వ్యక్తిగత హాజరు నుంచి రాహుల్‌కు మినహాయింపు

రాష్ట్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్త దాఖలుచేసిన పరువు నష్టం వ్యాజ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది.

Updated : 05 Feb 2023 06:23 IST

ఠాణె: రాష్ట్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్త దాఖలుచేసిన పరువు నష్టం వ్యాజ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి ఊరట లభించింది. ఈ కేసు విచారణలో రాహుల్‌కు మార్చి 4 నుంచి వ్యక్తిగత హాజరుపై శాశ్వత మినహాయింపు ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు మహారాష్ట్రలోని ఠాణె జిల్లా భివాండి కోర్టు శనివారం తెలిపింది. 2014లో భివాండిలో నిర్వహించిన ఓ సభలో మహాత్మా గాంధీని ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వారు హత్య చేశారని రాహుల్‌ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ఆ సంఘం కార్యకర్త రాజేశ్‌ కుంతి పరువు నష్టం దావా వేశారు. తాజాగా ఈ కేసులో రాహుల్‌ తరఫున న్యాయవాది మేజిస్ట్రేట్‌ ముందు వాదనలు వినిపించారు. రాహుల్‌ దిల్లీలో నివాసం ఉంటూ, ఎంపీగా సేవలందిస్తున్న కారణంగా ఆయన తరఫు న్యాయవాది విచారణకు హాజరవుతారని కోర్టును అభ్యర్థించారు.

రాహుల్‌ సన్నిహితుడిని ప్రశ్నించిన ఈడీ

రాహుల్‌గాంధీ సన్నిహితుడు అలంకార్‌ సవాయ్‌ని నగదు అక్రమ చలామణి కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ప్రశ్నించి, వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఈ కేసులో తృణమూల్‌ అధికార ప్రతినిధి సాకేత్‌ గోఖలేని ఈడీ గత నెల 25న అరెస్టు చేసింది. గోఖలే సమక్షంలోనూ సవాయ్‌ని మూడురోజుల పాటు విచారించారు. సవాయ్‌ ఓ బ్యాంకు మాజీ అధికారి. రాహుల్‌ నియమించుకున్న పరిశోధక బృందానికి ఆయనే నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. క్రౌడ్‌ ఫండింగ్‌ వేదిక ద్వారా నిధులు సమీకరించడంలో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయి. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.23.54 లక్షల నగదు జమ కావడంపై ఈడీ ప్రశ్నించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు