సీఏఏ అల్లర్ల కేసులో శార్జీల్‌ సహా 11 మందికి విముక్తి

అసలైన దోషుల్ని వదిలేసి బలి పశువులపై దిల్లీ పోలీసులు కేసు పెట్టారని ఆక్షేపిస్తూ ‘జామియానగర్‌ హింస’ కేసులో 11 మంది నిందితులకు దిల్లీలోని న్యాయస్థానం శనివారం ఊరటనిచ్చింది.

Updated : 05 Feb 2023 06:21 IST

పోలీసుల తీరును తప్పుపట్టిన కోర్టు
భిన్నాభిప్రాయాన్ని ప్రోత్సహించాలని వ్యాఖ్య

దిల్లీ: అసలైన దోషుల్ని వదిలేసి బలి పశువులపై దిల్లీ పోలీసులు కేసు పెట్టారని ఆక్షేపిస్తూ ‘జామియానగర్‌ హింస’ కేసులో 11 మంది నిందితులకు దిల్లీలోని న్యాయస్థానం శనివారం ఊరటనిచ్చింది. నేరాభియోగాల నుంచి వారికి విముక్తి కల్పిస్తూ అదనపు సెషన్స్‌ న్యాయమూర్తి అరుల్‌ వర్మ తీర్పు చెప్పారు. ఉపశమనం పొందినవారిలో విద్యార్థి నాయకులు శార్జీల్‌ ఇమామ్‌, ఆసిఫ్‌ ఇక్బాల్‌ తన్హా కూడా ఉన్నారు. మహమ్మద్‌ ఇలియాస్‌ అనే నిందితుడిపై మాత్రం అభియోగాలు నమోదు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. దానికి వీలుగా విచారణను ఏప్రిల్‌ 10కి వాయిదా వేశారు.

భిన్నాభిప్రాయం, తిరుగుబాటు ఒకటికాదు

పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జామియానగర్‌లో రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు శార్జీల్‌ ఇమామ్‌ను దిల్లీ పోలీసులు 2019 డిసెంబరులో అరెస్టు చేశారు. 2020లో ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్ల కేసులోనూ శార్జీల్‌ నిందితుడు. ఆ కేసు తేలనందువల్ల ప్రస్తుతం జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు 2019లో చేపట్టిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారి, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దేశం నుంచి ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలంటూ ప్రసంగించిన శార్జీల్‌ ఆ వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. దీనిపై కోర్టు విచారణ జరిపింది. నిందితులుగా పేర్కొన్నవారు ఘటనా స్థలంలో ఉన్నంతమాత్రాన వారికి అల్లర్లతో సంబంధం ఉందా అనేదానిపై కోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. భిన్నాభిప్రాయ వ్యక్తీకరణకు, తిరుగుబాటుకు మధ్యనున్న భేదంపై దర్యాప్తు సంస్థలు వివేచనతో వ్యవహరించాలని అభిప్రాయపడింది. కొన్ని పరిమితులకు లోబడి.. అసమ్మతిని తెలియపరిచే హక్కు ఉండాలని పేర్కొంది. నిందితులు ఒకరితో ఒకరు సంప్రదించుకున్నట్లు ఆధారాలను పోలీసులు సేకరించలేకపోయారని తప్పుపట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు