మా తరం.. సేవా స్వరం.. కేరళలోని అలప్పుళ జిల్లాలో వినూత్న కార్యక్రమం

పేద కుటుంబాలకు చేయూత అందించేందుకు కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టర్‌ వి.ఆర్‌.కృష్ణతేజ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజ సేవపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం దీని ప్రధాన లక్ష్యం.

Published : 06 Feb 2023 05:57 IST

పేదరిక నిర్మూలనకు విద్యార్థుల ముందడుగు

అలప్పుళ: పేద కుటుంబాలకు చేయూత అందించేందుకు కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టర్‌ వి.ఆర్‌.కృష్ణతేజ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సమాజ సేవపై విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం దీని ప్రధాన లక్ష్యం.

కేరళ తీర ప్రాంతాల్లోని కుటుంబాల్లో పేదరికాన్ని దూరం చేసేందుకు ‘అలెప్పి పిల్లలు’ పేరున సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. పాఠశాలల్లో ప్రతి 100 మంది విద్యార్థుల బృందం ఒక్కో పేద కుటుంబాన్ని దత్తత తీసుకుని, ప్రతినెలా వారికి నిత్యావసరాలు ఇతర వస్తువులు అందజేయడం దీని ప్రధాన ఉద్దేశం. కొన్ని పాఠశాలల్లో 50 మంది పిల్లల బృందాలే ఈ బృహత్తర కార్యక్రమంలో మేము సైతం అంటూ పాల్గొంటున్నాయి. దీనికోసం ముందుగా జిల్లా యంత్రాంగం ఆర్థికంగా వెనుకబడిన 3,613 కుటుంబాలను గుర్తించింది. తరువాత వారిని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలకు అనుసంధానం చేశారు. వివాదాలకు ఆస్కారం లేకుండా కుటుంబాల ఎంపిక ప్రక్రియను గోప్యంగా ఉంచారు. ఇలా దేశంలోనే పేదలకు చేయూత అందించే మొదటి జిల్లాగా అలప్పుళ నిలిచింది.  

నెలలో మొదటి సోమవారం

అలప్పుళ జిల్లాలోని పంచాయతీలు, శాసన సభ్యులు, మంత్రుల సహకారంతో ప్రతి నెలా మొదటి సోమవారం పాఠశాలల్లో ‘సమాజ సేవా దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఆ రోజు విద్యార్థులు ఆహారోత్పత్తులు, ఇతర వస్తువులు తెచ్చి ఓ పెట్టెలో ఉంచేలా ప్రోత్సహిస్తున్నారు. వాటిలో ఖరీదైన వస్తువులు, బియ్యం కాకుండా పప్పు దినుసులు, సబ్బులు, పేస్టులు, గోధుమ పిండి ఇతరత్రా ఉంటాయి. పేదలకు పౌర పంపిణీ ద్వారా ప్రభుత్వాలు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి.. కనుక వాటిని మాత్రం తీసుకురావొద్దని చెబుతున్నారు.


పిల్లలు, తల్లిదండ్రులే కీలకం..

‘అలెప్పి పిల్లలు’ పేరున పేదలకు అందుతున్న సేవల్లో పిల్లలు, తల్లిదండ్రులదే కీలక భూమికని కలెక్టర్‌ కృష్ణతేజ చెబుతున్నారు. అన్నిచోట్లా మంచి స్పందన వస్తోందంటున్నారు. ఆదర్శ భావాలు కలిగిన కేరళ ప్రజల వల్ల ఈ కార్యక్రమం విజయవంతమైందని ఆయన తెలిపారు. తమకు ఉన్నదాంట్లో కొంత ఇతరులకు పంచడం వల్ల కలిగే సంతృప్తిని చిన్నతనంలోనే పిల్లలు అనుభూతి చెందుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని