సంక్షిప్త వార్తలు(10)
బిహార్‌లోని సమస్తీపుర్ రైల్వే డివిజన్ పరిధిలో పనికిరాని రైలు పట్టాలను దొంగలు అపహరించారు. ఈ పట్టాల పొడవు దాదాపు రెండు కిలోమీటర్లు.
బిహార్‌లో పాత రైలు పట్టాలను ఎత్తుకెళ్లిన దొంగలు
బిహార్‌లోని సమస్తీపుర్ రైల్వే డివిజన్ పరిధిలో పనికిరాని రైలు పట్టాలను దొంగలు అపహరించారు. ఈ పట్టాల పొడవు దాదాపు రెండు కిలోమీటర్లు. గతంలో మధుబని లోహత్ షుగర్ మిల్ నుంచి పండోల్ స్టేషన్ వరకు రైల్వే లైన్ వేశారు. ఏళ్ల తరబడి ఈ చక్కెర మిల్లు మూతపడి ఉండటంతో ఈ మార్గం వినియోగంలో లేదు. దీంతో దొంగలు ఈ పట్టాలను తీసుకెళ్లిపోయారు. జనవరి 24న ఈ ఘటన వెలుగు చూసింది. రైల్వేస్టేషన్‌లో పని చేసే అధికారులే ఈ దొంగతనానికి సహకరించి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ చోరీకి బాధ్యుల్ని చేస్తూ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను రైల్వే శాఖ సస్పెండ్ చేసింది.
ఆసుపత్రి ఆక్సిజన్ పైప్‌లైన్ కట్ చేసిన దొంగలు
రాజస్థాన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆసుపత్రి వెనుక ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ పైప్‌లైన్‌ను దొంగలు కట్ చేశారు. దీంతో ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది వార్డులో ఉన్న 20 మంది నవజాత శిశువులకు సిలిండర్ల ద్వారా ఆక్సిజన్‌ను అందించారు. అల్వార్ నగరంలోని గీతానంద్ శిశు ఆసుపత్రిలో ఎఫ్‌బీఎన్‌సీ వార్డులో 20 మంది నవజాత శిశువులు.. ఆక్సిజన్‌పై ఉన్నారు. ఆదివారం రాత్రి.. ఆసుపత్రి వెనుక ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ పైపులను ఎత్తుకెళ్లేందుకు కొందరు వ్యక్తులు యత్నించారు. అందులో భాగంగా పైపులను కత్తిరించారు. దీంతో వార్డుకు ఆక్సిజన్ సరఫరా ఆగిపోయింది. స్పందించిన వైద్యులు సిలిండర్ల సహాయంతో ఆక్సిజన్ అందించారు.
రాడార్ల కళ్లుగప్పే పదార్థం
దిల్లీ: సైనిక సాధనాలు, ఆయుధాలను శత్రు రాడార్ల కంటపడకుండా చూసే ఒక అద్భుత పదార్థాన్ని భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది స్టెల్త్ వాహనాల అద్దాలనూ కప్పేయగలదు. హిమాచల్ ప్రదేశ్‌లోని మండీలో ఉన్న ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. యుద్ధరంగంలో రాడార్లు చాలా కీలకం. అవి రేడియో తరంగాలను వెదజల్లుతూ.. ప్రత్యర్థిపై కన్నేస్తాయి. మన ఆయుధాలను వాటి కంటపడకుండా జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. దీనివల్ల శత్రువులు వాటిని లక్ష్యంగా చేసుకోకుండా రక్షించుకోవచ్చు. ఈ తరంగాలను శోషించుకోగలిగితే ఇది సాధ్యమవుతుంది. ఈ దిశగా ఐఐటీ శాస్త్రవేత్తలు ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ సర్ఫేస్ (ఎఫ్‌ఎస్‌ఎస్) అనే విధానం ఆధారంగా ఒక టెక్నాలజీని అభివృద్ధి చేశారు. తొలుత వీరు పారదర్శకమైన ఇండియం టిన్ ఆక్సైడ్ (ఐటీవో) పూత పూసిన పాలీఇథలీన్ టెరెప్తలేట్ (పీఈటీ) ఫలకాన్ని ఉపయోగించారు. దీనిపై ఎఫ్‌ఎస్‌ఎస్ ఆకృతులను డిజైన్ చేశారు. ఇది 90శాతం వరకూ రాడార్ తరంగాలను శోషించుకోగలదని పరీక్షల్లో వెల్లడైంది. ఇది పారదర్శకంగా ఉండటం వల్ల స్టెల్త్ వాహనాల అద్దాలకూ దాన్ని ఉపయోగించొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
పర్యావరణ అంశాలే ఎజెండాగా జీ20 సదస్సు
దిల్లీ: పర్యావరణ అంశాలే ఎజెండాగా ఈ ఏడాది జీ20 సమావేశాలను భారత్ నిర్వహించనుంది. జీవవైవిధ్య నష్టం, భూమి క్షీణత, సముద్ర కాలుష్యం, వనరుల అధిక వినియోగం, వ్యర్థాల శోచన వంటి ముఖ్యమైన అంశాలను జీ20 సదస్సు చర్చించనుందని సోమవారం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి- మే మధ్య బెంగళూరు, గాంధీనగర్, ముంబయి, చెన్నై నగరాల్లో సమావేశాలు జరపనున్నట్లు వెల్లడించింది. వసుధైక కుటుంబం ఇతివృత్తంతో ఈ ఏడాది జీ20 సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 9-10 తేదీల్లో వివిధ నగరాల్లో 200 సమావేశాలు జరగనున్నాయి.
* జీ20 సమావేశాలకు తాము సేవలు అందించనున్నట్లు స్వదేశీ ఎయిర్‌లైన్ గో-ఫస్ట్ తెలిపింది. దీనికి చార్టర్ విమానాలను వినియోగించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 23 వరకు 7 చార్టర్ విమానాలు నడుస్తాయని ఆ సంస్థ తెలిపింది.
మత విద్వేష నేరాలకు చోటివ్వ తగదు
ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోవాలి
సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడి
దిల్లీ: లౌకిక దేశమైన భారత్‌లో మత విద్వేష నేరాలకు చోటివ్వరాదని, విద్వేష ప్రసంగాలపై రాజీ ధోరణి తగదని అధికార యంత్రాంగాన్ని సుప్రీంకోర్టు సున్నితంగా హెచ్చరించింది. పెరుగుతున్న ఈ తరహా నేరాలను ప్రభుత్వాలు గుర్తిస్తేనే పరిష్కారం సాధ్యమవుతుందని జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ బి.వి.నాగరత్నల ధర్మాసనం సోమవారం తెలిపింది. ఇటువంటి నేరాలపై చర్యలు తీసుకోకుంటే సమాజంలోని పరిస్థితులు అదుపుతప్పుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులు చట్టాన్ని గౌరవించకపోతే ప్రతి ఒక్కరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారని పేర్కొంది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ...తనను ‘స్క్రూడ్రైవర్ గ్యాంగ్’ వేధించిందని తెలిపినా నొయిడా పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆరు నెలల తర్వాత పోలీసులు వచ్చి విద్వేష నేరంగా నమోదు చేయవద్దని కోరారని బాధితుడు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.
గృహహింస నిరోధక చట్టం కింద మనోవర్తి చెల్లించాల్సిందే: హైకోర్టు
ముంబయి: విడాకులు తీసుకున్న తర్వాతా భర్త గృహహింస నిరోధక చట్టం కింద భార్యకు మనోవర్తి చెల్లించాల్సిందేనని 2021 మే నెలలో సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును, గత నెల 24న బొంబాయి హైకోర్టు సమర్థించింది. 2013 మే నెలలో పెళ్లయిన ఒక జంట అదే ఏడాది జులైలో విడిపోయి వేరుగా జీవిస్తున్నారు. భరణం కోసం భార్య పెట్టుకున్న అర్జీని కుటుంబ కోర్టు తోసిపుచ్చినా, సెషన్స్ కోర్టు అనుమతించింది. పోలీసు కానిస్టేబుల్ అయిన భర్త నెలకు రూ.6,000 భరణంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. దీనిపై భర్త హైకోర్టుకు వెళ్లాడు. భార్యకూ తనకూ వివాహ బంధం తెగిపోయినందున గృహహింస నిరోధక చట్టం కింద తాను మనోవర్తి చెల్లించనక్కర్లేదని వాదించాడు. విడాకులు తీసుకున్న తేదీ వరకు మనోవర్తి బకాయిలను చెల్లించానని వివరించాడు. నెలకు రూ.25,000కు పైగా జీతం పొందుతున్న భర్తను కేవలం రూ.6,000 భరణం చెల్లించాలని ఆదేశించామని, దీన్ని అతడు అదృష్టంగా భావించాలని హైకోర్టు పేర్కొంది. గృహహింస నిరోధక చట్టం కింద భార్యకు మనోవర్తి చెల్లించాల్సిన బాధ్యత భర్తపై ఉందని స్పష్టం చేసింది.
దిల్లీ మేయర్ ఎన్నిక మళ్లీ విఫలం
దిల్లీ: దిల్లీ మేయర్ ఎన్నిక వ్యవహారంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. మేయర్‌ను ఎన్నుకునేందుకు సోమవారం చేసిన ప్రయత్నం మళ్లీ విఫలమైంది. ఇలా జరగడం నెల రోజుల్లో మూడోసారి. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు ఓటు వేసేందుకు ప్రిసైడింగ్ అధికారి సత్యా శర్మ అనుమతి ఇవ్వడంపై ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అభ్యంతరం తెలుపుతూ నిరసన వ్యక్తం చేసింది. దీంతో మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోకుండానే సమావేశం మరోసారి వాయిదా పడింది. దీంతో ఆప్ సభ్యుల తీరును వ్యతిరేకిస్తూ భాజపా కౌన్సిలర్లు సభ నుంచి వెళ్లిపోగా.. ఆప్ కౌన్సిలర్లు మాత్రం అక్కడే కూర్చొని నిరసన తెలియజేశారు. జనవరి 6న, 24న కూడా మేయర్ ఎన్నిక కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత డిసెంబర్ 4న జరిగిన దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్(126)ను దాటి.. 134 స్థానాలను కైవసం చేసుకుంది. మేయర్ ఎన్నిక మెజారిటీ ప్రకారం ఆ పదవి ఆప్‌కే దక్కే అవకాశం ఉంది. కానీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్ల చేత ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయించడం వివాదానికి కారణమయ్యింది. మేయర్ ఎన్నికలో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడానికి అనుమతి లేదంటూ ఆప్ వ్యతిరేకిస్తోంది. ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆప్ వెల్లడించింది.
‘పరీక్షా పే చర్చ’ ఖర్చు రూ.28 కోట్లు
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కోసం 2018 నుంచి 2022 వరకు రూ.28 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవీ లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2018లో ఈ కార్యక్రమానికి రూ.3.67కోట్లు, 2019లో రూ.4.93 కోట్లు, 2020లో రూ.5.69 కోట్లు, 2021లో రూ.6 కోట్లు, 2022లో రూ.8.61 కోట్లు ఖర్చు చేశారు. 2023కి సంబంధించి వివరాలు వెల్లడించలేదు. గత నెల 27న పరీక్షా పే చర్చ ఆరో ఎడిషన్ దిల్లీలోని తాల్‌కటోరా స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రికార్డు స్థాయిలో 38లక్షల మంది నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.
అస్సాంలో నాలుగో రోజూ అరెస్టులు
బాల్య వివాహాలపై కొనసాగుతున్న చర్యలు
నిరసనగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు
అస్సాం: విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నా.. బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతున్న అస్సాం ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. మూడు రోజులుగా కొనసాగుతున్న అరెస్టుల పర్వం సోమవారం సైతం కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,441 మందిని అరెస్టు చేయగా, 4,074 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. మరోవైపు తమ వారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. అక్కడి బరక్ లోయ, మోరీగావ్, దుబ్రి, నగౌవ్ జిల్లాల్లో ఆయా కుటుంబాలకు చెందిన వారు ఆందోళనలకు దిగారు. ‘మా వాళ్లను పోలీసులు తీసుకెళ్లిపోయారు.. దీంతో మమ్మల్ని చూసుకోవడానికి ఎవరూ లేరు’ అని దుబ్రిలో చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న రేష్మా ఖాతూన్ తెలిపారు. ఆదివారం సాయంత్రానికి బిశ్వనాథ్ జిల్లాలో 139, బార్పేట జిల్లాలో 130, దుబ్రి జిల్లాలో 126 మందిని అరెస్టు చేశారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా దుబ్రి జిల్లాలో అత్యధికంగా 374 కేసులు, హొజైలో 255, మోరీగావ్‌లో 224 నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కామ్‌రుప్ జిల్లా రంగియాలో ఏడుగురికి స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ఈ ప్రక్రియ 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. అస్సాం ప్రభుత్వం అక్షరాస్యత శాతం పెంచడంపై దృష్టి సారించాలని, అప్పుడు మాత్రమే బాల్య వివాహాలను అరికట్టగలమన్నారు. అందుకు పాఠశాలల్ని పెద్దఎత్తున ప్రారంభించాలని, అది మాత్రం మీరు చేయరని విమర్శించారు. బాల్య వివాహాలను తాము వ్యతిరేకస్తున్నా.. కుటుంబాల్లో ఇప్పుడు అశాంతి రేపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు భుపెన్ బొరా అభిప్రాయపడ్డారు. మరి కొంతమంది విపక్ష సభ్యులు సైతం ప్రభుత్వ చర్యలను వ్యతిరేకించారు.
హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తునకు ఆదేశించండి
సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం
దిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీలపై ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది విశాల్ తివారీ ఈ పిటిషన్ వేశారు. బడా కార్పొరేట్ సంస్థలకు రూ.500 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేస్తున్న విధానాన్ని కూడా పరిశీలించేలా ప్రత్యేక కమిటీని నియమించాలని అభ్యర్థించారు. హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం అదానీ కంపెనీల షేర్ల విలువ సగానికిపైగా పడిపోవడంతో ఇన్వెస్టర్లు దారుణంగా నష్టపోయారని పిటిషనర్ పేర్కొన్నారు. హిండెన్‌బర్గ్ పరిశోధక సంస్థకు చెందిన నాథన్ ఆండర్సన్‌ను విచారించాలని కోరుతూ గత వారం సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలైంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/23)
-
Sports News
IPL 2023:చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్.. కీలక ఆటగాడు దూరం!
-
Education News
TTWREIS: అశోక్‌నగర్ సైనిక పాఠశాలలో ఆరు, ఇంటర్ ప్రవేశాలకు ఆహ్వానం
-
Crime News
సిద్ధూ మూసేవాలా తరహాలో చంపేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు మెయిల్!
-
Sports News
BCCI: టాప్ కేటగిరిలోకి రవీంద్ర జడేజా: వార్షిక వేతన కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ
-
Politics News
TDP: తెదేపా ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున సన్నాహాలు