వైద్య వీలునామా నిబంధనల సరళీకరణ
వైద్య చికిత్సలు నిష్ప్రయోజనమై, మృత్యువుకు చేరువవుతున్న వ్యక్తులకు అనాయాస మరణాన్ని ప్రసాదించడానికి అనుసరించాల్సిన నియమ నిబంధనల్లోని సంక్లిష్టతలను సర్వోన్నత న్యాయస్థానం తొలగించింది.
అనాయాస మరణ ఆకాంక్ష నమోదు.. అమలుపై సుప్రీంకోర్టు నూతన మార్గదర్శకాలు
2018 తీర్పులోని సంక్లిష్టతల తొలగింపు
సవరణలతో ఆచరణ సులభతరం
దిల్లీ: వైద్య చికిత్సలు నిష్ప్రయోజనమై, మృత్యువుకు చేరువవుతున్న వ్యక్తులకు అనాయాస మరణాన్ని ప్రసాదించడానికి అనుసరించాల్సిన నియమ నిబంధనల్లోని సంక్లిష్టతలను సర్వోన్నత న్యాయస్థానం తొలగించింది. జీవన సంకల్పం(లివింగ్ విల్)/ వైద్య వీలునామా మార్గదర్శకాలను సరళతరం చేస్తూ 2018లో ఇచ్చిన తీర్పును తాజాగా సవరించింది. వైద్యుల నుంచి వ్యక్తమైన పలు అభ్యంతరాలను జస్టిస్ కె.ఎం.జోసెఫ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ ప్రక్రియలో వైద్యులు, ఆసుపత్రులకు ప్రాధాన్యం కల్పించింది. ధర్మాసనంలో జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సి.టి.రవికుమార్ ఇతర సభ్యులు. జనవరి 24న వెలువరించిన ఉత్తర్వులోని పూర్తి వివరాలు శనివారం అందుబాటులోకి వచ్చాయి. వైద్య వీలునామాను కార్యరూపంలో పెట్టేదెవరు? ఎలా అమలు చేయాలి? వైద్య మండలి అనుమతివ్వకపోతే అప్పుడేం చేయాలి... తదితర అంశాల్లో స్పష్టతనిస్తూ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది.
2018 తీర్పులో ఏముంది?
రోగులకు అనాయాస మరణాన్ని ప్రసాదించే విషయంలో వారు రాసుకునే వైద్య వీలునామాను ప్రామాణికంగా గుర్తించాలని సుప్రీంకోర్టు 2018 తీర్పు పేర్కొంది. దాని ప్రకారమే వైద్యం/ప్రాణాధార వ్యవస్థలు కొనసాగించాలో వద్దో నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. గౌరవప్రదంగా మరణించే హక్కును గుర్తించింది. వైద్య వీలునామా ఎలా ఉండాలో ఆ తీర్పులో పేర్కొంది.
జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సమక్షంలో వైద్య వీలునామాపై సదరు వ్యక్తి సంతకం చేయాలి. ఆ పత్రంపై ఇద్దరు సాక్షులతో పాటు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సంతకం చేయాలి. ఈ వీలునామా ఆ వ్యక్తి ఇష్టప్రకారం, స్వచ్ఛందంగా రాయించినదేనని పేర్కొనాలి. ఆ తర్వాత వైద్య వీలునామాను నమోదు చేయించాలి.
* గత నెల 24న ఇచ్చిన ఆదేశాల్లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ నిబంధనను సవరించింది.. జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కి బదులుగా గెజిటెడ్/నోడల్ అధికారి సాక్షి సంతకం చేయాలి.
* రోగి నిర్ణయాలు తీసుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు...అతని తరఫున అనాయాస మరణానికి సమ్మతి తెలిపేందుకు లేదా నిరాకరించేందుకు సంరక్షకులు/సమీప బంధువుల పేర్లను వీలునామాలో పొందుపరచాలి.
* వైద్య వీలునామా రాసుకుని ఉన్నట్లయితే దానిని కుటుంబ వైద్యుడికి అందజేయాలి లేదా ఆ విషయాన్ని తెలియజేయాలి.
మెడికల్ బోర్డు ఏర్పాటు
* రోగి నిర్ణయం తీసుకోలేని స్థితిలోకి వెళ్లిపోయినప్పుడు వైద్య వీలునామా అమలుకు సంబంధించిన విషయాలపై వైద్యుడు చొరవతో సంబంధిత ఆసుపత్రి...తొలుత ప్రాథమిక మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య గతంలో మూడుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండుకు తగ్గించారు.
* ప్రాథమిక మెడికల్ బోర్డు సిఫార్సులను రెండో మెడికల్ బోర్డు పరిశీలించి 48 గంటల వ్యవధిలోగా నిర్ణయాన్ని తెలియజేయాలి.
* ఒకవేళ రెండో మెడికల్ బోర్డు అనాయాస మరణానికి అంగీకరించకుంటే రోగి సంరక్షకులు నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ఇంకో మెడికల్ బోర్డు ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవచ్చు.
* ఒక వేళ తొలి మెడికల్ బోర్డు ...వైద్య వీలునామాపై ముందుకు వెళ్లడానికి నిరాకరిస్తే రోగి బంధువులు ఈ కేసును రెండో మెడికల్ బోర్డుకి సిఫార్సు చేయాలని ఆసుపత్రిని కోరవచ్చు.
* రెండు మెడికల్ బోర్డులు కూడా ప్రాణాధార వ్యవస్థ తొలగింపునకు అంగీకరించకపోతే ఆసుపత్రి సిబ్బంది కానీ, రోగి బంధువులు కానీ హైకోర్టును ఆశ్రయించవచ్చు.
వైద్య వీలునామా అంటే...
మృత్యువు సమీపిస్తోందని వైద్యులు నిర్ధరించిన వ్యక్తులు...తమకు చికిత్సను లేదా ప్రాణాధార వ్యవస్థలను ఏ దశలో నిలిపి వేయాలో వివరిస్తూ ముందుగా రాసుకునే జీవన సంకల్పమే వైద్య వీలునామా(అడ్వాన్స్ డైరెక్టివ్). అనాయాస మరణంపై నిర్ణయాలు తీసుకోలేని స్థితికి చేరుకుంటే తన తరఫున అందుకు ఎవరిని సంప్రదించాలో తెలియజేసే పత్రం అది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
World News
Canada: కెనడాలో ఓ పెళ్లివేడుకలో పంజాబీ గ్యాంగ్‌స్టర్ హత్య..!
-
India News
Wrestlers Protest: రెజ్లర్ల ఫొటోలు మార్ఫింగ్.. మండిపడ్డ సాక్షి మలిక్
-
Crime News
Kurnool: భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
-
Sports News
Dhoni - CSK: ‘ఇంపాక్ట్ ప్లేయర్ రూల్’ ధోనీకి వర్తించదట.. కారణం చెప్పిన సెహ్వాగ్!
-
India News
IAF: వాయుసేన అపాచీ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్