మద్రాస్‌ హైకోర్టు అదనపు జడ్జిగా గౌరీ ప్రమాణం

మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన  పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Published : 08 Feb 2023 04:50 IST

ఆమె నియామకంపై అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

దిల్లీ/చెన్నై: మహిళా న్యాయవాది లక్ష్మణ చంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన  పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసు విచారణ సర్వోన్నత న్యాయస్థానంలో కొనసాగుతుండగానే గౌరీ.. మద్రాస్‌ హైకోర్టు అడిషనల్‌ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌరీని ఆ పదవికి ఎంపిక చేయడంలో తమకు ఎలాంటి సమస్య కనిపించడం లేదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవయ్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సంప్రదించిన తర్వాతే.. జడ్జీలను కొలీజియం ఎంపిక చేస్తుందని గుర్తు చేసింది. రాజకీయ నేపథ్యం ఉన్న వారు చాలా మంది సుప్రీంకోర్టులో పని చేశారని, ఈ పదవిలో ఉన్న వారికి రాజ్యాంగమే ప్రధానమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆమె తన విధులను రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించలేదని కొలీజియం గుర్తిస్తే శాశ్వత న్యాయమూర్తి హోదాను ఇవ్వబోదని పేర్కొంటూ గౌరీ నియామకానికి వ్యతిరేకంగా దాఖలైన రిట్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసు కోసం ప్రత్యేక ధర్మాసనం రోజువారీ సాధారణ సమయం కన్నా కాస్త ముందుగానే భేటీ అయ్యింది. విచారణ దాదాపు 25 నిమిషాల పాటు కొనసాగింది.  గౌరీ అర్హతల వివాదంపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపుతుండగానే.. మంగళవారం ఉదయం 10.35 గంటలకు ఆమె మద్రాస్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో నలుగురు కూడా న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాజా వారితో ఈ కార్యక్రమాలను నిర్వహింపజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు