ఇద్దరి ప్రాణాలు కాపాడిన మెటా

ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు, మెటా(ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ) మధ్య ఒప్పందం.. వారం వ్యవధిలోనే ఇద్దరి ప్రాణాలను కాపాడేలా చేసింది.

Published : 06 Feb 2023 03:35 IST

యూపీ పోలీసుల ఒప్పందంతో నిమిషాల్లోనే..

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసులు, మెటా(ఫేస్‌బుక్‌ మాతృ సంస్థ) మధ్య ఒప్పందం.. వారం వ్యవధిలోనే ఇద్దరి ప్రాణాలను కాపాడేలా చేసింది. అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ మాత్రలు చూపిస్తూ శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పెట్టింది. ఆ అమ్మాయి ఉంటున్న ప్రదేశానికి పోలీసులు కేవలం 15 నిమిషాల్లో చేరుకొని ఆమెను కాపాడారు. మరో ఘటనలో గాజియాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి జనవరి 31న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకోవడానికి సిద్ధమై.. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశాడు. దీన్ని గుర్తించిన పోలీసులు కేవలం 13 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని అతణ్ని కాపాడారు. ఇవే కావు ఇలాంటి మరో 10ఘటనలను టెక్‌ దిగ్గజం మెటా సహాయంతో ఛేదించారు యూపీ పోలీసులు.

ఎలా సాధ్యమయింది..

ఆత్మహత్యకు పాల్పడుతున్న వ్యక్తులను కేవలం నిమిషాల వ్యవధిలోనే ఎలా కాపాడగలుగుతున్నారు? మెటా, యూపీ పోలీసులు 2022 మార్చిలో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏ వ్యక్తయినా ఆత్మహత్య, స్వీయ దాడికి సంబంధించి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ రకమైన పోస్టులు పెట్టినా.. అమెరికాలోని మెటా సంస్థకు అలర్ట్‌ వెళ్తుంది. ఆ సంస్థ.. యూపీ పోలీసులను సెకండ్లలోనే అప్రమత్తం చేస్తూ పూర్తి వివరాలను పంపుతుంది. నిష్ణాతులైన 500 మందికిపైగా పోలీసులు దీనికోసం పని చేస్తున్నారని అదనపు ఎస్పీ శ్రీవాస్తవ్‌ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు