చీరల టోకెన్ల పంపిణీలో తొక్కిసలాట

ఉచితంగా చీరలు అందించేందుకు ఏర్పాటుచేసిన టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృత్యువాత పడగా 12 మంది గాయపడ్డారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Updated : 05 Feb 2023 04:56 IST

నలుగురు మహిళల మృత్యువాత
తమిళనాడులో విషాద ఘటన

వేలూరు, న్యూస్‌టుడే: ఉచితంగా చీరలు అందించేందుకు ఏర్పాటుచేసిన టోకెన్ల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృత్యువాత పడగా 12 మంది గాయపడ్డారు. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం..అయ్యప్పన్‌ బ్లూమెటల్‌ సంస్థ నిర్వాహకుడు అయ్యప్పన్‌ కొన్నేళ్లుగా తైపూస ఉత్సవాల సందర్భంగా ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం వేడుక నేపథ్యంలో శనివారం టోకెన్ల పంపిణీకి ఏర్పాట్లు చేశారు. టోకెన్లను తీసుకునేందుకు సుమారు 2 వేల మంది వచ్చారు. సంస్థ తలుపులు తెరవగానే పెద్దఎత్తున లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి 16 మంది స్పృహకోల్పోయారు. వారందరినీ వానియంబాడిలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కరుంబట్టి ప్రాంతానికి చెందిన వళ్లియమ్మాళ్‌ (60), ఈచ్చంబట్టుకు చెందిన నాగమ్మాళ్‌(60), అరపాండై కుప్పం వాసి రాజాత్తి(60), వానియంబాడికి చెందిన మల్లిక (65) మృతి చెందారు. మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధితులకు సరైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పోలీసులు కేసు నమోదుచేశారు. నిర్వాహకుడు అయ్యప్పన్‌ను అరెస్ట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని