రూ.55 వేలకు బాలికను అమ్మేసిన వృద్ధురాలు

రూ.55,000కు ఆశపడిన ఓ వృద్ధురాలు మనవరాలిని ఓ మహిళకు విక్రయించింది. ఆ మహిళ, ఆమె కుమారుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులు ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Published : 07 Feb 2023 06:10 IST

తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
తనపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు

జైపుర్‌: రూ.55,000కు ఆశపడిన ఓ వృద్ధురాలు మనవరాలిని ఓ మహిళకు విక్రయించింది. ఆ మహిళ, ఆమె కుమారుడి చెర నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులు ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఝార్ఖండ్‌కు చెందిన వృద్ధురాలికి కొన్నిరోజుల క్రితం కూరగాయలు విక్రయించే మహిళతో పరిచయం ఏర్పడింది. బాలికకు వివాహం చేయిస్తానని ఆమె వృద్ధురాలికి హామీ ఇచ్చింది. బాలికను తాను చెప్పినవారికి అప్పగిస్తే.. రూ.55,000 ఇస్తానని తర్వాత ఆశ చూపింది. అనంతరం యువతిని తీసుకుని వృద్ధురాలు, మహిళ రైల్లో రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌ చేరుకున్నారు. అక్కడ వారికి మరో మహిళ తోడైంది. ఆమె వృద్ధురాలికి రూ.55,000 చెల్లించింది. అనంతరం బాధితురాలిని మూడో మహిళకు అప్పగించిన వృద్ధురాలు.. కూరగాయలు విక్రయించే మహిళతో కలిసి ఝార్ఖండ్‌ వెళ్లిపోయింది. ఆ తర్వాత మూడో మహిళ కుమారుడు బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎదురుతిరిగి ప్రశ్నిస్తే.. మేం నిన్ను డబ్బులు పెట్టి కొన్నామని చెప్పేవారని బాలిక తన ఫిర్యాదులో వాపోయింది. తనను బయటకు రాకుండా తల్లీకుమారుడు గదిలోపెట్టి బంధించే వారని పేర్కొంది. చివరకు అక్కడ నుంచి తప్పించుకున్న బాధితురాలు జైపుర్‌లోని మాణక్‌ చౌక్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని