టుబాట్లు విధించింది. గ్రామంలో ఎవరి పెళ్లి జరిగినా కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలని పంచాయతీ పెద్దలు చెబుతున్నారు. యువతులు ఖరీదైన లెహంగాలు కాకుండా చుడీదార్‌లనే ధరించాలని కట్టడి పెట్టారు. వివాహం తర్వాత రోజు పెళ్లికొడుకు కుటుంబం మాత్రమే అమ్మాయివాళ్ల ఇంటికి వెళ్లాలి. ఈ నిబంధనల్లో వేటిని ఉల్లఘించినా రూ.11 వేల జరిమానా కట్టాలి. గురుద్వారాల పవిత్రత, గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశం కూడా ఇందులో ఉన్నట్లు పంచాయతీ పెద్దలు వివరించారు. గ్రామంలో ఏర్పాటుచేసే లంగర్‌ (సామూహిక భోజనాలు) నుంచి.. ఆహారాన్ని టిఫిన్‌ బాక్సుల్లో, కవర్లలో ఇంటికి తీసుకువెళితే రూ.10 వేల జరిమానా విధించాలని కూడా నిర్ణయించారు. దోషిగా తేలినవారు గురుద్వారాలో రెండు నెలలపాటు సేవ చేయాలని.. గ్రామ అధ్యక్షుడు, కమిటీ సభ్యులు ఇలాంటి పనులు చేస్తే జరిమానాలు, శిక్షలు మరింత ఎక్కువగా ఉండాలని తీర్మానించారు.


పన్ను కట్టండి.. రూ.10 లక్షల బీమా పొందండి..

గ్రామ పంచాయతీ తీర్మానం

లాతూర్‌: పన్నులు పూర్తిగా చెల్లించిన గ్రామస్థులకు రూ.10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం అందించేందుకు ఓ గ్రామ పంచాయతీ ముందుకు వచ్చింది. మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా పంచిన్‌చోలి గ్రామ పంచాయతీ శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో ఈ మేరకు తీర్మానం చేసింది. సర్పంచి గీతాంజలి హనుమంతి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మాజీ సర్పంచి శ్రీకాంత్‌ సూలంఖీ ప్రతిపాదన పెట్టగా.. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు.  


ముంబయిలో మళ్లీ ఉగ్రదాడుల బెదిరింపులు

ముంబయి: ముంబయిలో 2008 నవంబరు 26 తరహా ఉగ్రదాడులకు పాల్పడతామని గుర్తుతెలియని దుండగులు ట్విటర్‌ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ట్వీట్‌లో గుజరాత్‌లోని ఓ వ్యక్తి పేరు, చిరునామా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శుక్రవారం కూడా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎన్‌ఐఏకు మెయిల్‌ చేశాడు. తాను తాలిబన్‌ అని చెప్పుకొంటూ.. ముంబయిలో దాడులకు పాల్పడతానని బెదిరించాడు.


యూత్‌ లీడర్‌షిప్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘బడ్జెట్‌ డైలాగ్స్‌ 2023’

దిల్లీ: ‘బడ్జెట్‌ డైలాగ్స్‌ 2023’ పేరుతో నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రముఖ సంస్థ ‘ఫిట్‌జీ’ ఛైర్మన్‌ కుమారుడు, యూత్‌ లీడర్‌షిప్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులైన కార్తికేయ గోయల్‌ తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు నేషనల్‌ యూత్‌ పార్లమెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌ ఓమ్‌ బిర్లా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చర్చల కోసం వివిధ దశల్లో సుమారు 5వేల మంది విద్యార్థులను వడపోసి 150 మందిని ఎంపిక చేశామని గోయల్‌ తెలిపారు. ‘మేకిన్‌ ఇండియా ద వరల్డ్‌ హోప్‌’ థీమ్‌పై విద్యార్థులు ఈ యూత్‌ పార్లమెంట్‌లో చర్చిస్తారన్నారు. రానున్న 25 ఏళ్ల అమృతకాలంలో ఆర్థికశక్తిగా భారత్‌ ఎదగడంపై వీరు ఆలోచనలను పంచుకుంటారని వివరించారు. ప్రస్తుత బడ్జెట్‌పై వీరిచ్చిన సూచనలను కేంద్రప్రభుత్వానికి పంపిస్తామని గోయల్‌ వెల్లడించారు.  


6 కేజీల డ్రగ్స్‌తో పాక్‌ డ్రోన్‌.. కూల్చివేసిన బీఎస్‌ఎఫ్‌

దిల్లీ/జైపుర్‌: సుమారు 6 కేజీల మాదకద్రవ్యాలతో పాకిస్థాన్‌ నుంచి భారత్‌ భూభాగంలోకి చొరబడిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్‌) కూల్చివేశాయి. ఈ సంఘటన రాజస్థాన్‌లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి శ్రీకర్ణాపూర్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. డ్రోన్‌లో రెండు బ్యాగులు ఉన్నాయని... మొత్తం ఆరు ప్యాకెట్ల మాదక ద్రవ్యాలు లభించాయని.. స్థానిక పోలీసు అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారని బీఎస్‌ఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.


మరో కీలక కూటమిలో భారత్‌!

యూఏఈ, ఫ్రాన్స్‌లతో త్రైపాక్షిక సహకారం

దిల్లీ: ఉక్రెయిన్‌ యుద్ధం.. అనిశ్చితిలో అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు ఉన్న నేపథ్యంలో భారత్‌ మరో కీలక కూటమి దిశగా పావులు కదుపుతోంది. ఫ్రాన్స్‌, యూఏఈలతో వివిధ రంగాల్లో సహకరించుకోవాలని నిర్ణయించుకుంది. శనివారం ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు ఒక సంయుక్త ప్రకటన చేశాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌, ఫ్రెంచ్‌ మంత్రి కేథరిన్‌ కలోనా, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌లు శనివారం ఫోన్‌లో మాట్లాడుకొని... వ్యూహాన్ని ఖరారు చేశారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు. ఇందులో రక్షణ, ఇంధన, ఆహార భద్రతా రంగాల్లో కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించారు. ఈ త్రైపాక్షిక సహకారానికి గత ఏడాది సెప్టెంబరు 19న ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల వేదికగా పునాది పడింది. ఆ సమయంలోనే ఈ ముగ్గురు విదేశాంగ మంత్రులు కలిశారు.


మైనారిటీ వర్గ వ్యతిరేకతను చాటుకుంటున్న కేంద్రం

మైనారిటీ విద్యార్థుల జీవితాలను మరింత కష్టతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మౌలానా ఆజాద్‌ జాతీయ ఉపకార వేతనాలతోపాటు విదేశాల్లో ఉన్నత విద్య కోసం మైనారిటీ విద్యార్థులకు రుణాల్లో ఇచ్చే రాయితీలనూ ఆపేసింది. ప్రభుత్వం మైనారిటీ వర్గ వ్యతిరేకతను బాహాటంగా ప్రదర్శిస్తూ, దాన్నొక ఘనతగా చాటుకుంటోంది.

పి.చిదంబరం


మోదీ ప్రభుత్వానికి అందరితోనూ గొడవే..

మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్కరితో ఎందుకు గొడవ పెట్టుకుంటోంది? న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, వ్యాపారులు.. ఇలా అందరితోనూ ఘర్షణ వైఖరి అవలంబిస్తోంది. ఇలాంటి ధోరణి కొనసాగిస్తే దేశం అభివృద్ధి చెందదు. మీ పని మీరు చేయండి. ఇతరులను పని చేసుకోనివ్వండి. వారి విధుల్లో జోక్యం చేసుకోవద్దు. 

కేజ్రీవాల్‌


ఆ నేతలను చూస్తే జాలేస్తోంది

ముస్లింగా జన్మించిన నేను ఓ హిందువును వివాహం చేసుకున్నప్పుడు ఆ మతంలోకి మారానంటూ కాంగ్రెస్‌, డీఎంకే నేతలు చెబుతున్నారు. ప్రత్యేక వివాహ చట్టం అనేది ఒకటుందని కూడా తెలియని వారిని చూసి జాలిపడుతున్నాను. కొంచెం లోక జ్ఞానం పెంచుకోండి. అది మీ పరువు పోకుండా కాపాడుతుంది.

ఖుష్బూ


భారత్‌కు సవాళ్లు విసరకండి

ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కాంక్షిస్తున్న భారత్‌ ఆశయాలకు ప్రస్తుత మార్కెట్‌ సవాళ్లు గండికొడతాయా అని అంతర్జాతీయ మీడియా ఊహాగానాలు చేస్తోంది. భూకంపాలు, కరవు, యుద్ధాలు, ఉగ్రవాదం, ఆర్థిక మాంద్యం ఇలా ఎన్నో ప్రతికూల పరిస్థితులను చూసిన అనుభవంతో చెబుతున్నాను. ఎప్పుడూ భారత్‌కు సవాళ్లు విసరకండి.

ఆనంద్‌ మహీంద్రా


ఫ్లాట్‌ స్లాబ్‌ కూలినందుకు రూ.30 లక్షల పరిహారం చెల్లించాల్సిందే

బీమా సంస్థకు వినియోగదారుల కమిషన్‌ ఆదేశం

ఠాణె: స్లాబ్‌ కూలిపోవడంతో ఫ్లాట్‌కు కలిగిన నష్టానికి పరిహారం చెల్లించాల్సిందేనని ఓ బీమా సంస్థను మహారాష్ట్రలోని ఠాణె అదనపు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ ఆదేశించింది. ఫిర్యాదుదారుడు తన పిటిషన్‌లో.. 2019లో తాను కోపర్‌ఖైరనేత్‌లో ఫ్లాట్‌ తీసుకున్నానని, అందుకు ఎస్బీఐ నుంచి రూ.45.68 లక్షల రుణం పొందానని తెలిపారు. ఆ సమయంలో పది సంవత్సరాలకుగాను రూ.30 లక్షల విలువైన పాలసీ తీసుకోమని ఎస్బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ తనను సంప్రదించిందని పేర్కొన్నారు. ఫ్లాట్‌కు అగ్నిప్రమాదం, భూకంపం, శత్రువుల దాడి..ఇలా ఎలాంటి నష్టం జరిగినా పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అయితే 2020లో తన ఫ్లాట్‌ స్లాబ్‌ కూప్పకూలినా బీమా సంస్థ పరిహారం ఇవ్వలేదని కమిషన్‌కు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై విచారించిన కమిషన్‌.. నాణ్యత లేని మెటీరియల్‌ వాడటంతోనే స్లాబ్‌ కూలిందని సర్వేయర్‌ ఇచ్చిన నివేదికను అంగీకరించింది. ఫిర్యాదుదారుడికి రూ.30 లక్షల పరిహారాన్ని 9 శాతం వడ్డీతో పాటు.. కేసు ఖర్చుల కింద రూ.50 వేలు కూడా చెల్లించాలని తన ఉత్తర్వుల్లో పేర్కొంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని