సంక్షిప్త వార్తలు(8)

మహిళా నిందితులు, ఖైదీలకు కన్యత్వ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం, లింగవివక్షతో కూడిన వ్యవహారమే కాకుండా అమానుష వైఖరికి నిదర్శనమని దిల్లీ హైకోర్టు మంగళవారం వెల్లడించింది.

Updated : 08 Feb 2023 05:45 IST

మహిళా నిందితుల కన్యత్వ పరీక్ష రాజ్యాంగ విరుద్ధం దిల్లీ హైకోర్టు వెల్లడి

దిల్లీ: మహిళా నిందితులు, ఖైదీలకు కన్యత్వ పరీక్ష నిర్వహించడం రాజ్యాంగ విరుద్ధం, లింగవివక్షతో కూడిన వ్యవహారమే కాకుండా అమానుష వైఖరికి నిదర్శనమని దిల్లీ హైకోర్టు మంగళవారం వెల్లడించింది. కన్యత్వ పరీక్ష పేరిట చట్టంలోనూ ఎలాంటి ప్రక్రియ లేదని స్పష్టం చేసింది. 1992లో కేరళలో జరిగిన సిస్టర్‌ అభయ హత్యకేసుకు సంబంధించి తనపై నమోదైన క్రిమినల్‌ కేసులో కన్యత్వ పరీక్ష నిర్వహించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సిస్టర్‌ సెఫీ దాఖలు చేసిన పిటిషను విచారణ సందర్భంగా జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ రకమైన పరీక్ష రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించే గౌరవ హక్కుకు భంగమే’’ అని న్యాయమూర్తి తెలిపారు. విచారణలో భాగంగా 2008లో సీబీఐ తనకు బలవంతంగా కన్యత్వ పరీక్ష చేయించిందని, ఆ పరీక్ష ఫలితాలు కూడా వెల్లడి చేశారని పిటిషనరు కోర్టు దృష్టికి తెచ్చారు. మహిళలకు రెండు వేళ్లతో జరిపే కన్యత్వ పరీక్ష వారి గౌరవానికి, గోప్యతకు భంగకరమని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆక్షేపణ తెలిపిందని, న్యాయస్థానాలకు రెండు రకాల దృక్పథాలు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది.  


పక్షవాతం సోకిన శునకానికి పుట్టినరోజు వేడుకలు

ఉత్తర్‌ప్రదేశ్‌ మేరఠ్‌లో పక్షవాతం సోకిన ఓ శునకానికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగా నగర్‌ ప్రాంతానికి చెందిన సోనియా గౌతమ్‌ ఈ వేడుకలు జరిపించారు. ఈ కుక్కను ఇంటికి తీసుకుని వచ్చి కల్లూ అని పేరు పెట్టామని, అప్పటి నుంచి అదృష్టం కలిసి వచ్చిందని పారామిలిటరీలో పనిచేసే సోనియా చెప్పారు. కల్లూ పుట్టినరోజు సందర్భంగా వీధి శునకాలకు ప్రత్యేకంగా ఆహారం సిద్ధం చేసి వాటికి అందించారు. ఆమె ఇంట్లో దాదాపు రెండు డజన్ల జంతువులను పెంచుతున్నారు. వాటిలో చాలా కుక్కలు వైకల్యంతో బాధపడుతున్నాయి. గత ఐదేళ్లుగా రోడ్లపై ఉండే జంతువులకు సోనియా ఆహారం అందిస్తున్నారు. ఇలాంటి జంతువుల కోసం ఆసుపత్రి నిర్మించి మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యం అని ఆమె వెల్లడించారు.


త్వరగానే విచారణ చేపడతాం
బిల్కిస్‌ బానోకు సుప్రీంకోర్టు హామీ

దిల్లీ: గుజరాత్‌ అల్లర్ల (2002) సందర్భంగా తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, తన కుటుంబసభ్యులను హత్య చేసిన నిందితులకు గుజరాత్‌ ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ బిల్కిస్‌ బానో దాఖలు చేసిన పిటిషన్‌పై కొత్త ధర్మాసనం ఏర్పాటుచేసిన వెంటనే విచారణ చేపడతామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ, జస్టిస్‌ జస్టిస్‌ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం.. త్వరలోనే కొత్త ధర్మాసనం ఏర్పాటుచేస్తామని బానో తరఫున హాజరైన న్యాయవాది శోభా గుప్తాకు హామీ ఇచ్చింది. తమ అభ్యర్థనపై వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసిన గుప్తా.. ఈ అంశం విచారణ నుంచి జస్టిస్‌ బేలా ఎం త్రివేదీ వైదొలగినందున సీజేఐ కొత్త ధర్మాసనం ఏర్పాటుచేయాల్సి ఉందని ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. దీంతో సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ కల్పించుకుని ‘‘వీలైనంత త్వరగా ఏర్పాటుచేస్తాం. ఈ కేసు వీలైనంత త్వరగా లిస్ట్‌ అవుతుంది’’ అని చెప్పారు. వాస్తవానికి గత నెల 24న బిల్కిస్‌ బానో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టాల్సి ఉంది. ఈ న్యాయమూర్తులు ఇద్దరూ అనాయాస మరణానికి సంబంధించిన మరో పిటిషన్‌ని విచారిస్తున్న అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నందున ఆ రోజున బానో పిటిషన్‌పై విచారణ జరపడం వీలుపడలేదు.


ఉద్యోగాల హామీ ఏమైంది?

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆరాటపడొద్దని యువతకు ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ సూచిస్తున్నారు. మరి ప్రైవేటు ఉద్యోగాలు ఎక్కడున్నాయి భాగవత్‌ గారూ? ఇంతకీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ మోదీ ఇచ్చిన హామీ ఏమైంది?      

 కపిల్‌ సిబల్‌


విద్యకు అత్యుత్తమ గమ్యస్థానమవ్వాలి

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతోంది. చదువు కోసం ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులను మన దేశానికి ఆకర్షించే సామర్థ్యాన్ని ఇప్పటికే మనం సముపార్జించుకొని ఉండాల్సింది. కానీ ప్రస్తుతం మన యువతే విద్య కోసం విదేశాల బాటపడుతోంది. వైద్య విద్యను అభ్యసించేందుకు మనవాళ్లు ఉక్రెయిన్‌ వంటి దేశాలకు వెళ్తుండటం బాధాకరం. చదువుకు అత్యుత్తమ గమ్యస్థానంగా అవతరించే సామర్థ్యం భారత్‌కు ఉంది.

 అరవింద్‌ కేజ్రీవాల్‌


సమర్థ నాయకత్వం భారత్‌ సొంతం

శాంతి పరిరక్షణకు, వివాదాల పరిష్కారానికి సమర్థ నాయకత్వం అత్యంత కీలకం. బుద్ధుడి రూపంలో ఆధ్యాత్మిక నాయకత్వం, మహాత్మా గాంధీ రూపంలో సామాజిక నాయకత్వం, నరేంద్ర మోదీ రూపంలో బలమైన రాజకీయ నాయకత్వం భారత్‌కు లభించాయి.  

 తేజస్వీ సూర్య


సామాజిక మాధ్యమాలతో బూటకపు వార్తల ముప్పు

నకిలీ సమాచారం, బూటకపు వార్తల వ్యాప్తికి సామాజిక మాధ్యమాలు అనువైన వేదికగా మారే అవకాశముంది. వేర్పాటువాద భావజాలాన్ని పెంపొందించేందుకు ఈ మాధ్యమాలను తీవ్రవాద సంస్థలు ఉపయోగించుకునే ముప్పుంది. ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

 ఐరాస అభివృద్ధి కార్యక్రమం


వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ.. మాక్‌డ్రిల్‌ నిర్వహించొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు

ముంబయి: ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ మాక్‌ డ్రిల్‌ నిర్వహించవద్దని బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ మహారాష్ట్ర పోలీసులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మాక్‌ డ్రిల్‌లో వేషధారణలు, వారు చేసే నినాదాలు ఉగ్రవాదులు ముస్లింలని తెలిపేలా ఉన్నాయని అభ్యంతరం చెబుతూ సామాజిక కార్యకర్త సయ్యద్‌ ఉసామా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తులు జస్టిస్‌ మంగేష్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.చాపల్‌గౌవాంకార్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఫిబ్రవరి 3న నిర్వహించిన మాక్‌ డ్రిల్‌కు సంబంధించిన మార్గదర్శకాలు కోర్టుకు తెలియజేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. తరువాత విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. ఇటీవల పోలీసులు అహ్మద్‌నగర్‌, చంద్రాపూర్‌, ఔరంగాబాద్‌ జిల్లాల్లో మాక్‌డ్రిళ్లు చేపట్టారు.


అగస్టా కుంభకోణంలో నిందితుడికి బెయిలు నిరాకరణ

దిల్లీ: అగస్టా-వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్‌ కుంభకోణంలో దళారిగా వ్యవహరించిన క్రిస్టియన్‌ మైఖేల్‌ జేమ్స్‌కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిలు నిరాకరించింది. అత్యంత ప్రముఖుల (వీవీఐపీ) కోసం రూ.3,600 కోట్లతో 12 అగస్టా-వెస్ట్‌ ల్యాండ్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి జేమ్స్‌పై సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)లు విడివిడిగా కేసులు పెట్టి దర్యాప్తు జరుపుతున్నాయి. ఈ కేసులో తనకు విధించగల గరిష్ఠ జైలు శిక్షలో ఇప్పటికే సగం కాలాన్ని పూర్తిచేసినందున బెయిలు ఇప్పించాలంటూ జేమ్స్‌ పెట్టుకున్న దరఖాస్తును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది. అయితే, ట్రయల్‌ కోర్టులో బెయిలు కోసం ప్రయత్నించడానికి అనుమతించింది.


ముంబయి విమానాశ్రయానికి ఉగ్ర బెదిరింపులు

ముంబయి: మహారాష్ట్రలోని ముంబయి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి సోమవారం రాత్రి ఉగ్ర బెదిరింపులు వచ్చాయి. ఫోన్‌ చేసిన వ్యక్తి తాను ఇండియన్‌ ముజాహిద్దీన్‌లోని సభ్యుడు ఇర్ఫాన్‌ అహ్మద్‌ షేక్‌గా చెప్పుకొన్నాడు. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌ పోర్టు అధికారులు ముంబయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విమానాశ్రయ ఏజెన్సీలతోపాటు ముంబయి పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును మొదలుపెట్టారు. ఈ నెల 10న ప్రధాని మోదీ నగరానికి రానున్న నేపథ్యంలో బెదిరింపులు రావడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. సోమవారం నుంచి భద్రతా ఏర్పాట్లను మొదలు పెట్టిన అధికారులు.. డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు విధించారు.


త్వరలో దాభోల్కర్‌ హత్య కేసు విచారణ ముగింపు

బొంబాయి హైకోర్టుకు తెలిపిన సీబీఐ
నిందితులకు బెయిల్‌ ఇవ్వొద్దని వినతి

ముంబయి: హేతువాది దాభోల్కర్‌ హత్య కేసు విచారణ రెండు, మూడు నెలల్లో ముగుస్తుందని, ఈ నేపథ్యంలో నిందితుడికి బెయిల్‌ ఇవ్వొద్దని బొంబాయి కోర్టును మంగళవారం సీబీఐ అభ్యర్థించింది. మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్‌ సమితి స్థాపకుడైన నరేంద్ర దాభోల్కర్‌(67)ను పుణెలో 2013 ఆగస్టులో సనాతన్‌ సంస్థ అనే అతివాద గ్రూప్‌ సభ్యులు కాల్చి చంపారు. 2014లో కేసును సీబీఐకి అప్పగించగా... వీరేంద్ర సిన్హ తావ్‌డే, సచిన్‌ అందురె, శరద్‌ కలస్కర్‌, విక్రం భావె, సంజీవ్‌ పునలేకర్‌(న్యాయవాది) అనే అయిదుగురిపై అభియోగపత్రం దాఖలు చేసింది. 2021 అక్టోబరులో విచారణ మొదలైంది. వీరిలో బెయిల్‌పై బయటకు వచ్చిన పునలేకర్‌ సాక్ష్యాలను ధ్వంసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మిగతా నలుగురిపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో... 2016లో అరెస్టై, ఏడేళ్లుగా జైలులో ఉంటున్నానని, కేసు విచారణలో తీవ్ర జాప్యం జరుగుతున్నందున తనకు బెయిల్‌ ఇవ్వాలని తావ్‌డే హైకోర్టును ఆశ్రయించారు. కేసు జస్టిస్‌ ఏఎస్‌ గడ్కరి, జస్టిస్‌ పీడీ నాయక్‌లతో కూడిన ధర్మాసనం ఎదుటకు వచ్చింది. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వాదనలు వినిపిస్తూ... ‘‘పుణెలోని విచారణ కోర్టులో ఇప్పటికే 15 మంది సాక్షుల విచారణ ముగిసింది. మరో ఏడెనిమిది మందిని విచారించాల్సి ఉంది. విచారణ రెండు, మూడు నెలల్లోనే ముగుస్తుంది’’ అని వివరించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ... బెయిల్‌ పిటిషన్‌కున్న అర్హతల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనంతరం ధర్మాసనం విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని