మద్రాస్‌ హైకోర్టు అదనపు జడ్జీగా ఎల్సీవీ గౌరీ నియామకంపై అభ్యంతరాలు

మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ మద్రాస్‌ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులు కావడంపై తీవ్ర వివాదం తలెత్తింది. ఈ అంశంపై అసాధారణ రీతిలో అత్యవసర విచారణను చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది.

Published : 07 Feb 2023 06:11 IST

నేడు సుప్రీంకోర్టులో విచారణ

దిల్లీ: మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీ మద్రాస్‌ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులు కావడంపై తీవ్ర వివాదం తలెత్తింది. ఈ అంశంపై అసాధారణ రీతిలో అత్యవసర విచారణను చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిర్ణయించింది. ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసి మంగళవారమే కేసును చేపట్టనున్నట్లు తెలిపింది. అలహాబాద్‌, కర్ణాటక, మద్రాస్‌ హైకోర్టులకు 11 మంది న్యాయవాదులను జడ్జీలుగా నియమిస్తూ సోమవారం కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వీరిలో న్యాయవాది ఎల్‌.సి.వి.గౌరీ ఒకరు. ఆమె పేరును మద్రాస్‌ హైకోర్టు అదనపు జడ్జీ పదవికి సిఫార్సు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాతో కూడిన ధర్మాసనం తొలుత సోమవారం ఉదయం విచారణ జరిపి ఈ నెల 10కి వాయిదా వేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం జడ్జీల నియామకంపై నోటిఫికేషన్‌ జారీ చేసిందని సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ మధ్యాహ్నం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంగళవారమే విచారణ జరుపుతామని, ఇందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వెల్లడించారు. న్యాయవాది ఎల్‌.సి.వి.గౌరీ పేరును మద్రాస్‌ హైకోర్టు కొలీజియం సూచించగా...దానిని సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని తెలిపారు. ఆ తర్వాతే ఆమెకు సంబంధించిన అంశాలు కొన్ని తమ దృష్టికి వచ్చాయన్నారు. కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవచ్చని గతంలో వెలువడిన తీర్పును సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ ఉటంకించారు.

అభ్యంతరాలివీ: మద్రాస్‌ హైకోర్టుకు చెందిన మదురై ధర్మాసనం విచారించే కేసుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది గౌరీ హాజరయ్యే వారు. ఆమెకు భాజపాతో రాజకీయ సంబంధాలున్నాయనే విమర్శలతో పాటు క్రిస్టియన్లు, ముస్లింల గురించి విద్వేష ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. గౌరీ అర్హతల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ జరపనుండగా అదే రోజు ఉదయం 10.35 గంటలకు ఆమె, మరో నలుగురు.. న్యాయమూర్తులుగా మద్రాస్‌ హైకోర్టులో ప్రమాణం చేయనున్నారు. సుప్రీంకోర్టులో ఈ వ్యాజ్యం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సుందరేశ్‌ ధర్మాసనం ముందున్న విచారణ కేసుల జాబితాలో 38వ స్థానంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని