కేన్సర్‌లో సత్వర గుర్తింపు, అవగాహన పెరగాలి

ఆగ్నేయాసియా దేశాల్లో కేన్సర్‌ను త్వరగా గుర్తించడానికి, నివారించడానికి ఆరోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ‘ప్రపంచ కేన్సర్‌ దినం’ సందర్భంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పిలుపునిచ్చింది.

Published : 05 Feb 2023 06:17 IST

డబ్ల్యూహెచ్‌వో పిలుపు

దిల్లీ: ఆగ్నేయాసియా దేశాల్లో కేన్సర్‌ను త్వరగా గుర్తించడానికి, నివారించడానికి ఆరోగ్య వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ‘ప్రపంచ కేన్సర్‌ దినం’ సందర్భంగా ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పిలుపునిచ్చింది. నాణ్యమైన కేన్సర్‌ చికిత్సల్లో ఉన్న తేడాలను సవరించాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండో అతిపెద్ద కారణంగా కేన్సర్‌ నిలుస్తోంది. 2020లో దీనివల్ల దాదాపు 99 లక్షల మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంత సంచాలకురాలు డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌సింగ్‌ చెప్పారు. 2010 నుంచి 2019 వరకు ప్రపంచవ్యాప్తంగా కేన్సర్‌ విస్తృతి 26%, దానివల్ల మరణాలు 21% పెరిగాయని ఆమె వివరించారు.     ఆగ్నేయాసియా ప్రాంతంలో 2020లో 23 లక్షల మందికి కేన్సర్‌ సోకగా, వారిలో 14 లక్షల మంది మరణించినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా 47 లక్షల మరణాలు ఈ వ్యాధి వల్లే ఉంటున్నాయి. 2020లో ఊపిరితిత్తులు, రొమ్ము, గర్భాశయ ముఖద్వార కేన్సర్లతో 4 లక్షల మంది మరణించారు. ఈ వ్యాధి సోకిన వారిలో మూడింట రెండొంతుల మంది మరణిస్తుండటం.. త్వరగా గుర్తించాల్సిన, మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరాన్ని తెలియజేస్తోందని డాక్టర్‌ పూనమ్‌ అభిప్రాయపడ్డారు. 2014 నుంచి ఆగ్నేయాసియాలో కేన్సర్‌పై అవగాహన గణనీయంగా పెరిగిందని చెప్పారు.

మూడోవంతు కేన్సర్‌ మరణాలు వీటివల్లే..

మొత్తం కేన్సర్‌ మరణాల్లో మూడోవంతు పొగాకు వాడకం, ఊబకాయం, మద్యపానం, పండ్లు - కూరగాయలు తక్కువగా తీసుకోవడం, భౌతిక కార్యకలాపాలు తక్కువగా ఉండటం వల్ల వస్తున్నాయని డాక్టర్‌ పూనమ్‌ తెలిపారు. కిశోర బాలికల్లో 90% మందికి హెచ్‌పీవీ టీకాను ఇచ్చేందుకు దాన్ని సామూహిక టీకాల కార్యక్రమాల్లో చేర్చాలని సూచించారు. కేన్సర్‌తో బాధపడుతూ అంత్యదశలో ఉన్నవారికి చికిత్స అందించే సదుపాయాలు రోగుల ఇళ్లకు అందుబాటులోకి రావాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని