సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి, మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు.

Published : 07 Feb 2023 06:11 IST

మరో నలుగురూ ప్రమాణం
32కు చేరిన జడ్జీల సంఖ్య

దిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి, మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ మనోజ్‌మిశ్రలతో  ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సోమవారమిక్కడ సుప్రీంకోర్టు ప్రాంగణంలో ప్రమాణస్వీకారం చేయించారు. వీరి పేర్లను గతేడాది డిసెంబరు 13న సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఈ మేరకు వీరిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్‌ జారీచేసింది. తాజాగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌ రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌ పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా,  జస్టిస్‌ అసనుద్దీన్‌ అమానుల్లా పట్నా హైకోర్టు న్యాయమూర్తిగా, జస్టిస్‌ మనోజ్‌మిశ్ర అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. తాజా  నియామకాలతో సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది.


13 మంది అదనపు న్యాయమూర్తుల నియామకం: రిజిజు

అలహాబాద్‌, కర్ణాటక, మద్రాస్‌ హైకోర్టులకు 13 మంది అదనపు న్యాయమూర్తులను నియమించినట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. వీరిలో 11 మంది న్యాయవాదులు, ఇద్దరు న్యాయాధికారులు ఉన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు సోమవారం ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని ప్రకటించడంతోపాటు శుభాకాంక్షలు తెలిపారు. ఆరుగురు అలహాబాద్‌ హైకోర్టుకు, ఐదుగురు మద్రాస్‌ హైకోర్టుకు, ఇద్దరు కర్ణాటక హైకోర్టుకు నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని